ఆధ్యాత్మిక మాసపత్రికలో ఒకసారి చదవటం తటస్థించినది. అమ్మవారికి అభిషేకించిన జలంతో అభికరించుకుంటే వచ్చే సత్ఫలితాలు, అభిషేక జలంతోనే తాము అభిషిక్తులమయ్యాము. ఇటువంటి అవకాశం ‘స్వామీజీలకు, V.I.Pలకు, పీఠాధిపతులకు, ముఖ్యులకు మాత్రమే సాధ్యమట. వారు ముక్తులట, అదృష్టవంతు లట, అభిషేక జలంవలన కలిగే ఆధ్యాత్మిక ఉన్నతి గురించి అనేకానేక విశేషాలతో చాలా చాలాగొప్పగా వ్రాశారు.
సరే చదివి పులకించిపోయాను. కారణం ప్రణవస్వరూపిణి అమ్మగా కరచరణాది అవయవాలతో చర్మ చక్షువులకు సాక్షాత్కారమేనా, సామీప్యాన్ని సాన్నిహిత్యాన్ని మాత్రమే కాదు సిద్ధి, బుద్ధి ప్రదాతగా అనుగ్రహించి అవసరం అనుకుంటే మందలించి సర్వవిధములు తల్లి రక్షణ కాదు రక్షణే తల్లిగా మన అమ్మ అభిషేక ప్రియగా అభిషేక విశేషాలతో ముందుకు సాగుదాం.
1960 ల వరకు నీటిని చెరువునుంచి ఓంకారనది కాలవ నుండి నీరు తెచ్చేవారు అమ్మ స్నానాలకు, అన్నపూర్ణాలయం అవసరాలకు. పసివాళ్ళం మేము అమ్మ తొట్టిస్నానం చేసిన నీటితో మాకు స్నానాలు. కాలాంతరంలో విద్యుత్వచ్చి నీటి సౌకర్యం కలిగినా, చెరువు ఎండగట్టినప్పుడు వేసవికాలంలోనూ, గాలివానలవలన విద్యుత్ ఆగికానీ కారణం ఏదైనా నీటిని అమ్మ మేడమీద టాంకులో నింపేవారు. అమ్మ స్నానం అంటే బక్కెట్లతో కాదు గంగాళాలు, 1, 2 సార్లు కాదు. అమ్మ స్నానం చేసిన ప్రతిసారి మేడపైనుండి కాలువ ద్వారా వచ్చే నీటిని పట్టుకుని చాలామంది స్నానాలు చేశారు. పరిస్థితులకు మించిన గురువు లేడు కదా! అమ్మ చెప్పిన సూక్తి. అట్లా ప్రణవమూర్తి అభిషేక జలం ప్రాప్తం. అప్పుడు, అక్కడ ఉన్నవారంతా అభిషిక్తులు.
ఓంకారనదిలో అమ్మతో అనేక సందర్భాలలో స్నానానికి వెళ్ళినవారు అనేకమంది అభిషిక్తులు, అనేక మారులు సముద్రస్నానానికి లారీలలో ఆవరణలోనివారు ఇంకా అనేకులు అమ్మతో కారులో కాని జీపులో కాని సముద్ర స్నానాలకు వెళ్ళినవారంతా అభిషిక్తులు. అప్పుడప్పుడు మేడమీద తన నివాసంలో స్నానాల గదిని అనుకుని ఉన్న తొట్టిలో స్టూలు వేయించుకుని అందరిచే అభిషేకం చేయించుకుని తానుకూడా అక్కడ ఉన్నవారందరి మీదా పోస్తూ సరదాగా సంతోషంగా గడిపిన వారంతా అభిషిక్తులు.
ఓ సందర్భంలో ఓ పర్వదినాన, గుంటూరునుండి ఆంధ్రా బాంకు ఉద్యోగి ప్రసాదరావుగారు, విజయలక్ష్మి అక్కయ్య పాలతో, పంచామృతాలతో శుద్ధజలంతో 108 బిందెలతో వేదమంత్రాలతో శ్రీసూక్తంతో మేడమీద వరండాలో అమ్మకు శిరస్సునుంచి అభిషేకం చేసుకున్నారు. ఆ తరువాత అక్కడ ఉన్నవారందరూ అభిషేకం అమ్మ శిరస్సునుంచి చేసుకున్నారు. చివరగా అమ్మ అందరికీ ఒక్కొక్కరిగా శిరఃస్నానం చేయించింది. వీరంతా అభిషిక్తులు. అమ్మచే, అమ్మతో, అమ్మకంటే వేరు దైవం లేదనే తాదాత్మ్యంతో ఉన్నవారంతా ముక్తులు కాదా? సంఘటన తేదీ నాకు గుర్తులేదు. జరిగినది మాత్రం కాలం కాదనలేని వాస్తవం.
यस्याः परतरंनास्ति सैषा दुर्गा प्रकीर्तिता చివరగా అమ్మ రవి అన్నయ్య ఇంట్లో మేడ మీద ఉంటూ అందరిళ్ళకు వెళ్తూ డాక్టర్ సత్యం అన్నయ్య వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నారు. ఆ రోజు నాకు బాలింత స్నానం. మా బాబు ఫిబ్రవరి 2వ తేదీన పుట్టి 3వ తేదీన అమ్మలో లీనమయ్యాడు.
అమ్మ అందరిచేతా (అభిషేకం) స్నానం చేయించుకుని నా చేతకూడా పోయించుకుని, పాదాలవద్ద నన్ను కూర్చున బెట్టుకుని బాలింతస్నానం చేయించినది.
అంతా అయి ప్రశాంతంగా కూర్చున్నప్పుడు సాంబశివరావు (మా శ్రీవారు) కూడా ఉంటే బాగుండేది అన్నది. ఇది నా భావమూ, అమ్మ స్వభావమూ కూడా.
చిన్నన్న, పెద్దన్న, అక్క, వదిన, నేను అమ్మ ఇది మా కుటుంబం, అమ్మ మాకు బావగారుకూడా కావటం ఇందుకు కారణం. అమ్మ మా యింటి పెద్దల్లుడు, మా వారు చిన్నల్లుడు మా కుటుంబం పూర్తిగా ఉన్నట్లు కదా, నాలోని ఆలోచన. సరే ఏదైతేనేం ఆత్మీయ బంధం.
ప్రణవమూర్తి జగన్మాత అభిషేక విశేషాలు గుర్తున్నంతవరకూ వర్ణింప తరమా! పులకరించక మానునా నా మేను.
వేయి జన్మలేల? ఈ ఒక్క జన్మచాలదా తరించ టానికి. ఈ భావన జారనీయకుమా అమ్మా! అందరి అమ్మవైనా ఎవరికి వారికే ఆత్మీయ ఆత్మబంధానికి పరిపూర్ణమయిన ప్రణామాలు. నీవు పెట్టిన పేరుకే సార్థకత నాకు “అమ్మా కుమారి”.