శ్రీ ఏకా ఆంజనేయులు పంతులుగారు గుంటూరు నగరంలో పొగాకు వ్యాపారి. ఆడపిల్లలకు ప్రత్యేకంగా ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజి, డిగ్రీకాలేజి ఏర్పాటు చేయటానికి కృషి చేశారు. హిందూకాలేజి అండ్ హైస్కూల్స్ కౌన్సిల్ అధ్యకక్షులుగా విద్యారంగానికి ఎంతో సేవ చేశారు. సాహిత్య సాంస్కృతిక సంపన్నులై కవులను పోషించారు. గ్రంథ ప్రచురణలు కావించారు. 1961లో 200 మంది సుప్రసిద్ధ ఆంధ్రకవి పండితులచే రచనలు చేయించి 800 పేజీలు గల శాంతి అనే ఒక బృహత్ సంకలన గ్రంథాన్ని ప్రచురించారు.
1958 వ సంవత్సరంలోనే గోవిందరాజు దత్తాత్త్రేయశర్మ, ప్రసాదరాయకులపతి వంటి వారితో కలసి వచ్చి జిల్లెళ్ళమూడిలో అమ్మను దర్శించారు. తరువాత ఆశ్చర్యకరంగా వారి కుటుంబం అంతా అమ్మ వద్దకు చేరటం జరిగింది. పెద్దకుమారుడు ఏకా పుండరీకాక్షరావు గారి కుటుంబం అంతా వాళ్ళ పిల్లలు రాజ్యం, ఉష, అమ్మ గదిలోనే సేవలు చేశారు. ఏకా అంజన్ చాలా కాలం అమ్మసేవలో మాతృశ్రీ ముద్రణాలయంలో పనిచేశారు. వారి తమ్ముడు మోహన్, మానసికంగా కొంత సరిగా లేకపోవడం వల్ల పుండరీకాక్ష రావు గారు వారి శ్రీమతి సత్యవతమ్మగారు కూడా జిల్లెళ్ళమూడిలో ఉండి అమ్మసేవలో పాల్గొనేవారు. పుండరీకాక్షరావుగారు కూడా అమ్మ ఎక్కడి కన్నా కారులో బయలుదేరితే, తనే ఆ రధచోదకుడుగా ఉండేవాడు. వారి పెద్ద అమ్మాయి ఆదిలక్ష్మి బాంక్‌లో ఉద్యోగం చేస్తుండటం వల్ల ఎప్పుడన్నా వచ్చిపోతుండేది. అలాగే చివరిపిల్ల రేవతి చదువులో ఉన్నందున సెలవులలో వస్తుండేది. ఆంజనేయులు గారి రెండవ కుమారుడు శ్రీ ఏకా రాజేశ్వరరావు కూడా అమ్మ వద్దకు వచ్చారు. అమ్మ కూడా గుంటూరులో వారింటికి వెళ్ళేవారు. శ్రీ రాజేశ్వరరావు మాతృశ్రీ సంస్కృత కళాశాల, పాఠశాలల కార్యదర్శిగా చేశాడు. మంచి పాటల రచయిత. వాటిని గానం చేసేవాడు రాగయుక్తంగా. వారి కుటుంబం కూడా జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను దర్శించుకొని పోతుండేవారు. తరువాత విశాఖపట్టణంలో శ్రీ చక్రవర్తిగారు ఏర్పాటు చేసిన అమ్మ గుడిలో సేవలు చేస్తుండేవారు ఒకరు.
శ్రీ అంజన్‌కుమార్ ఆత్రేయ అమ్మ వద్దకు వచ్చిన కొత్త రోజులలోనే హైమ లోని వాత్సల్యానికి, సౌజన్యానికి, మమతా మానవతలకు ముగ్ధుడై హైమాలయంలో అభిషేకాలు ప్రదక్షిణలు చేసుకొనేవాడు. హైమ పట్ల ఎనలేని భక్తి ప్రపత్తులు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకొనేవాడు. రాజీనామా చేసి వచ్చి అమ్మ – హైమల సేవలో పాల్గొంటూ మాతృశ్రీ ప్రింటర్స్‌లో, శ్రీ విశ్వజననీ పరిషత్‌లో అకౌంట్లు వ్రాస్తూ కొన్ని సంవత్సరాలు జిల్లెళ్ళమూడిలో ఉన్నాడు.
తల్లిదండ్రులు అతడి వివాహం చేయాలని నిశ్చయించారు. అంజన్ హైమను మా అమ్మాయి అని హైమను గూర్చి ప్రేమతో ఉండేవారు. హైమకు నమస్కారం చేసి ఏమైనా సరే నా పెళ్ళికి రావలసిందే అని హైమాలయంలో ప్రార్థించాడు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం, కామధేనువు, కల్పవృక్షం, కరుణాంత రంగ కదా! వచ్చింది. అతని కోరిక నెరవేర్చింది. జిల్లెళ్ళమూడి అందరింట్లో అన్నపూర్ణాలయ వేదికమీదనే అమ్మచేతుల మీదగానే అంజన్ పెళ్ళి జరిగింది. హైమ వచ్చిందని ఎలా తెలిసిందంటే, అంజన్ మేనత్త అన్నపూర్ణమ్మగారు పెళ్ళి బడలికతో హైమాలయం దగ్గర పడుకున్నది. హైమ ఆమెను నిద్రలేపి ”నేను పెళ్ళికి వచ్చానని పెళ్ళిలో ప్రధాన కార్యక్రమాలన్నీ చూచి వెళ్ళానని’ అంజన్‌కు చెప్పమన్నది. అక్కయ్య ఆ ఆలాపనలో లేచి చూస్తే హైమ వెళ్ళిపోతూ కనిపించిందిట. ఆమె అంజన్‌కు ఈ విషయం తెలియజేసింది.
అంజన్ కూడా అవును, నేను హైమను పెళ్ళికి రమ్మని ప్రార్థించాను కాని నాకు కనిపించమని అడుగలేదు కదా! ఏమైతే ఏమి హైమమ్మ నా పెళ్ళికి వచ్చింది అని సంతోషించాడు. అంజన్ వివాహమైన తర్వాత గుంటూరులో ఏదో కంపెనీలో అకౌంటెంట్ ఉద్యోగం చూచుకొని తల్లిదండ్రి దగ్గరే ఉండేవాడు. అమ్మకూడా ఒకసారి వారింటికి వెళ్ళింది. అమ్మతో కూడా అంతడెంతో చనువుగా ఉండేవాడు.
ఒకసారి అంజన్‌కు ‘పెప్టిక్ అల్సర్’ వచ్చి మంచినీళ్ళు కూడా కడుపులోకి పోని పరిస్థితి వచ్చింది. హైమకు మొరపెట్టుకున్నాడు. అమ్మ నర్సాపురం డాక్టర్ ఆచంట కేశవరావుగారిని, నెల్లూరు నుండి డాక్టర్ శిష్టా సుబ్బారావుగారిని పిలిపించి చూపించింది. వాళ్ళు ఆపరేషన్ చేయాలనుకున్నారు. వాడు హైమకు చెప్పుకున్నాడు గదా! హైమే చూస్తుందిలే అని గోంగూర పచ్చడి కలిపి అన్నపు ముద్దలు తినిపించింది. మంచి నీళ్ళు కూడా గుటకపడని అంజన్ ఏలా తిన్నాడో, ఏమో! ఆపరేషన్ లేదు. మందూ లేదు. ఆ జబ్బు మాయమై పోయింది.
అతనికి నర్సాపురం వాస్తవ్యులు సుందరితో వివాహం అయిన తర్వాత చాలాకాలం పిల్లలు కలుగలేదు. హైమను ప్రార్థించాడు. హైమ అనుగ్రహంతో ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల కలిగి క్షేమంగా మంచి జీవనాన్ని గడుపుతున్నారు. సంసారాన్ని సంబాళించు కుంటూ ఆ అమ్మాయి పిల్లలిద్దరికీ విద్యాబుద్ధులు చెప్పించి అంజన్ 2009లో అమ్మలో కలసిపోయినా వాళ్ళ బాగోగులు వివాహాలు జరిపి వాళ్ళను స్థిరపరచింది. సుందరి కిడ్నీవ్యాధితో కాంప్లికేషన్ వచ్చి ఒక నెలరోజులు హాస్పిటల్‌లో బాధపడి 8.12.2020న అమ్మలో ఐక్యమైంది. వారి కుటుంబ సభ్యులకు పరిషత్ సానుభూతి తెలుపుతున్నది.