“అంతర్యామి… అమ్మ” అవతారపురుషుడైన శ్రీకృష్ణుడంతటివాడు, ‘రాధాచక్రార్చన’ చేసాడు. నీకు తెలుసా!…. శ్రీ శ్రీ శ్రీ పూర్ణానందస్వామి వారు (శ్రీశైలం) ఒకనాడు నాతో అన్న మాట. అవును!. కాలం గడుస్తున్న కొలదీ, మహనీయుల ఆనాటి సందేశాలు, అర్థం అవుతూ వస్తున్నాయి. మహనీయులందరూ అమ్మను ఆరాధించిన వాళ్లే.
అమ్మ ఆలయ ప్రవేశం చేసిన తరువాత, నా జీవితం అనేక మలుపులు తిరిగింది. కష్ట సుఖాలు రెండూ సమంగా చేరాయి. కొన్ని సమయాల్లో ఒంటరితనం చాలా బాధించింది. అమ్మ ఒడిలోనే ఉన్నా నన్న విషయం మరిచాను. జిల్లెళ్లమూడి నుంచి వెళ్ళేటప్పుడు, క్రింద వేన్ బయలుదేరుతూ ఉండగా, అమ్మకి దూరం అవుతున్నామే అని కన్నీళ్లు పెడుతూ ఉంటే, ఆ చల్లని తల్లి, డాబా మీద నుంచి వీడ్కోలు చెప్పిన సన్నివేశాలు మనస్సు పొరలలో, ‘మరుపు ఒడి’లో దాక్కొన్నాయి.
సరిగ్గా అప్పుడే మా పెద్ద అబ్బాయి జిల్లెళ్లమూడి వెళ్లి రావటం, అమ్మ ప్రసాదించిన అనుభవాలు అనుక్షణం గుర్తుకు రావడం జరిగింది. అతని పెళ్లి సంబంధాలు వెతుకుతున్న వేళ, ఒకామె జిల్లెళ్లమూడి నుంచి ప్రసాదం తెచ్చి ఇచ్చింది. కొద్దిరోజుల్లోనే, పూర్ణానంద స్వామి వారి శిష్యులు, తలవని తలంపుగా మా ఇంటికి రావటం, జిల్లెళ్లమూడి వెళ్లి వచ్చామని, అమ్మ కుంకుమ ప్రసాదం మాకు అందించటం జరిగింది. త్వరలోనే అతని వివాహం నిశ్చయం కావటం, సోదరులు ఐ. రామకృష్ణ గారు అమ్మ కల్యాణ అక్షతలు మా అబ్బాయి వివాహానికి “అమ్మ ఆశీస్సులు”గా ఇవ్వటం జరిగింది, ఇలా ఇంకా ఎన్ని సందర్భాలలో అమ్మ తోడు ఉంటోందో!. గమనించలేక పోతున్నా!. నేటికీ, ఏనాటికీ పిలిస్తే పలికే దైవం అమ్మ. ఆనాటి రోజులు మళ్లీ వస్తాయా!. హైమాలయ గొప్పతనాన్ని అమ్మ ఆనాడే చెప్పింది. కష్టసుఖాలని రెండింటినీ సమంగా ఎలా స్వీకరించాలో నేర్పింది అమ్మ. అతి సామాన్యుడైన ఈ మీ సోదరునికి, అమ్మ ఆనాడే కాదు, ఈనాడు కూడా ప్రేమను పంచుతూనే ఉంది. “ తృప్తే ముక్తి” అని ముముక్షువులకి అమ్మ ఇచ్చిన ఉపదేశం శాశ్వత సత్యం. అమ్మ దర్శనం ముక్తికి త్రోవే. తృప్తికి మార్గం. ఇంకేమి కావాలి! అమ్మ నామ స్మరణ తప్ప….