విశ్వజనని మాసపత్రిక సంపాదకులు – సోదరులు పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ వార్షికంగా జరుపుతున్న
ఆత్మీయ సేవాపురస్కారాలను అక్టోబర్ 15న విజయదశమినాడు అందరింట్లో ధ్యాన మందిరం వద్ద గల విశాల వేదికపై నిర్వహించారు.
ఎవరికైనా తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల పూజ్యభావం ఉండటం సహజం. అలాగే ఆత్మీయులైన తన శ్రీమతి పి.వి.జె.యస్. గిరిబాల, తన పెద్దకుమారుడు ప్రేమకుమార్ భార్గవ, తమ కుటుంబమే పరమార్థంగా సేవ చేసిన అత్తగారు పొత్తూరి వరలక్ష్మమ్మ, తనకు అమ్మను చూపించిన ఆత్మీయ మిత్రుడు, సోదరుడు తంగిరాల కేశవశర్మ, అమ్మ పెద్ద కుమారుడు బ్రహ్మాండం సుబ్బారావులను స్మరిస్తూ అమ్మ పట్ల అచంచలభక్తి విశ్వాసాలతో, అమ్మ సేవలో తరిస్తున్న సోదరసోదరీమణులను చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా పూజించి సత్కరించుకోవటం అమ్మ సేవాతత్పరుల పట్ల శ్రీ పి.యస్.ఆర్.కున్న గౌరవానికి, ఆత్మీయతకు నిదర్శనం.
ఈ సంవత్సరం నిరంతరం మాతృశ్రీ ధ్యానమగ్నుడు, సహనశీలి సోదరుడు శ్రీ మరకాని దినకర్-భానుమతి దంపతులకు, బాల్యం నుండే అమ్మను ఆరాధిస్తూ అమ్మ కరకమలాలమీదుగా తన వైవాహిక బంధాన్ని ముడివేసుకొని, కుటుంబం అందరిని అమ్మ సేవలో నిమగ్నం చేసిన శ్రీ వఝ సీతారామాంజనేయప్రసాద్ – అరుణ దంపతులకు, అమ్మే తన జీవితంగా అమ్మ చేతుల మీదుగా అమ్మ ఎన్నిన పిల్లనే వివాహం చేసుకొని, అమ్మపై మధురంగా గానం చేస్తూ, 200 మంది అమ్మభక్తులు (బిడ్డల) అమ్మతో అనుభవాలను వీడీయో తీసి భావితరాలకు అందిస్తున్న శ్రీ రావూరి ప్రసాద్-శేషప్రభావతి (ఒకవైపు హైమాలయంలో పూజారిణి) దంపతులు, అమ్మకు ఇష్టమైన సంపెంగ పూలు సమర్పించి అమ్మ చేత నీవు కామరాజువు కాదురా “ప్రేమరాజువు” అనిపించుకున్న శ్రీ దేశిరాజు | వి.యన్. కామరాజు సుందరి (కొన్ని వందల సినిమాలలో హాస్యనటునిగా అలరించిన రాజబాబు సోదరి) దంపతులకు, అమ్మ చేత సోదరుడు శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణ అల్లునిగా ఎన్నిక చేయబడ్డ మాతృశ్రీ సేవాపరాయణుడు శ్రీ వారణాసి ధర్మసూరి- భగవతి దంపతులు, విశ్వజననీ పరిషత్ స్థానిక కార్యదర్శిగా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సమర్థవంతంగా నొప్పింపక తానొవ్వక పనిచేసే సామర్థ్యం గల శ్రీ భట్టిప్రోలు రామచంద్ర అమ్మ సాహిత్యంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందిన ప్రిన్సిపాల్ సుగుణ దంపతులను నూతన వస్త్రాలతోనూ, అయిదు వేల రూపాయలు చిరుకానుకతోను సత్కరించి ధన్యుడైనాడు సోదరుడు పి.యస్.ఆర్. సత్కారాలకు ఎవరూ సుముఖులు కాకపోయినా అమ్మ ఆశీస్సులుగా భావించి స్వీకరించిన అందరికీ నమస్సులు సమర్పించారు. శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు తోడ్పాటుతో ఈ సేవాపురస్కృతి కార్యక్రమం పూర్తి చేయబడింది.