1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అందరూ బిడ్డలే

అందరూ బిడ్డలే

Kondamudi Subba Rao
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 21
Month : October
Issue Number : 3
Year : 2021

ఒకసారి ఒక సోదరుడు అమ్మ తో ” అమ్మా! మేము నిన్ను దైవం అని నమ్ముతున్నాము. మా జీవనానికి జీవితానికి నీవే మూలం అనీ అనుకుంటున్నాము. అయినా మాకు నీ నుండి ఎన్నో దాపరికాలు. ఎన్నో రహస్యాలు. మా ఉద్యోగాలు వ్యాపారాలే మాకు సర్వస్వం. మా బ్రతుకే మాకు ముఖ్యం. కనీసం మా బ్యాంకు అకౌంట్లను మా కుటుంబానికే గాని నీకు సరెండర్ చేయలేక పోతున్నాము. వట్టి స్వార్థజీవనులం.” అన్నాడు. అమ్మ “నాన్నా నువ్వు చాలా పొరబడుతున్నావు. నువ్వు బ్రతుకుతున్నది నా కోసమే. ఉద్యోగం చేస్తున్నది నా కోసమే. నువ్వు ఏంచేసినా నా కోసమే. అది నాకే చెందుతుంది. ఈ విషయంలో నువ్వు దిగులు పడకు. ఈ కనుపించేవన్నీ నా బిడ్డలే. నీ కుటుంబం కూడా నా బిడ్డలే.. నా బిడ్డ కాని ప్రాణి, వస్తువు…. ఏమీ లేదు. నువ్వు నా బిడ్డవే. నీ కుటుంబ సభ్యులూ నా బిడ్డలే.. ఈ సృష్టి లో ఏ ప్రాణికీ కాకుండా నీ శక్తి, సేవలూ ఎక్కడికి పోతున్నాయి?

ఇందులో ఎవరికి చెందినా అది నా బిడ్డలకి చెందినట్లే. అంటే నాకు చెందినట్లే. కనుక స్వార్థం అన్న ప్రసక్తే లేదు. అంతా పరమార్థమే కనుక చేసే ఏ పని అయినా నాకోసమే అని భావించి శ్రద్ధగా ప్రేమగా చేయి” అని హితోపదేశం చేసి అతనిలో కొడిగట్టిన జీవితేచ్ఛను ఉజ్జ్వలం చేసింది. ఔను అమ్మ ప్రతి సందర్భంలో తన జగన్మాతృత్వాన్ని ప్రకటించింది. నక్సలైట్లు బిడ్డలే దేవుడూ బిడ్డే.

అమ్మ ఒక సారి నెల్లూరు లోని శ్రీ రంగనాధస్వామి ఆలయానికి వెళ్ళింది. ఆలయంలోకి వెళుతుండగానే గర్భగుడిలో తల్పశాయి అయిన రంగనాథుడు అమ్మకు కనిపించాడు. అమ్మ ఇక, చకచకా గర్భగుడి ప్రవేశించింది. రంగనాధుని సమీపించింది. ఆ హృదయంలో వాత్సల్యం పొంగులువారటం ఆ ముఖంలో కన్నులలో ద్యోతితమవుతూనే ఉన్నది. అమ్మ ఆ విగ్రహాన్ని ప్రేమగా నిమరటం ప్రారంభించింది. ఆది రాయిగా కఠినంగా తగలలేదేమో ఆ ప్రేమాన్విత స్పర్శలో అమ్మ పులకించిపోవటం ప్రక్కనున్నవారికి విదితమవుతూనే ఉన్నది. అమ్మ హృదయోద్భూత ఆనంద తరంగాలు అందర్నీ సోకుతూనే ఉన్నాయి. అర్చక స్వామి పోసిన జలాన్ని అమ్మ ప్రేమతో రంగనాధునిపై చిలకరించింది. భక్తితో తనను అలకరించిన సుమమాలను తనమెడ నుండి తీసి అనురాగపూర్వకంగా రంగనాధునికి యిచ్చింది. అమ్మ మామూలుగా ఏ బిడ్డ యింటికి వెళ్లినప్పుడు ప్రేమను ఎట్లా అభివ్యక్తం చేస్తుందో, ఆ దేవాలయంలోను అలాగే చేసింది. అమ్మ దృష్టిలో నరుడూ నారాయణుడు ఒక్కటే. బిడ్డలూ దేవుళ్ళే. దేవుడూ బిడ్డే. 

వరదకూడా బిడ్డే.

1969 మే 19వతేది ఉదయం. అప్పుడే తెల్లవారుతుంది. వరద వెల్లువ రావడమే మత్తగజం వలే మహోధృతంగాను, కోడెత్రాచు వలె బుసలు కక్కుతూనూ వస్తున్నది. జనత భయవిహ్వలమై పోయింది. అందరు ఇళ్ళు ఖాళీ చేస్తున్నారు.

అమ్మ గదిలో నుండి బయటకు వచ్చింది. మేడ మీద నుండే నాలుగు దిక్కుల కలయచూసింది. అమ్మ పెదవులపైనా, కనుగొలకుల్లోనూ దరహాసదీప్తులు భాసించాయి. ఎవరికీ ఏమి అర్దంకాలేదు. వెంటనే చీర, రవిక, పసుపు కుంకుమలూ, కొబ్బరి చిప్పలు గంగాభవానికి యిస్తూ ఆడపిల్లను ఊరికే పంపట మెందుకూ! అని అమ్మ అందరివంకచూసింది.

వరదాయినికి వరద కూడా బిడ్డే. 

పత్రిక కూడా బిడ్డే

మాతృశ్రీ పత్రిక ప్రారంభోత్సవ సమయంలో నిర్వాహకులు ఎన్నిసార్లు పత్రిక అన్నా అమ్మ, “పుత్రిక” అని సరిచేసింది. జడం, చైతన్యం అని భేదం లేకుండా సమస్త సృష్టిని తన బిడ్డగానే భావించింది.

మరొక సందర్భంలో సోదరులు డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణ మూర్తి గారు, వీరమాచినేని ప్రసాదరావు గారు అమ్మ సమక్షంలో అమ్మ డైరీలు ప్రక్కన పెట్టుకొని అమ్మవాక్యాలు సమీక్షించారు. ఆ సందర్భంగా కొన్ని అమ్మవాక్యాలను అమ్మ దృష్టికి తెచ్చి అమ్మా! ఈ వాక్యాలు నీ ప్రతిష్ఠకు భంగకరంగా ఉన్నాయి, వీటిని తీసి వేద్దాము అని విన్నవించారట. అమ్మ వెంటనే “నాన్నా! ఒక తల్లికి నలుగురు సంతానం ఉన్నారనుకో. వారిలో ఒకరు అప్రతిష్టకరంగా ఉన్నాడని, వాడిని తన సంతానం కాదని అనుకుంటుందా?” అని ప్రశ్నించింది. అమ్మ సర్వ మాతృత్వానికి విస్తుపోవటం వారి వంతు అయింది.

గడ్డ కూడా బిడ్డే.

అమ్మ బిడ్డలందరి రోగాలు తాను తీసుకున్నందు వలననేమో తరుచూ రోగాల బారిన పడింది. కాలానికి తగ్గట్టుగా అన్నట్లు మధుమేహంతో అమ్మ బాధ పడేది. అందువలన అమ్మకు తరుచూ శరీరంపై గడ్డలు వచ్చేవి. అలా ఒకసారి పెద్దగడ్డ వచ్చింది. ఆపరేషన్తో తొలగించాల్సిన పరిస్థితి. హాస్పిటల్ కు వెళ్ళలేని పరిస్థితి. కనుక వైద్యులు సాహసించి అమ్మ మద్దతుతో స్టెరిలైజ్ చేసిన బ్లేడుతో ఆ గడ్డ తొలగించారు. అందరు ఊపిరి పీల్చుకున్నారు. కాని అమ్మ దిగులుగా కనిపించింది. “అమ్మా ఇంకా బాధగా ఉందా?” అని రామకృష్ణ అన్నయ్య ప్రశ్నించాడు. అమ్మ “అదేం లేదురా. కాని అది దూరం అయింది కదరా” అన్నది. ఏదో వారికెవరికి స్ఫురించలేదు. ప్రశ్నార్థకంగా అమ్మ వంక చూశారు. అమ్మ “అదేరా ఆ గడ్డ!” అన్నది. ఆ సమాధానానికి ఆ సర్వమాతృత్వానికి విస్తుపోయి తేరు కోవటానికి చాలా సేపు పట్టింది. ఔను మరి అమ్మకు గడ్డ కూడా బిడ్డే! 

తనను బాధించే శరీరంపై గడ్డను కూడా బిడ్డ అనుకోవటం అమ్మకే చెల్లింది.

నభూతో న భవిష్యతి

జయహోమాతా

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!