ఇరువురు మహానుభావులు. ఒకరు అపారమైన వైద్యశాస్త్ర విజ్ఞానగని. మరొకరు భక్తితత్వాన్ని ఔపోసన పట్టిన భక్తితత్వ నిధి. ఒకరు తన అపారమైన వైద్యశాస్త్ర నేపధ్యంలో అమ్మ చేయి పట్టుకుని నాడి చూసిన ధీశాలి. మరొకరు తన అపారభక్తి పారవశ్యం లో అమ్మ కే తీర్థం లో వేసిన భాగ్యశాలి. ఆధునిక వైద్య శాస్త్రానికి, అమ్మ కల్పించే రక్షణ విధానానికి సంధానకర్త ఒకరు. సనాతన సంప్రదాయానికి, అమ్మ తత్వానికి వారధి మరొకరు. అమ్మనే తన ఇంటికి తీసుకెళ్ళి అన్నపూర్ణాలయమే తన ఇంట స్థాపించిన ఉదారహృదయుడు ఒకరు. అమ్మ భావనే ప్రేరణగా తమ ఇంటినే మరో అన్నపూర్ణాలయం చేసిన ధీమంతుడు మరొకరు. బయట మహావైద్యుడు, జిల్లెళ్ళమూడిలో అమ్మకే నాడి చూపించుకుని తన దీర్ఘవ్యాధి నుండి విముక్తుడైన వారు ఒకరు. జిల్లెళ్ళమూడిలో సనాతన వాది, బయట మానవతా వాదిగా అమ్మ తత్వాన్ని క్రియా రూపంలో ఆవిష్కరించిన వారు మరొకరు.
అమ్మకు కారు ఇవ్వాలన్న తన కోరికను అణుచుకుని అమ్మ కోరిక మేరకు జిల్లెళ్ళమూడిలో అన్నపూర్ణాలయ షెడ్ నిర్మించిన వారు ఒకరు. అమ్మ కోరికను తన కోరికగా మార్చుకుని ఎక్కడ జన సమ్మేళనాలు ఉంటే అక్కడ అందరి ఆకలి తీర్చేవారు మరొకరు. తన కోరికను తీర్చుకోవటానికి అమ్మ దగ్గరే దీక్షచేసిన వారు ఒకరు. అమ్మ గుడిలో ఎన్నో దీక్షలు చేసి మనోరధం ఈడేర్చుకున్నవారు మరొకరు. అమ్మ తలుచుకుంటే చాలు రెక్కలు కట్టుకుని వ్రాలి అమ్మ చెప్పిన వారికి స్వస్థత కూర్చి అమ్మ కే సంతోషం కలిగించే వారు ఒకరు. అమ్మ సమక్షం లో తన హాస్యచతురతతో అమ్మనే నవ్వించిన వారు మరొకరు. ఎవరు అనారోగ్యం పాలైనా అమ్మ వారిని తన దగ్గరకే పంపేది. అలా అమ్మ విశ్వాసాన్ని చూరగొన్న మహావైద్యుడు ఒకరు. అమ్మ బిడ్డలు ఎవరు వారి ఊరు వెళ్లినా, వారిని తమ ఇంటికి పిలిచి అన్నం పెట్టే అమ్మ లాగా ఆదరించే సంస్కార వంతుడు మరొకరు.
తమ్ముడి పెళ్ళితో జిల్లెళ్ళమూడికి నడిచి, ఆ నడక అమ్మ అందరింటి లోకి సాగించారు ఒకరు. తండ్రి వెంట నడిచి కుటుంబ యుక్తంగా అమ్మ కే అంకితం అయినారు మరొకరు. ఆ అన్నయ్యలు డాక్టర్ శిష్ట్లా వెంకట (S సుబ్బారావు గారు ఒకరు. శ్రీ జన్నాభట్ల వీరభద్ర శాస్త్రి గారు మరొకరు. వారు ఇరువురు అమ్మ దారిలో నడిచి గత నెలలో అమ్మ దరి చేరారు. ఆప్యాయంగా అమ్మ ఒడిలోకి తీసుకునే ఉంటుంది. ఆ కుటుంబాలకు అమ్మ ఈ దుఃఖం తట్టుకునే ఆత్మస్థైర్యం కలిగిస్తుందని నా సంపూర్ణ విశ్వాసం.