శేషు అమ్మ అనురాగబంధం; హైమక్కయ్య ఏకోదర సంబంధ మధుర బంధానికి సాకారరూపం.
కీ॥శే॥ రాజుపాలేపు రామచంద్రరావు గారి జ్యేష్ఠ కుమారుడు శ్రీరాజుపాలెపు వెంకట శేషగిరిరావు. ఆ సోదరుని అమ్మ ముద్దుగా ‘శేషు’ అని పిలిచేది. అమ్మతోను, హైమతోను అత్యంత ఆత్మీయతానుబంధం గల సోదరీసోదరు లలో ఎక్కిరాల భరద్వాజ, శేషు ముందు నిలుస్తారు. 1958లో వచ్చి అమ్మ ఒడిలో, బడిలో పెరిగిన స్నేహశీలి శేషు.
ఆ రోజుల్లో అమ్మ మంచం మీద పడుకునేది. మేమంతా నేల మీద మట్టి గడ్డల్లో తల అమ్మ మంచం వైపు పెట్టి కాళ్ళు చాచుకుని పడుకునే వాళ్ళం. అమ్మకేంద్రం – సూర్యుడు; మేమంతా సూర్యకిరణాలు. నేను అమ్మతో Carroms, table-tennis, వైకుంఠపాళీ ఆడాను” – అంటారు శేషు. అంతేకాదు. సో॥శేషుకి అమ్మ ప్రాణదానం చేసింది.
1960లో BSc (Geology) 2 వ సంవత్సరము చదువుతున్నారు. పరీక్షల ముందు రోజుల్లో జీవన్మరణ పరీక్ష ఎదురైంది. శేషుకి, వారి తల్లి శ్రీమతి సీతారత్నం గారికి ఒకేసారి మశూచి సోకింది. ఆ మహమ్మారి ఇరువురినీ కబళించబోయింది. డాక్టర్లు చెప్పారు వారు మృత్యుముఖంలో ఉన్నారు అని, రామచంద్రరావుగారి గుండె బీటలు వారింది. “అన్నయ్యను బ్రతికించమ్మా “అని హైమ అమ్మను ప్రాధేయపడింది. అమ్మ కరుణించింది. విధాత రాతని తిరిగి రాసింది. ఒకనాటి రాత్రి అమ్మ గది అంతా మశూచి దుర్వాసనతో గుప్పుమంది. మర్నాటి నుంచి వ్యాధి తగ్గుముఖం పట్టి వారిరువురు పునరుజ్జీవితులైనారు. మరి ఆ వ్యాధి తీవ్రతాకిడిని అమ్మ స్వీకరించిందా?
సో॥ శేషుకి ఆడపడుచులు లేరు. ‘అన్నయ్యా’ అనే హైమ పిలుపుకి, మృదుమధుర ఆత్మీయతా బంధానికి శేషు పరవశించారు. హైమ వారికి ఉత్తరాలు వ్రాసేది. హైమ జ్ఞాపకార్థం ఆమె ధరించిన దుస్తుల్ని శేషు పదిలంగా భద్రపరిచారు. హైమ ఆలయ ప్రవేశం చేసిన సమయంలో భరద్వాజని, శేషుని అమ్మ తనప్రక్కనే ఉంచుకున్నది. జైపూర్ హైమ శిల్పాన్ని రూపొందించిన సమయంలో హైమ ముఖకవళికలు, ఆకృతి, సౌష్ఠవం ఇత్యాది వైనాల్ని శేషు స్వయంగా పరికించి ధృవీకరించిన తర్వాత విగ్రహానికి తుది రూపాన్ని ఇచ్చారు.
శేషు B.Ed చేసి వేటపాలెంలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. తరువాత మద్రాసులో AMIE చదివారు. అచ్చట Commemara Libraryలో విస్తృతంగా గ్రంథ పఠనం చేశారు. వారి మాతామహులు శ్రీ అడుసుమిల్లి శ్రీనివాసరావుగారు. ఆయన వేటపాలెంలో ‘సారస్వత నికేతనం’ అనే బృహత్తరమైన గ్రంథాలయాన్ని స్థాపించారు. శేషు వేటపాలెం గ్రంథాలయంలోని గ్రంథాలన్నీ ఇంచుమించుగా అధ్యయనం చేశారు. ఒకసారి అమ్మ వారిని “నాన్నా! పుస్తకాలన్నీ చదివాక నీకు ఏమినిపించింది?” అని అడిగింది. అందుకు వారు “చదవకముందు empty vesselగా ఉంది; చదివాక dustbinలా ఉంది” అన్నారు. “సాహిత్యంతో రాహిత్యంకాదు” అనే అమ్మ వాక్యానికి అక్షరరూపభాష్యాన్ని అందించారు. పిదప MA English చేసి వేటపాలెంలో ఆంగ్లోపన్యాసకులుగా పనిచేశారు.
వారి గ్రంథ పఠనం వలన కలిగిన సాహిత్య జ్ఞానంతో, అమ్మ యందలి భక్తి ప్రపత్తులతో భక్త్యావేశంలో తన ఆవేదననే ఆరాధనగా గేయాల మాల కట్టారు. అది గ్రంథ రూపం దాల్చింది. అదే ‘రాగబంధం’. శేషు అమ్మ జీవితాన్ని లోతుగా అధ్యయనం చేశారు. అమ్మ దుర్నిరీక్ష్య; అమ్మ విధానం ఆశ్చర్యకరం. అమ్మ ముళ్ళబాటలోనే పయనించాలనీ, అగ్నిగుండంలో ఆడుకోవాలని కోరుకున్నది. వ్యధాభరితమైన దుర్భరమైన అమ్మ జీవనయానంలోని వడగాడ్పులు, ఇసుక తుఫానులు చూసిన కోమల హృదయులు. శేషు చలించి పోయి తన రక్తంతో అమ్మ శ్రీచరణాలకు పారాణి దిద్దారు.
శేషు తండ్రి శ్రీరామచంద్రరావుగారు అమ్మ ప్రత్యక్ష సన్నిధిలో అనేక అలౌకిక అనుభవాల్ని పొందారు. వారు అమ్మచేతిలో పటుతరమైన ఉపకరణం; తాను దర్శించిన సత్యాలను, అమ్మ వివరించిన స్వీయ జీవిత అపూర్వ సంఘటనలను ఆంధ్ర, ఆంగ్ల భాషలలో చిన్నచిన్న డైరీలలో అక్కడే వ్రాసుకునేవారు. ఇంటికి వచ్చాక వాటిని శేషు స్ఫుటంగా వ్రాసి భద్రపరిచారు; ప్రాణాధికంగా పదిలపరిచారు. అందు కొన్ని భాగాలు ‘అమ్మ అవతార సమయములు’ శీర్షికన ‘మదర్ ఆఫ్ ఆల్’ లో ప్రచురితమైనాయి.
నేడు శేషు స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఆయన ఉండి ఉంటే, మిగిలిన వారి తండ్రిగారి అనుభవ పూర్వక సాహిత్యాన్ని డీకోడ్ చేసి అందించేవారు. ఆ నిధి నేటికీ శ్రీ అనంతపద్మనాభస్వామి ఆలయ నేల మాడిగలలోని సంపదలా వెలుగు చూడలేదు. వారి కుటుంబ సభ్యుల సహకారంతో అమ్మ ఆశీస్సులతో భవిష్యత్తులో వెలుగులోకి తప్పక వస్తుందని ఆశీద్దాం.
శేషుకి అమ్మ, హైమ రెండు కళ్ళు. వారి అచంచలమైన విశ్వాసం, ఏకాగ్రత, సేవాతత్పరత, ఆర్ద్రహృదయం, భావ ఔన్నత్యం, గుండెలోతు అనితరసాధ్యం, ఆదర్శప్రాయం. వారి విధానం విలక్షణమైనది. సూర్యాస్తమయం అయిన తర్వాత ఏదో సమయంలో అమ్మ దరి చేరేవారు. రాత్రి అంతా ఆరాధించే వారు; సూర్యోదయాత్పూర్వమే నిష్క్రమించేవారు. వారు వచ్చినదీ, వెళ్ళి నదీ ఎవరికీ తెలియదు. వారి మధ్య అనురాగ బంధం, అవినాభావ సంబంధం అగ్రాహ్యములే.
సహోదరి హైమవలె శేషు స్మితపూర్వాభిభాషి. “మా ఇంటికిరండి. మా నాన్నగారి డైరీలను చూపిస్తాను” అని సాదరంగా ఆహ్వానించేవారు. వారికి దాపరికం లేదు.
శ్రీ రామచంద్రరావుగార్కి అబ్బాయిలు ఇద్దరే. కానీ శేషుకి ఇద్దరు తమ్ముళ్ళు; ఒకరు రకం పంచుకుని పుట్టిన రామకృష్ణ: మరొకరు అనురాగ రక్తాన్ని పంచుకుని పుట్టిన బ్రహ్మాండం రవీంద్రరావు. ఒకే కంచంలో తిని, ఒకే మంచం మీద పడుకున్న సాన్నిహిత్యం, సాహచర్యం వాళ్ళది. శ్రీ రవి అన్నయ్య గృహప్రవేశానికి శేషు వచ్చారు. ఆయన సామాన్యమైన కెమేరాతో అరుదైన అపూర్వమైన అమ్మ ఫోటోలను, సన్నివేశాలను చిత్రీకరించారు.
“నీ మమతల పందిరి నీడలో…. నిను కొలిచే భాగ్యము ఎవరికోలే” అనేది సో॥ శేషు చిరకాల జీవిత ఆకాంక్ష. జిల్లెళ్లమూడిలో అమ్మ మమతల పందిరి నీడలో ప్రశాంతంగా శేష జీవితాన్ని గడపాలని కోరుకున్నారు. కాని హైదరాబాద్లో 7.6.2015 తేదీన 72 సంవ్సతరాల ప్రాయంలో సో॥ శేషు అంతిమ శ్వాస విడిచి ఆద్యంతాలు లేని అమ్మలో లీనమైనారు.