ఈ ఏడాది ఆగస్టు 24 వ తేదీ నాకు అత్యంత విషాదాన్ని మిగిల్చింది.
నా జీవిత భాగస్వామి శ్రీ శివరావుగారు అమ్మలో ఐక్యమైపోయారు. ఈ సందర్భంలో నా అనుభవాలు ఎన్నో మీతో పంచుకోవాలి అని ఈ వ్యాసం రాస్తున్నాను.
మామూలుగా మా జాతకాలు చూసే ఒక మిత్రుడు మా చేతులు చూసి నా 40వ ఏట మావారికి గండం ఉంది అని న్యూమరాలజీ ప్రకారం ఉంగరాలు చేయించి మాకు పెట్టారు.
1993 నాకు 39 ఏళ్లు నిండి నలభైయవ సంవత్సరం ప్రవేశించింది. నాకు విపరీతమైన భయం పట్టుకుంది. అప్పుడు మేము బెంగళూరులో వున్నాం. సోదరుడు ఐ. రామకృష్ణకు ఫోన్ చేసి ఇదీ విషయం. నాకు గుండె ఆగిపోయే లాగా వుంది. నేను ఏం చేయను?” అని బాధపడ్డాను.
“అందరి జాతకాలనూ శాసించే అమ్మను నమ్ముకోండి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం లలితా సహస్రం, త్రిశతి, ఖడ్గమాల చేసుకోండి. ఒకసారి వెళ్లి అమ్మ దర్శనం చేసుకుని రండి ఆ తల్లి రక్షిస్తుంది.” అని చెప్పారు. వెంటనే ప్రారంభించాను.
జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను దర్శించుకుని ప్రసాదం తీసుకుని వెళ్ళాం. కర్ణాటకలో నిమ్మకాయ డొప్పలలో నేతి దీపం వెలిగించి రాహుకాలంలో అమ్మవారికి హారతి ఇవ్వటం ఒక పద్ధతి.
ప్రతి శుక్రవారం ఉదయం రాహు కాలం సమయంలో మా ఇంటికి దగ్గరగా ఉన్న బనశంకరి దేవి ఆలయంలో నిమ్మకాయల హారతి ఇచ్చే దాన్ని.
16 వారాలు హారతి ఇచ్చి కొత్త చీరె సమర్పించి నిమ్మకాయల దండ వేసి మళ్లీ హారతి ఇవ్వటం మొదలుపెట్టే దాన్ని. అలా నాలుగైదు సంవత్సరాలు చేశాను. ఆ సమయంలో కూడా ఆ సేవ చేస్తూనే ఉన్నాను. పది నెలలు గడిచాయి. ఒకరోజు మధ్యాహ్నం పూట నిద్రపోతూ ఉండగా ఒక కల. జిల్లెళ్ళమూడిలో అమ్మ ఆలయం. విగ్రహ స్థానంలో అమ్మ సజీవంగా కూర్చుని వున్నారు. నేను ఎదురుగుండా కూర్చుని సమస్య చెప్పుకున్నాను.
“విధిరాతను తప్పించలేం కదమ్మా!” అన్నది. అమ్మ. హృదయ విదారకంగా ఏడ్చాను.. కాసేపటి తరువాత తన నుదుటి కుంకుమ తీసి నాకు బొట్టు పెట్టారు అమ్మ. మనసారా ఆశీర్వదించారు.
అంతే. మెలకువ వచ్చింది. వెంటనే వెళ్లి రామకృష్ణకి ఫోన్ చేశాను. “ఇక అమ్మ చూసుకుంటుంది. మీ చర్మంతో చెప్పులు కుట్టించినా అమ్మ ఋణం తీరదు.” అన్నారు. గండం గడిచింది.
మళ్లీ 1996 లో ఆయనకి పచ్చ కామెర్లు వచ్చి. చాలా సీరియస్ చేసింది. ఆ సమయంలో కూడా ఐ. రామకృష్ణ కి ఫోన్ చేశాను. “అమ్మ కుంకం పంపిస్తాను అక్కయ్యా. భయపడకండి” అన్నారు.
పదవ తారీకున ఆయన పంపించిన కుంకం 12 వ తారీఖున చిత్తరంజన్ చేరింది. మనిషి కూడా అంత వేగంగా బెంగళూరు నుంచి చిత్తరంజన్ రాలేడు. ఆ సాయంత్రమే మా వూరి పక్క రూప్ నారాయణపూర్ లో ఉండేనాయుడు గారు అనే ఆయన వచ్చారు. ఆయన పసికర్లకు పసరు వైద్యం చేస్తారు. “ఇవాళే ఊరు నుంచి వచ్చాను. సార్ విషయం తెలిసింది వచ్చాను” అన్నారు. మర్నాడు ఉదయం నుంచి వైద్యం ప్రారంభించారు. వారికి నయం అయింది. “వైద్యం ప్రారంభించాను కానీ నాకు నమ్మకం లేదు. దేవుడి మీద భారం వేసి పసరు ఇచ్చాను” అన్నారు ఆయన ఆ తరువాత)
2014 లో మళ్లీ ఒక మిరాకిల్. మా పెద్ద అడపడుచుకి సుస్తీ చేస్తే ఆవిడని నిమ్స్ లో చేర్పించారు. అక్కడ తనకి కొద్దిగా ఆయాసంగా ఉంది అని పరీక్షలు చేసి స్టెంట్ వేయాలి అని చెప్పారు. రైల్వే హాస్పిటల్ ద్వారా రిఫర్ చేయించుకుని యశోదకు వెళ్లి స్టెంట్ వేయించడం అంతా రెండు రోజుల వ్యవధిలో జరిగిపోయింది. స్టెంట్ వేశాక నేను చూడటానికి వెళితే వారి పక్కన అమ్మ నిలబడి ఉంది. ఆ గండం గడిచింది.
2016 మార్చిలో స్కూటర్ మీద వెళ్తూ వుంటే మెట్టు గూడ చర్చ్ ఎదురుగా యాక్సిడెంట్ అయింది. తనే లేచి అటోలో రైల్వే హాస్పిటల్కి వెళ్ళారు. మోచేతికి ఫ్రాక్చర్, కాలికి హెయిర్ లైన్ ఫ్రాక్చర్. ఆరు వారాలు మంచంలో ఉన్నారు. ఆ గండం గడిచింది. ఈ ఏడు ఫిబ్రవరిలో నిమోనియా ఎటాక్ అయి హాస్పిటల్లో . చాలా సీరియస్ అన్నారు. ఆ గండం కూడా చేర్చాం. చా గడిచింది. ఆహారం సహించక అవస్థ పడుతూ ఉంటే ఏప్రిల్ నెలలో అమ్మ పుట్టినరోజుకు వచ్చి అన్నపూర్ణాలయంలో ప్రసాదం తింటూ ఆయన కోసమే ప్రార్థన చేశాను. తిరిగి రాగానే అమ్మ దయ వల్ల ఆయన మామూలుగా ఆహారం తీసుకోవడం ప్రారంభించారు.
ఆగస్టు 22 న మళ్లీ హాస్పిటల్ కి తీసుకు వెళ్లాల్సి వచ్చింది. బాగానే ఉన్నారు. 23 న స్పెషల్ వార్డుకి మారాం. 23 రాత్రంతా నిద్రపోలేదు. “నాకు అమ్మ కనిపిస్తోంది. దేవుళ్ళందరూ కనిపిస్తున్నారు” అన్నారు. నాలుగు గంటలు దాటాక నిద్రపోయారు.
24 మామూలుగా ఆరు గంటలకి నిద్ర లేచాం. కాఫీ తాగాము. ఇంజక్షన్ ఇవ్వటానికి వచ్చిన నర్స్తో లోకాభిరామాయణం మాట్లాడారు. ఎనిమిది గంటలకు కొంచెం ఎన్సూర్ తాగండి అన్నాను. అలాగే అన్నారు. ఎన్సూర్ కలిపి బెడ్ పైకి లేపి కూర్చోబెట్టి భుజం చుట్టూ చెయ్యి వేసి ఒక గుక్క ఇచ్చాను. తాగారు. రెండో గుక్క ఇద్దామంటే కళ్ళు మూసుకున్నారు. అంతే.
ఒకరి చేత చేయించుకోలేదు. ఆఖరి రోజు దాకా తన పనులు తనే చేసుకున్నారు. అమ్మ దగ్గరికి వెళ్ళి పోయారు. ఇలా ఎందుకు చేసావమ్మా! అని అమ్మను అడిగే హక్కు నాకు లేదు. వారిని ఎన్నోసార్లు కాపాడింది. 78 ఏళ్లు జీవించారు. తన బాధ్యతలన్నీ తీర్చుకున్నారు. ఇంకా బాధపడటం వద్దు. విముక్తి కలిగిద్దాం అనుకుందేమో! అమ్మ తీసుకువెళ్లిపోయింది.
నాకు ఏ స్థితిలో అయినా అమ్మే దిక్కు, ఇప్పుడు ఈ దుఃఖంలో నాకు అండగా నిలిచి నన్ను ముందుకు నడిపించి నా జీవితం కూడా ఏదో విధంగా నీకు సేవ చేస్తూ కడ తేర్చవలసిన బాధ్యత నీదే తల్లీ! అని ఆ తల్లి పాదాల మీద పడి వేడుకుంటున్నాను.
అందరింటి సోదర సోదరీమణులు ఎంతోమంది నా కష్ట సమయంలో నాకు సానుభూతి తెలిపారు. విశ్వజనని పత్రికలో ఆయన ఆత్మకు శాంతి కలగాలి అని ప్రకటించారు. అందుకు నేను మా పిల్లలు అందరికీ మనసారా కృతజ్ఞతలు తెలియ జేసుకుంటున్నాం.
మరొక్కసారి అమ్మ పాదాలకు శత సహస్ర వందనాలు సమర్పించుకుంటున్నాను.
జయహోూ మాతా!