“జిల్లెళ్ళమూడిలో స్త్రీరూప ధారిణియై దిగివచ్చి నిల్చినది దివ్యమాతృప్రేమ…….” అని వర్ణించారు అమ్మ అనన్య సామాన్యమైన వాత్సల్యామృత గరిమని.
“ఆత్మసంహననోద్యుక్తపుత్రప్రేమప్రవర్షిణీ” అని స్తుతించారు పన్నాల వారు అంబికాసహస్రంలో.
ఎందరు ఎన్ని విధాల కీర్తించినా, నిజానికి అమ్మ ప్రేమ స్వరూపాన్ని వివరించాలంటే భాషలో చాలినన్ని పదాలు లేవు. అమ్మ ఈ భూమిపై సంచరించిన 63 సంవత్సరాల స్వల్ప కాలంలో ఎవరికి ఎంత ప్రాప్తమో అంత అందుకున్నారు. నది నిండా నీరున్నా అంతా తాగలేం కదా!
నాదొక చిన్న అనుభవం. ఒక శనివారం బ్యాంక్ మూయగానే జిల్లెళ్ళమూడి బయలుదేరాను మోటార్ సైకిల్ మీద. దారిలో చిన్న ఏక్సిడెంట్. పెద్దగా లేదు గాని, ఏదో చిన్నగా గీసుకు పోయింది. లైట్గా కాసేపు మంట పుట్టింది. జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మ దర్శనం చేసుకుని వరండాలోకి వచ్చి ఎవరూ చూడకుండా తగిలిన గాయాన్ని ఒంటరిగా కూర్చుని పరిశీలించు కుంటున్నాను. ఇంతలో ఎక్కడినుండి వచ్చిందో అమ్మ అక్కడికి వచ్చింది. “ఏమిటిరా! వడ్డావా? అయినా నీకెందుకురా దున్నపోతులాంటి ఆ మోటార్ సైకిల్? బల్లిలా ఇంత వుంటావు దానిమీద” అని సన్నగా మందలిస్తూ, వసుంధరక్కయ్యని పిలిచి “ఇవ్వాళ శనివారం. వాడు అన్నం తినడు. దోసెలు వేసి పెట్టు” అని చెప్పింది. నేను శనివారం రాత్రి భోజనం చెయ్యనని అమ్మకు ఎప్పుడు చెప్పాను? అమ్మ మందలింపులో కూడా ఎంత మాధుర్యం!!
సరే! అది అలా వుంచండి. అమ్మ వత్రోత్సవ వైభవ కార్యక్రమాలు 1983లో జరిగాయి. ఆరోజు కూడా స్వర్ణోత్సవాల లాగా లక్షమంది కాకపోయినా అరవై వేలమంది పైమాటే భోజనాలు చేశారు. మేమంతా ఆ కార్యక్రమంలో పాల్గొనే మహద్భాగ్యం కలిగింది. ఆరోజు కూడా శనివారం అయింది. అందరూ భోజనాలు అయేసరికి సాయంత్రం అయిదు దాటింది. ఆ సాయంత్రం దాదాపు ఏడు గంటల సమయంలో అమ్మ ఇప్పుడు శేషక్కయ్య వుంటున్న పోర్షన్ ముందు భాగంలో సోఫాలో కూర్చుని వుంది. అందరూ దర్శనాలు చేసుకుంటున్నారు. నేను అటుప్రక్క నించి అన్న పూర్ణాలయంలోకి వెళుతున్నాను టిఫిన్ ఏదయినా వుంటే తిందామని. అంతమందిలో అమ్మ నన్ను పిలిచింది. “ఒరే! ఇవాళ టిఫిన్ కాదు భోజనం చెయ్యి” అని నిశ్చయస్వరంతో ఆజ్ఞాపించింది. మరో మాట లేకుండా భోజనం చేశాను.
ఏమి నా భాగ్యం? ఆరోజు అంత హడావిడిలో, అంతమందిలో, నా అలవాటు గుర్తుంచుకుని, వీడు శ్రమపడ్డాడని, టిఫిన్ సరిపోదేమోనని, భోజనం చెయ్యమని చెప్పటం అమ్మ దివ్య, అనంత వాత్సల్యానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.
నాకు మాత్రం అది జీవితాంతం గుర్తుంచుకునే ఒక అతిలోక మధురమైన, మహదానందకరమైన, పదిలంగా దాచుకున్న జ్ఞాపకం. అప్పటినించి, జిల్లెళ్ళమూడిలో మాత్రం శనివారం లేదు, బుధవారం లేదు. ఏది వుంటే అదే అమ్మ ప్రసాదం