శ్రీ డి.వి.ఎన్. కామరాజు: ‘హైమ మానవిగా పుట్టి మాధవిగా ఎదిగింది. కావున మనం హైమను దేవతగా ఆరాధిస్తున్నాం. హైమ స్వార్థంకోసం కాక పరహితార్ధం కోసం తపించింది. పీడిత జన సందోహానికి శాంతి సౌఖ్యాలనందించే హైమ లలితామూర్తి. 25-11-2021 హైమ 79వ జయంతి ఉత్సవము. నాడు జిల్లెళ్ళమూడిలో ‘శ్రీలలితా కోటి నామార్చన’ నిర్వహించుకుంటాం. ఆ ఉత్సవానికి సోదరీసోదరులందరికీ స్వాగతం’ అంటూ వక్తలకు, శ్రోతలకు, సభానిర్వాహకులకు, గాయనీ గాయకులకు సాదర శుభస్వాగతాన్ని పలికారు.
కుమారి ఎ.మనీషా: ‘యయా శక్త్యా బ్రహ్మా’ ప్రార్ధనా శ్లోకాన్ని హృదయంగమంగా వినిపించారు.
డా|| బి.ఎల్.సుగుణ: ‘స్వరూపలలిత, స్వభావ మధుర అయిన హైమ సాక్షాత్తూ లలితా రూపమే. అమ్మను వాత్సల్య జలధిగా, తత్త్వవేత్తగా, అవతార మూర్తిగా, అనంతశక్తిగా ఎందరో ఎన్నో కోణాల దర్శించి ఆరాధిస్తున్నారు. సర్వాధార, సర్వారాధ్య అమ్మ. ఓర్పు – ఓదార్పు మాతృతత్త్వం. మాతృతత్త్వం అంటే మాటల్లో ప్రేమ, చేతల్లో సేవ – అనీ, అమ్మ మాటలు, చేతలు లలితాదేవి తత్త్వంతో విరాజిల్లుతున్నాయనీ, మనిషిలోని దివ్యత్వానికి వ్యక్తరూపమే ప్రేమ; ఆ ప్రేమైక అమృతమూర్తి అమ్మ అనీ నేటి వక్తలు స్వానుభవపూర్వకంగా వివరించారు’ అంటూ సమగ్రమైన సముచితమైన సమీక్షలతో హృద్యంగా సభానిర్వహణ చేశారు.
డా॥ చెన్నాప్రగడ శ్రీనివాసరావు (U.S.): ‘అమ్మ అంటే ఓర్పు, ఓదార్పుల సమ్మేళనం. ప్రతివ్యక్తీ ఒక స్థాయిలో ఇతరులను ఓదార్చటం, మరొకస్థాయిలో ఓదార్చబడటం సహజం. Physician అంటే ఓదార్చేవాడు, Patient అంటే ఓదార్చబడేవాడు అని అర్ధం. రోగులకి సేవచేసేటప్పుడు నేను అమ్మకే సేవచేస్తున్నానని అనుకుంటాను. మనం బాధల్ని అనుభవించటం ద్వారా అమ్మకి మరింత చేరువ అవుతాం. ‘నేను నేనైన నేను’ అనే అమ్మ వాక్యం ‘తత్త్వమసి’ తుల్యమైన మహావాక్యం. ధర్మసాధనకోసం నిర్దేశించబడిన మానవదేహాన్ని అధర్మసాధనకి వినియోగిస్తే అది ‘డబ్బు – జబ్బు’ అని కొట్టుకుంటుంది. అంతా అమ్మమయం జగమంతా అమ్మ మయం” అంటూ అనుభవపూర్వకంగా స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు.
డా॥ మల్లాప్రగడ శ్రీవల్లి: ‘నా దృష్టిలో జడమేమీ లేదు; అంతా జీవమయం’ అని బోధించిన అమ్మ జ్ఞానస్వరూపిణి. “సృష్టికి పరిణామమే కానీ నాశనం లేదు”అని ప్రబోధించిన అమ్మ జ్ఞేయం. జ్ఞానమూ, ఆ జ్ఞానంతో తెలుసుకోదగిన తత్త్వమూ అమ్మే. కనుక అమ్మ జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి.
“భర్త అంటే శరీరం కాదు, భావన”అంటూ నిరంతరం ప్రతిధ్యానంలోనే ఉంటుంది. “రూపం పురుషుడు, లోని శక్తి ప్రకృతి” అని విపులీకరించి, సదా నాన్నగారిలో ఉన్న అమ్మ శివశక్యైక్య రూపిణి.
“నేను తల్లి ధర్మం కోసం వచ్చాను”అన్నది అమ్మ. ఈ వాక్యార్థం, పరమార్థం ఏమంటే – అమ్మ తల్లి ధర్మం కోసం వచ్చింది అని, అమ్మ ధర్మం కోసం వచ్చింది అని. పాలన, పోషణ, రక్షణ, ధర్మసంస్థాపన కోసం’ అంటూ అమ్మ అశేష కల్యాణగుణాల్ని ఆబ్రహ్మకీటజనని, అన్నదా, ప్రేమరూపా, విశ్వమాతా, సాధ్వీ, ధర్మవర్థినీ, సృష్టికర్తీ, విశ్వసాక్షిణీ, విశ్వగర్భా, దయామూర్తి వంటి లలితా త్రిపురసుందరి నామములతో అన్వయిస్తూ సోదాహరణంగా, సందర్భపూర్వకంగా, జ్ఞానదాయకంగా ప్రసంగించారు.
శ్రీమతి పి.రాజరాజేశ్వరి: ‘జగమేలు తల్లికి కోయిలా, జేజేలు పలుకవే కోయిలా, ప్రేమానురాగాలు అమ్మకాభరణాలు, అమ్మ నామము చేయి కోయిలా – జన్మ సార్ధకమగును కోయిలా’ గీతాన్ని శ్రావ్యంగా గానంచేసి అమ్మ దివ్యతత్త్వాన్ని విశదపరచారు.
శ్రీ పి.అప్పారెడ్డి: ‘అమ్మకి ప్రేమ సహజం. జిల్లెళ్ళమూడి గాలిలో, నీటిలో సర్వేసర్వత్రా మహాశక్తి నిండిఉంది అందు అవ్యాజమైన అమ్మ కరుణ ప్రవహిస్తోంది. బడిలో విద్యతోపాటు మా గురువుల నుండి సత్ప్రవర్తన నేర్చుకున్నాం. మూఢాచార నిరసనలో విలక్షణత చూపి నవయుగానికి నాంది పలికింది – అమ్మ.
అమ్మ వాక్యాలను నిత్యజీవితంలో అన్వయించుకుంటే మనశ్శాంతి లభిస్తుంది. ఒక ఉదా: 2007 లో ఇల్లు కట్టుకున్నాను. తర్వాత ఒకసారి 10,000 యూనిట్లు కరెంట్ ఖర్చయిందని, 30 వేలు బిల్లు వచ్చింది. ‘ఇదేమిటి’ అని ఆందోళనచెందాను. నా మిత్రులు A.E. గారి వద్దకు తీసికెళ్ళారు. వారి సలహామేరకి రు.50లు చలానా కట్టగా, మీటర్ చెక్చేసి, అది జంప్ అయింది, ఏమీ కట్టనవసరంలేదు’ అన్నారు.
తక్షణం “మంచికి ఏది కారణమో, చెడుకి అదే కారణము”అనే అమ్మమాట అనుభవంలోకి వచ్చింది. జగతికే జాగృతి కల్గించి జనతనే మార్చి వేసిన అమ్మ చైతన్యమూర్తి. ఆర్తితో పిలిస్తే వెంటనే అమ్మవచ్చి మనల్ని ఆదుకుంటుంది’ అంటూ అమ్మ వాక్యాలకు రసరమ్యంగా లలితమైన వివరణ నందించారు. అమ్మే తన సర్వస్వం అని విశ్వసించి సాఫీగా జీవనయానం చేస్తున్నారు.
శ్రీ ఈమని రాజేశ్వర్: ‘ఎంత మంచి దానవో ‘అమ్మా’ అంటూ రాజుబావ పాటను ఆర్తితో గానంచేశారు.
డా॥ ఎమ్.రామకృష్ణాంజనేయులు: హైమవతీదేవి జయంతి ఉత్సవానికి అందరికీ ఆహ్వానం పలికిన శ్రీ కామరాజుగారికి, ఆధ్యాత్మికతను అమ్మ తత్త్వాన్నీ మేళవించి తన వైద్యవృత్తిలో అనుసరిస్తూ, ‘అంతా అమ్మమయం’గా దర్శిస్తూ, అమ్మయందలి విశ్వాసమే తన ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా నడుస్తూ ఆదర్శప్రాయమైన ప్రసంగంచేసిన శ్రీ శ్రీనివాసరావు గారికి, అమ్మను లలితా పరమేశ్వరిగా ఉపాసించి, లలితా సహస్రనామాలకు పరాత్పరి అమ్మ గుణవైభవాన్ని సమన్వయం చేస్తూ అమ్మ అలౌకిక తత్త్వాన్ని సుబోధకం చేసిన డా|| ఎమ్. శ్రీవల్లి గారికి, త్రికరణశుద్ధిగా అమ్మను విశ్వసించి అమ్మ సేవలో తరిస్తూ స్వానుభవపూర్వకంగా అమ్మ వాక్యాలను విపులీకరించిన శ్రీ అప్పిరెడ్డిగారికి, ఆద్యంతమూ దక్షతతో సమర్ధవంతంగా సభానిర్వహణ చేసిన డా॥బి.ఎల్.సుగుణ గారికి, గాయనీ గాయకులకు, శ్రోతలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. శాంతిమంత్ర పఠనంతో సభముగిసింది.