డా|| బి.ఎల్.సుగుణ (కన్వీనర్): సృష్టే దైవం అనీ, జగన్మాత అంటే జగత్తే అనీ, ‘అఆ’ అంటే ఆద్యంతాలు లేనిదీ అన్నిటికి ఆధారమైనది అని ప్రబోధించింది అమ్మ. అట్టి అమ్మ జగన్మాతృతత్త్వాన్ని జగద్వ్యాప్తం చేయటమే ఈ కార్యక్రమ లక్ష్యం. అమ్మ పుట్టినరోజు అంటే సృష్టికి పుట్టినరోజు అని వివరించారు.
శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ (సభా ధ్యక్షులు) : అమ్మ ఆదర్శమూర్తి ఆచరణ స్ఫూర్తి. సృష్టికి పరిణామమే కాని నాశనం లేదనీ, సర్వసమ్మతమే తన మతం అనీ అమ్మ చాటింది. పిపీలికాది బ్రహ్మపర్యంతం అందరినీ అన్నిటినీ తన సంతానంగా ప్రేమించింది. అమ్మ సనాతన ధర్మానికి వ్యతిరేకం కాదు; కాలక్రమంలో ఆచారాల్లో చోటుచేసుకున్న లోపాల్ని అమ్మ సరిదిద్దింది. అంటూ ఆద్యంతమూ రసస్ఫోరకంగా – సభను నిర్వహించారు.
శ్రీమతి ఎల్. విజయశ్రీ: ‘యయాశక్త్యా బ్రహ్మా’ అనే శ్లోక పఠనంతో ప్రార్ధనచేశారు; సభ ప్రారంభమైంది. “జిల్లెళ్ళమూడిలో స్త్రీ రూపధారిణియై దిగివచ్చి నిల్చినది దివ్యమాతృప్రేమ” అనే గీతాన్ని వీనులవిందుగా గానం చేశారు. అమ్మ స్వరూప స్వభావాలకి దర్పణం పట్టారు.
శ్రీ బి. రామబ్రహ్మం: ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలను అధ్యయనం చేశాను కానీ అమ్మ దరిచేరిన తర్వాత నా గమ్యం స్పష్టమైంది. శ్రీరామనామజపాన్ని అక్షరలక్షలు చేశాను, అమ్మ శ్రీరామచంద్రుని భంగిమలో దర్శనం ఇచ్చింది. అమ్మ శ్రీకృష్ణపరమాత్మలా ‘యదృచ్ఛా లాభ సంతుష్టో’అనే గీతావాక్యాన్ని ఉపదేశించింది. ‘మీరంతా నా బిడ్డలేకాదు, నా అవయవాలు’అని ప్రకటించింది అమ్మ. శారీరక అవయవాలు పరస్పర ద్వేషాసూయలు లేకుండా సామరస్యంతో ఉంటాయి, అలాగే మనందరం ఐకమత్యంతో ఉండి పదిమందికోసం శ్రమించాలి. అదే నిజమైన సాధన”అని ప్రసంగించారు.
శ్రీమతి ఎ.కుసుమా చక్రవర్తి: అమ్మ కులమత వర్ణవర్గాలను రూపుమాపి అందరిలో ఏకోదర రక్తసంబంధబాంధవ్యాన్ని ప్రోదిచేసింది. స్త్రీలకి వేద మంత్రాలు నేర్పించి ఆలయాల్లో అభిషేక అర్చనా దికములు చేయించింది, భర్తకి భార్యదేవత అని సంపూర్ణత్త్వాన్ని చాటింది. కుమారులు లేని తండ్రికి కూతురుచే తలకొరివి పెట్టించింది. మడి అంటే హద్దు అని వివరించింది, గాయత్రీ మంత్ర జపదీక్షను ఆసక్తి గలవారందరికీ ప్రసాదించింది-అంటూ అమ్మయొక్క విలక్షణ విశిష్ట వినూత్న రీతిని, బోధని వివరించారు.
చి॥ మనీషా: ‘భజరే జనయిత్రీం మానస! భజరే విశ్వసవిత్రీం’ అంటూ విశ్వజనని అమ్మను స్తుతిస్తూ గానం చేసినపుడు ఆ స్వరలహరిలో శ్రోతలు తన్మయులైనారు.
శ్రీమతి ఎన్. కస్తూరి: ‘పుచ్చుకునే చెయ్యిలేకపోతే. ఇచ్చే చేతికి విలువ లేదు’ అంటూ సత్యసందర్శనం. చేస్తుంది అమ్మ. ‘నువ్వు ఏం చదువుకున్నావు? చదువుకుని ఏం చెయ్యాలనుకుంటున్నావు?’ అని ప్రశ్నించి ఒక లక్ష్యంతో సార్థక జీవనం చేయాలని అమ్మ ప్రబోధించింది. అమ్మనామ జపమే నాకు సర్వరక్ష. ఒకసారి శ్రీశైలంనుండి వస్తుండగా బస్సులోనాకు పురిటి నెప్పులు ప్రారంభమైనాయి. అంతకంతకు అధికమైనాయి. అమ్మ నామం నిరంతరాయంగా చేస్తున్నాను. దారిలో బస్సు ఆపి, నన్ను ఆ రాత్రివేళ వర్షసమయంలో ఆస్పత్రిలో చేర్చారు. 10 ని.లలో సుఖప్రసవమై అదే బస్సులో ప్రయాణించి ఒంగోలు క్షేమంగా చేరాను. అమ్మ నామమహిమ. అమ్మ కనిపించే దైవం. అమ్మ కరావలంబమే అదృశ్యంగా అనవరతం రక్షిస్తోంది, సంరక్షిస్తోంది అంటూ భక్తి ప్రపత్తులను చాటుతూ ప్రసంగించారు.
డా॥ ఉప్పల వరలక్ష్మి: “డా॥ పన్నాల రాధాకృష్ణశర్మ గారు భావావేశంగల కవిపండితులు, శ్రీరాముని ధర్మనిరతి, ఆదిశంకరులు అద్వైతదీప్తి, వివేకానందుని ఉద్యమన్ఫూర్తి ముమ్మూర్తులా మూర్తీభవించిన విద్యా వాచస్పతి, నిజాయితీకి నిబద్ధతకి నైష్ఠికతకి నిలువెత్తు రూపం.
460 పద్యాలుగల ‘అశ్రులహరి’ గ్రంథంలో శ్రీ పన్నాల వారు పశ్చాత్తాపతప్తమైన గుండెలోతుల్లోంచి పెల్లుబికిన కన్నీటి ధారలతో అమ్మపాదాలను అభిషేకించారు. నిలకడలేని మనస్సు అనే పశువును అమ్మ పాదాలు అనే బలిపీఠంపై భక్తి అనే గండ్రగొడ్డలితో బలిచేస్తానని విన్నవించుకున్నారు. అమ్మను అఖిల లోకేశ్వరిగా, సర్వజగన్నియంత్రియగు శక్తిగా దర్శించారు.
అమ్మతో మాట్లాడారు, ప్రార్థించారు, వేడుకున్నారు, గారాలుపోయారు, ఒక్కొక్కసారి చేస్తావా లేదా అని నిర్బంధించారు. ‘ప్రశాంత మనస్కుడనై తరించెదన్ ‘ అనీ, “తరణమార్గంబు చూపుము తల్లి నాకు” అనీ అభ్యర్ధించారు” అలా అమరవాణీ సౌరభోపేత సాహితీవైదుష్యంతో గ్రంథ సమగ్రసారాన్ని హృద్యంగా అవగతం చేశారు.
(తదుపరి కార్యక్రమం: 02-05-2021. మీ హితులకూ సన్నిహితులకూ తెలిపి ఈ అక్షరార్చనలో భాగస్వాముల్ని చేయండి)
– శ్రీ విశ్వజననీ పరిషత్, జిల్లెళ్ళమూడి.