జిల్లెళ్ళమూడి గ్రామంలో మొట్టమొదటి ఆలయం హైమాలయం. అంతకుముందే అన్నపూర్ణాలయం ఉన్నా, అక్కడ ఒక దేవతా విగ్రహం కానీ, అర్చన కానీ లేవు. అక్కడ అన్నమే అన్నపూర్ణాదేవి. వడ్డనే అర్చన. కాని హైమాలయం అలాంటిది కాదు. ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ధూపదీపనైవేద్యాలతో ప్రతిదినమూ ఉదయం సాయంసంధ్యలలో అర్చన జరుగుతూ ఉంటుంది. ప్రతి ఉదయం మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకమూ జరుగుతుంది. హైమ జయంతి నాడు ఆనాటికి ఆమెకు ఎన్ని సంవత్సరాలు నిండాయో అన్ని రకాల పిండివంటలతో నైవేద్యం సమర్పిస్తారు.
ఇంతకూ ఎవరీహైమ ? జిల్లెళ్ళమూడి గ్రామదేవతా? అనే సందేహం కొత్తగా జిల్లెళ్ళమూడిని సందర్శించడానికి వచ్చే “అమ్మ” బిడ్డలకు కలగడం సహజం.
హైమక్కగా ప్రసిద్ధికెక్కిన ఈమె అసలు పేరు హైమవతీదేవి. ‘జిల్లెళ్ళమూడి అమ్మ’గా ప్రఖ్యాతి గాంచిన అనసూయాదేవికి కన్నబిడ్డ. మూర్తీభవించిన సౌకుమార్యమే హైమ. చిన్నతనం నుంచీ ఒక ప్రత్యేకత కలిగిన హైమక్క మాటా, మనసూ కూడా ఆమె కంటే సుతిమెత్తనివి. “అందరిఅమ్మ” – అనసూయమ్మ అయితే అందరి సోదరి హైమమ్మ.
జిల్లెళ్ళమూడికి వచ్చే యాత్రికులను ప్రేమగా పలుకరించే “ప్రేమరూప” హైమ. అందరిపట్ల అపారమైన దయకలిగిన “సాంద్రకరుణ” హైమ. – ఎదుటివారి కష్టాలకు కరిగిపోయే హృదయంగల హైమ “కరుణారససాగర”. తనకు చేతనైనంతలో సాటి వారికి మేలు చేయాలనే తపన కల “ప్రియంకరి” – హైమ. “అమ్మ” వద్దకు వచ్చే సోదరీ సోదరుల కష్టాలకు కదిలిపోయిన హైమ, వారి కష్టాలను తొలగించి, సుఖాలను అనుగ్రహించమని “అమ్మ”ను ప్రార్థించిన “అవ్యాజకరుణామూర్తి”. స్వరూప లలిత, స్వభావమధుర ||అయిన హైమతో నాకు ఒక అనుబంధమూ, ఆ “దయామూర్తి”ని గురించి తెలుసుకునే అవకాశమూ నాకు “అమ్మ” ప్రసాదించిన వరాలు.
నాకు తెలిసే నాటికి హైమ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉండేది. అందువల్ల వైద్యచికిత్సల కోసం హైమను చాలామంది వైద్యుల దగ్గరకు పంపించింది. “అమ్మ”. చాలారకాల వైద్యవిధానాలకు హైమ శరీరం ప్రయోగశాల అయింది. అలాంటి సందర్భంలో కొద్ది రోజులు హైమ చీరాలలోని మా నాన్నగారు కీ.శే. డా. నారపరాజు శ్రీధరరావుగారి ఇంట్లో ఉండటం. జరిగింది. ఆ సమయంలో మాకు హైమతో సన్నిహిత బాంధవ్యం ఏర్పడింది.
చీరాల్లో మా పుట్టినింటికి ఎదురుగా పోలీసు స్టేషన్ ఉండేది. మా నాన్నగారి ఆసుపత్రికి ఎదురుగా శ్రీ వీరరాఘవస్వామి ఆలయం ఉండేది. నేను ఆ గుడికి వెళుతూ ఉండేదాన్ని. హైమ చీరాల్లో ఉండే రోజుల్లో నాతోపాటు తను కూడా ఆ గుడికి వచ్చేది. అదొక మధురస్మృతి. ఆలయంలో వెనుక వైపున ఇద్దరమూ కబుర్లు చెప్పుకుంటూ చాలసేపు గడిపేవాళ్ళం. మా మధ్య ఉన్న వయోభేదం మా స్నేహానికి అడ్డురాలేదు. ఎన్నో, ఎన్నో, ఎన్నెన్నో కబుర్లు కలబోసుకునే వాళ్ళం. మనసు పొరల్లో దాగి ఉన్న ఎన్నో విషయాలు ముచ్చటించుకునే వాళ్ళం.
“అమ్మ” దగ్గరకు 1960-61 సంవత్సరాల మధ్యకాలం నుంచీ వెళుతూ ఉన్నా మేము “అమ్మ”ను “అమ్మగారు” అని వ్యవహరించేవాళ్ళం. అది హైమకు నచ్చలేదు. “అమ్మ” అంటే అందరూ స్వతంత్రంగా ఉండే, ఉండగలిగే ఏకైక వ్యక్తి. అలాంటి “అమ్మ”ను “గారు” అంటూ గౌరవించడం ఏమిటి? అని వాదించి, మా అందరి చేత “అమ్మ” అని పిలిపించి, “అమ్మ”ను మాకు మరింత చేరువ చేసిన “అమ్మబిడ్డ” హైమ.
హైమ చీరాల్లో ఉన్న రోజుల్లోనే – వసుంధర అక్కయ్యను “అమ్మ” వివాహం చేసుకుంటోంది అనే వార్తను తీసుకు వచ్చారు కొందరు అక్కయ్యలు. ఆ మాట వినగానే హైమ మనస్సు ఆనందంతో పొంగిపోయింది. అది జరిగితే ఎప్పటికీ వసుంధర అక్కయ్య “అమ్మ”కు దూరం కావలసిన అవసరం ఉండదని, అక్కయ్య అదృష్టానికి ఎంతో మురిసిపోయింది.
వైద్యం పేరుతో “అమ్మ” తనను ఎక్కడెక్కడికో పంపిస్తూ ఉంటుందని, ఆ దూరాన్ని భరించలేక బాధపడేది. అలాంటి సమయాల్లో ఎంతో ఇష్టంగా “నీలిమేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించు నేవేళ…” అని పాడుకునేది. “అందుకో జాలనీ ఆనందమే నీవూ, ఎందుకో చేరువై దూరమౌతావు…” అంటూ ఉండగానే ఆమె గొంతులో డగ్గుత్తిక వచ్చేది. అంతలోనే తెప్పరిల్లి, తన అదృష్టానికి సంతోషిస్తూ “ఏ పూర్వపుణ్యమో నీ పొందుగా మారి, నా హృదయ భారమునే మరపింప చేయూ…” అని పాడుకుని పరవశించిన అల్పసంతోషి హైమక్క
హైమ ఇష్టపడే మరొక పాట “మురిపించే మువ్వలు” సినిమాలోనిది. ఆ రోజుల్లో రేడియోలో “చిత్రలహరి” కార్యక్రమం వచ్చేది. అందులో “నీ లీల పాడెద దేవా….” అనే పాట రాగానే, ఆ రేడియో ఉన్న బల్లమీద తల ఆనించి, తన్మయంగా వినేది.
హైమక్క శరీరం ఎంత లలితమో, స్వభావం అంత సరళం. తన ఆరోగ్యం బాగాలేకపోయినా, పట్టించు కునేది కాదు. కానీ ఇతరులకు ఏ మాత్రం కష్టం వచ్చినా తల్లడిల్లిపోయేది. నాన్నగారింటికి ఎదురుగా ఉన్న పోలీసు స్టేషనులో దొంగలను పట్టి తెచ్చి బాగా కొట్టేవారు వాళ్ళ చేత నిజం చెప్పించాలని ఆ దెబ్బలకు తట్టుకోలేక వాళ్ళు పెద్దగా కేకలు, రంకెలు, పెడబొబ్బలు పెట్టేవారు. అవి విని హైమ చాలా బాధపడేది. నాన్నగారితో “ఎందుకన్నయ్యా వాళ్ళనలా కొట్టడం, మెల్లగా అడిగి తెలుసుకోవచ్చు కదా!” అనేది బాధగా.
“అమ్మ” రత్నగర్భ. ఆ గర్భం నుంచి వెలువడిన అనర్హరత్నం హైమక్క. ‘హిమం’ అంటే మంచు. మంచువలె చల్లని మనస్సు గలది మాత్రమే కాదు; ఆ మంచు కరిగినట్లుగా ద్రవించే హృదయం కూడా కలది హైమక్కహిమం నుంచి వచ్చినది హైమం. కనుక ఆ స్వభావం హైమక్కకు సహజమైనది. “అమ్మ” చెప్పిన “సహజ సహనం”అనే మాటకు నిలువెత్తు నిదర్శనం హైమక్క.
హైమక్క స్వభావంలోని మార్దవం శ్రీధరరావుగారి మనస్సును కదిలించగా, ఆ కదలిక నుంచి వచ్చిన కవితాధారయే “హైమ” అనే పేరుతో అక్షరరూపాన్ని సంతరించుకుంది.
జిల్లెళ్ళమూడికి చిరపరిచితులైన అక్కయ్యలకూ, అన్నయ్యలకూ – హైమ పెదవులపైని నిర్మల దరహాసం కన్నులముందు కదులాడుతునే ఉంటుంది. “అన్నయ్యా! అక్కయ్యా!” అనే ప్రేమపూర్వకమైన ఆమె తీయని పలకరింపు చెవులలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. భూదేవి కందిపోతుందేమో అన్నట్లు మెల్ల మెల్లగా నడిచే హైమక్క పదమంజీరాల చిరుసవ్వడి మన మనస్సులను రంజింప చేస్తూనే ఉంటుంది. మానవిగా పుట్టి, తన సద్గుణ సంపదతో మాధవిగా మన అర్చనల నందుకుంటున్న హైమక్కకు నా నమస్సుమనస్సులు.
“ఆత్మవత్సర్వభూతాని” అనే సూక్తికి ఆచరణ రూపం హైమక్క అలాంటి హైమక్కను దేవతగా ఆలయంలో ప్రతిష్ఠించి, ఆరాధించడంతో మన పని అయిపోయిందనుకోకుండా ఆ తల్లిలోని ప్రేమా, కరుణా వంటి లక్షణాలను మనం కూడా అలవరచుకుని ఆచరించే ప్రయత్నం చేయగలిగిననాడు అందరింటిలోని హైమాలయం మన ఇంటిలో, మన గుండెలో కొలువై ఉంటుంది. అందుకే “అమ్మ” – గుండెను గుడి చేసుకోమని చెప్పింది. అప్పుడు “ఇల్లిదే హైమాలయం…” అనే అనుభూతి కలుగుతుంది. అందుకు హైమక్క ఆశీస్సులు మనందరిపై వర్షించాలని ఆకాంక్షిస్తూ, ఆ చల్లని రోజు కోసం నిరీక్షిస్తూ… ఉంటాను.