శ్రీ గుడిపాటి వెంకటాచలం గురించి తెలియని వాళ్లుండరు. మన ఆంధ్రరాష్ట్రంలో 30 సం|| రాష్ట్రాన్ని కుదిపేస్తూ ఆయన చేసిన రచనలు పెద్ద విప్లవాన్ని తీసుకొచ్చాయి. స్త్రీ స్వాతంత్ర్యం, స్వేచ్ఛ గురించి ఎలుగెత్తి చాటిచెప్పిన మొట్టమొదటి రచయిత చలంగారు.
అమరావతి R.V.V.N. College లో పనిచేసి రిటైరయినారు చలంగారు. శ్రీ వావిలాల సుబ్బారావు గారు చలంగారి సాహిత్యం మీద రిసెర్చి చేసి Ph.D. పట్టాను పుచ్చుకొన్నారు. చలంగారు రాసిన పుస్తకం పేరు “చలం నీడ – చెప్పిన కథ”. ఆ పుస్తకంలో అమ్మను ఆయన ఎలా సందర్శించారో వివరించారు –
ఒక రోజు నర్తకి (చలం గారి కూతురు) ఉత్సాహంగా రమణాశ్రమం నుండి వచ్చి “నాన్నా!” జిల్లెళ్ళమూడి అమ్మగారు తమిళనాడు పర్యటనలో రమణాశ్రమానికి వస్తారుట. అని వార్త అందించింది.
చలం ఉత్తరం వ్రాయించారు. “అమ్మ అరుణా రుణ పాదాలకు – అరుణాచలంలో ఈ వృద్ధుణ్ణి చూడకుండా వెళతావా!” అని. అమ్మ మనసులో చలం ఉన్నాడు. మాతృశ్రీ మద్రాసు వచ్చాక 12 ఏప్రియల్ నాడు చలానికి టెలిగ్రాం వచ్చినిది. “రేపు మీ దగ్గరకు వస్తున్నానని.” ఆ రోజు తమిళ ఉగాది. సౌరిస్ పుట్టిన రోజు గూడ. అమ్మ వస్తున్నారని తెలియగానే ఊరంతా కోలాహలం అలముకున్నది. ఆమె దర్శనం కోసం బారులు తీరారు. రంగురంగుల చీరలు కట్టి ముఖాలకు పసుపు అలది ఎంతో క్రమశిక్షణతో రోడ్డుకు ఇరుప్రక్కలా నిలచి ఉన్నారు. అమ్మ సరాసరి “రమణస్థాన్” (చలం యిల్లు) కు వచ్చారు.
మధ్యాహ్నం 4 గంటలయింది. అమ్మ స్నానానికి 108 బిందెల నీళ్లుకావాలి. నీళ్ళకు ఇబ్బందిగా ఉంది. వీలయినన్ని గంగాళాలు నింపారు. అమ్మ చలం దగ్గరగా వచ్చి కూర్చుంది. దగ్గరకు తీసుకున్నారు. “ఎ సెయింట్ కేమ్ టు ఎ సిన్నర్” (a saint came to a sinner) అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు చలం. చలం చేతులు తన చేతుల్లోకి తీసుకొని ఓదార్చి, ఆమె స్నానానికి వెళ్లారు. వారి భక్త బృందం భోజనాలు చేసారు. అమ్మ కాఫీ మాత్రం తీసుకున్నారు. ఆమె ఎప్పుడూ భోజనం చెయ్యరుట. సౌరిస్ పుట్టినరోజని అమ్మ సౌరిస్ కు కొత్తబట్టలు పెట్టింది. నాన్న (చలం)కు కూడ కొత్తబట్టలు యిచ్చింది. ఇక్కడకు అమ్మ వచ్చారని తెలిసి ఆశ్రమంలోని విదేశీయులందరూ వచ్చారు. వారందరికి అరటిపండ్లు నోట్లో పెట్టింది. అమ్మకు కడుపులు నింపటంలోనే ఆనందం.
అమ్మ చలం దగ్గరగా కూర్చున్నది. అతని చేతులను తన చేతుల్లోకి తీసుకున్నది. చలం తలను తన హృదయానికి హత్తుకున్నది. చలం కళ్లలో నీరు ఎగసి పడుతున్నది. తన ఆదర స్పర్శతోనే చలం దుఃఖాన్ని తీసివేసింది అమ్మ. ఆనందం కన్నీటి ధారలయింది. సృష్టి ప్రారంభం నాడు విడిపోయిన మాతాపుత్రుల సంబంధం మళ్లీ ఈనాడు చల్లని చేతిలో ఓదార్పు పొందింది. శోకదగ్ధమానసులయిన బహిష్కృతుల, దీనుల కన్నీరు తుడవటానికి బయలుదేరిన జీవుడు చలమై తడుము కుంటూ ప్రేమార్తుల కన్నీటిలో కన్నీరై తన వేదనా భారాన్ని భగవాన్ ముందు అర్పించి ఈనాడు కరిగి అమ్మ ఒడిలో సేద తీరాడు.
“వృద్ధుడను లేచి తిరుగలేనివాడను. అయినా నా దగ్గరకు అమ్మ రావటం ఎంతో ఆనందం. ప్రత్యేక సందేశాన్ని చాటడానికి ఆమె అవతరించింది. వెలుగు మరుగున పడ్డపుడల్లా అవతరిస్తానన్నాడు పరమాత్మ. ఆ మాటను అమ్మ మళ్లీ నిజం చేసింది. అలాంటి వారిని గుర్తించలేని నాలాంటి మూర్ఖులకు తెలియ చెప్పటానికి నా వద్దకు వచ్చింది. నేను ఎన్నో సంవత్సరాలు ఈశ్వరాన్వేషణ చేసాను. ఈనాడు “ఏడిరా ఈశ్వరుడు అని ఎవరయినా అడిగితే చెప్పటం సులభం. చూపించ టం అంతకన్న సులభం. ఎన్నిసార్లు మేల్కొల్పినా కళ్లు తెరవని నా అంధకారాన్ని నీ పాదాల దగ్గర వదులు తున్నాను” అంటూ అమ్మ పాదాలకు ప్రణామం చేసాడు. అమ్మ అపార కరుణకు ఏమి చేయాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అయినాడు.
ఏనాడో మద్రాసులో కపాలేశ్వరుని చూపుల ఒడిలో ఏడుస్తున్న పసిగుడ్డును రెండు మెత్తని చేతులు ఎత్తుకున్నాయి. ఎంత మధురమో ఆ స్పర్శ. అరుణాచ లేశ్వరుని చూపుల ఒడిలో మళ్లీ అదే స్పర్శ. తనను లాలిస్తున్నది. “తల్లీ! తల్లీ! నువ్వేనా” మాతృశ్రీ పాదాలు స్పృశించి పరవశించాడు.”