కని పెంచిన అమ్మను మరిపించిన ప్రేమాన్విత “శేషారత్నం” అమ్మ. ఏమని చెప్పను? ఎలా చెప్పను? కని పెంచిన అమ్మనే మరిపించిన అమ్మను గురించి. ఇంతటి ప్రయోజకుణ్ణి చేసిన మా అమ్మ విఠాల శేషారత్నం అమ్మ. అమ్మగారండీ అని పిలవడం నాకిష్టం లేదు.
మా అమ్మను ఈ అమ్మగా భావించి పిలవాలని సంకోచిస్తూనే అడిగాను అమ్మా “నేను కూడా రామకృష్ణలా “అమ్మా!” అని పిలుస్తాను” అంటే, “సరే, అలాగే పిలువు” అని అంగీకరించిన ఆ అమ్మతో అనుబంధం అక్షరాలకు అందనిది.
గురు దంపతులతో నాకున్న సాన్నిహిత్యం అవ్యాజమైనది. అది జన్మ జన్మల బంధమో, తల్లీ తనయుల ఋణానుబంధమో అయి ఉంటుంది. అమ్మ మాట “పైన కఠిన మనిపించును. లోన వెన్న కురిపించును”. అత్యంత సన్నిహితంగా మెలిగిన నాకు అమ్మ లాలనను, పాలనను చవిచూసిన శిష్య పరంపరలో నేనొక పరమాణువుని.
నా జీవితాన్ని ప్రభావితం చేసిన ముగ్గురు మూలపుటమ్మలు,
నన్ను కన్న తల్లి, జిల్లెల్లమూడి అమ్మ,
సద్గురు శ్రీ రామచంద్ర మూర్తి ధర్మపత్ని “శేషారత్నం”అమ్మ.
మా తాతగారు గురు దంపతులిద్దరికీ అప్పగించి వెళ్ళినప్పుడు మేమున్నామని భరోసానిచ్చి అక్కున చేర్చుకున్నా, ఆ నాడు నాకు తెలియదు అరమరికలు లేని ప్రేమను పంచుతారని. నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పెంచుతారని.
చదువు కోసం పెట్టె చేత పట్టుకొని, ఊరు కాని ఊరు వచ్చి ఏడుస్తున్న తరుణంలో నన్ను ఓదార్చి, ఆదరణ చూపించి తన బిడ్డలలో పెద్ద బిడ్డగా భావించి, బాధ్యతలు నేర్పి బాధ్యతాయుతమైన జీవితానికి శక్తిని యుక్తిని ఇచ్చిన తల్లి ఆ అమ్మ.
పెరిగి పెద్దవాళ్ళమై ప్రయోజకుల మైనామని, నేను అనతికాలంలోనే ప్రిన్సిపాల్ గా బాధ్యత తీసుకున్నానని తెలిసి కన్నతల్లి వలె మురిసిపోయిన అమ్మలో నిజమైన అమ్మప్రేమను రుచి చూశాను. “అసలైన అమ్మకు ఎవరిని చూసినా తన బిడ్డే అనిపిస్తుంది” అన్న అమ్మ మాటను అనుభవైకవేద్యం చేశారు అమ్మ.
నా నిజ జీవిత గమనానికి, నా ఉన్నతికి మూలాధారమైన అమ్మ ఈ అమ్మ.
విఠాలవారి కుటుంబంలో ఒకడిగా కలిసిపోయిన నన్ను ఎవరైనా బంధువులో, స్నేహితులో వచ్చి “ఎవరీ అబ్బాయి?” అని అడిగినప్పుడు “మా అబ్బాయే” అని అన్నప్పుడు అవధులు లేని ప్రేమకు అమ్మ ఆదరణకు నోచుకున్న నేను ఎంతో అదృష్టవంతుణ్ణని మురిసిపోయాను. “తన పిల్లల పట్ల ప్రేమ ఉంటే మాతృత్వం, ఆ ప్రేమ అందరి యందు ఉంటే భగవత్తత్త్వం” అన్న అమ్మమాట తన జీవితపు బాటగా మలుచుకుని అమ్మ తత్వానికి ప్రతిరూపమైనారు, అందరినీ ఆదరించారు, గురువుగారి ఆశయాలకు ఆలోచనలకూ అలంబనగా నిలిచారు.
కష్టసుఖాలలో “సహధర్మచారిణి”అన్న పదాన్ని సార్థకం చేశారు. అమ్మకు పెట్టడమూ తెలుసు. తప్పుచేస్తే సున్నితంగా మందలించడమూ తెలుసు. నాలో ఉన్న అలసత్వాన్ని, తెలిసీ తెలియనితనాన్ని, జాడ్యాన్ని పోగొట్టి జీవిత నైపుణ్యాన్ని నేర్పారు. “శిల్పానికి అందం రావాలంటే ఉల్లి దెబ్బలు అవసర”మన్న మాటే బాటగా నా జీవితాన్ని సజీవ శిల్పంగా మలిచారు.
ఫైనల్ ఇయర్ 1989లో విద్యాభ్యాసం పూర్తవుతున్న తరుణంలో మా అమ్మానాన్నలు నన్ను చూడడానికి వచ్చినప్పుడు వారిని ఆదరించి బట్టలు పెట్టి “భాస్కర్రావు మంచి అబ్బాయి, ప్రయోజకుడౌతాడు,మంచి భవిష్యత్తు ఉన్నవాడు”అని ఆశీర్వదించినప్పుడు వారి మాటలు విన్న మా తల్లిదండ్రులకు నిజమైన పుత్రోత్సాహం కలిగింది. వారికి నా భవిష్యత్తు పట్ల మరింత నమ్మకం కలిగించారు వారు.
నన్ను కన్న బిడ్డ వలె చూసి తీర్చిదిద్దినందుకు మురిసిపోయారు వారు. నా యోగక్షేమాల విషయంలో సహాయ సహకారాలు అందిస్తూ నాకు ఎటువంటి లోటు లేకుండా తమ బిడ్డలతో సమానంగా చూసిన ఆ ఔదార్యం అనితర సాధ్యం. అనన్య సామాన్యం. వారుండేది చిన్న గదిలో నైనా వారి విశాల హృదయం ఆకాశం. మమతానురాగాల దివ్య హర్మ్యం.
మాస్టారు ఆంగికమైతే అమ్మ వాచకం, వాగర్థాల వలె ఆది దంపతుల శిష్యవాత్సల్యంతో, సుశిక్షితులైన శిష్యులు ఎంతోమంది నా వలెనే ధన్యులయ్యారు. నేడు దశ దిశలా అమ్మ ప్రేమను అమ్మ కోరుకున్న ఆకలి లేని సమ సమాజ స్థాపనలో, నవ సమాజ నిర్మాతలుగా కార్యోన్ముఖులై కొనసాగిపోతున్నారు.
మాస్టారు గారు పాఠాలు ఎంతశ్రద్ధగా చెప్పేవారో అమ్మ జీవిత పాఠాలను నేర్పి, జీవిత పరమార్థాన్ని తెలియజెప్పారు. “తల్లి తరింప చేస్తుంది” అన్న అమ్మ మాటను ఆచరించి మా జీవితాలను తరింపజేసి నిజమైన తల్లితనాన్ని చూపించారు.
శిష్యుల పట్ల సమదర్శనం
శిష్య వాత్సల్యామృత కలశమై…
ఆ అన్యోన్య దాంపత్యం
మా జీవితాలకు ఆదర్శమై
జనజీవన గమనానికి మార్గదర్శకమై
అమ్మ పట్ల భక్తిని
జీవితాలను సార్థకం చేసుకునేయుక్తిని
నేటి సమాజంలో
రాగద్వేషాలను ఎదుర్కొనే శక్తిని ఇచ్చారు.
మేరునగధీరులు
సద్గురు శ్రీ రామచంద్ర మూర్తిగారి
ఆదర్శ జీవితానికి ఆది’శేషు’వై
సంసార భారాన్ని మోసారు అమ్మ
అమ్మ అపార ప్రేమ జలధిలో తరించారు.
ప్రేమస్వరూపిణి అమ్మ పాదసేవానిరతులై పరిణతిని పొంది జీవితానికి పరిపూర్ణతను సాధించారు. ముక్తిగా భావించి,
“సంసారం బాధ అనిపించకపోవడమే మోక్షం” అన్న అమ్మ ఒడిలో ఒదిగిపోయి, మమ్మందరిని భౌతికంగా వదలి అమ్మలో ఐక్యమయ్యారు…
అఖిలాంండకోటి బ్రహ్మండనాయిక అనసూయమ్మనీడలో సుగతిని పొందారు… జన్మ జన్మలకూ ఈ అమ్మకు బిడ్డనై ఉండాలని, తీరని తీర్చుకోలేని తల్లిఋణం తీర్చుకోవాలని ఆశిస్తూ.. ముకుళిత హస్తాలతో, బాధా తప్త హృదయంతో, అంజలి ఘటిస్తూ,
- అర్పిస్తూ అమ్మ బిడ్డ…..