అమ్మా!బాధ్యత నీదే నమ్మా!
అమ్మా.
నీ మాట మీద నీవెంత స్థిరముగా
ఉంటావమ్మా
ఎప్పుడైనా ఎవరు అడిగినా
నేను తల్లిని మీరు బిడ్డలు అంటావు.
సమస్త సృష్టికి అమ్మను అంటావు.
దీనికి మార్పులు చేర్పులు లేవు.
శషభిషలు అంతకంటే లేవు
ఒకే శక్తి ఇన్ని రూపాలతో ఉన్నదన్నది
నీ ఆవిష్కరణ. ఎలాంటి అవస్థలో ఉన్నా
నీ ఈ భావనకు దూరం కాలేదు.
నీ పాదాలు వట్టి సోదరుడొకడు
బ్రహ్మ కడిగిన పాదాలు ఇవేగా అమ్మా
అంటే అవునన్న నీవే
ఉత్తర క్షణం మీరంతా బ్రహ్మలు
కాకపోతేగా అన్నావు
నీ అభిప్రాయాలమీద నీకెంత స్థిరత్వం అమ్మా
మరి మా సంగతి దీనికి భిన్నంగా ఉందేమమ్మా
ఏ విషయంలో మా అభిప్రాయాలు స్థిరంగా ఉండవు.
ఈ క్షణంలో ఎంతో ఆత్మీయుడనుకున్న వ్యక్తిని
మరో క్షణంలో ఆగర్భ శత్రువుగా భావిస్తాము
పూర్వ క్షణంలో ఎందుకూ కొరగాడని
తూలనాడిన వాడిని
ఉత్తర క్షణంలో ఇంద్రుడు చంద్రుడు
అని నెత్తినెక్కించు కుంటాం
కాసేపు సరస్వతీ కటాక్షం కావాలి అనిపిస్తుంది.
ఇంతలో లక్ష్మీదేవి కరుణిస్తే చాలనిపిస్తుంది.
వైరాగ్యమే అంతిమ పరమావధి అనుకుంటాము
కానీ భార్యాబిడ్డలపై వ్యామోహాన్ని చంపుకోలేము
కాసేపు మా అంత వారు లేరంటాము
మరుక్షణమే అసమర్థులము అంటూ డీలా పడతాము
అమ్మ ఉన్నది మనకేమిటి అనే అభిప్రాయం కొంత తడవ
ఇంతలోనే అమ్మ అనుగ్రహం లేదేమో అన్న శంక
ఏ అభిప్రాయం అదే ఆఖరు అని చెప్పటానికి లేదు
క్షణం క్షణం. చిత్తం మారుతూనే ఉంటుంది.
ఔనులే అమ్మా
వృక్షానికి ఉన్న స్థిరత్వం
దాని పత్రాలకు ఎందుకుంటుంది?
కెరటాలకెందుకు ఉంటుంది?
సంద్రానికున్న స్థిరత్వం
స్థిరత్వం అంతా నీవు తీసుకొని
ఈ చంచల స్వభావమే మాకు మిగిల్చావు.
ఈ చంచలత్వమే మానవత్వానికి ప్రతీకా?
నాకు లోలకం స్ఫురణకు వస్తుందమ్మా.
లోలకం కొంతకాలం చంచలస్థితిలో ఉండి
క్రమేపి స్థిరస్థితి లోకి వస్తుంది.
మేము కూడా ఈ చంచలస్థితి నుండి
క్రమేపి స్థిరస్థితికి వస్తామా?
రప్పించే బాధ్యత నీదేనమ్మా