అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలంలోని ముదిగల్లు గ్రామంలో 6-4-1938 లో జన్మించిన మాన్యసోదరులు శ్రీ ఆర్వేటి వెంకటేశులు గారు 20-9-201న అమ్మలో ఐక్యమైనారు.
మా ఇంటిదైవం ముదిగల్లు గ్రామంలో శ్రీరామునిచే ప్రతిష్ఠించబడిన గుహారామలింగేశ్వరుడు. మా తండ్రిగారి స్వగ్రామం కళ్యాణదుర్గం. వారు వ్యాపారరీత్యా పశ్చిమగోదావరి వచ్చి స్థిరపడ్డారు.
1990లో మా చిన్నాన్న గారి అబ్బాయి వివాహం కోసం మేమంతా కళ్యాణదుర్గం వెళ్ళి మా ఇలవేలుపును దర్శించటానికై గుహారామలింగేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళాము. అక్కడ చిత్రపటంలో అమ్మ దర్శనం లభించింది. అక్కడున్న వారిని విచారణ చేయగా శ్రీ ఆర్వేటి వెంకటేశులు గారి పేరు చెప్పారు. వారి ఇంటికి వెళ్ళి వారి పరిచయం చేసుకున్నాను. అమ్మ దయవల్ల ఆ పరిచయం నేటివరకూ కొనసాగుతూనే ఉన్నది.
అమ్మ చరిత్రను ఆకళింపు చేసుకుని తమ జీవిత సర్వస్వాన్ని అమ్మ సేవకు వినియోగించారు. తామరాకుపై నీటి బొట్టువలె జీవితాన్ని గడిపారు. సంసారంలో మనం ఉండాలి కాని మనలో సంసారం ఉండరాదనే సత్యాన్ని నమ్మిన వ్యక్తి; ఆచరించిన ఆదర్శ జీవనులు, నిగర్వి, నిస్వార్థపరుడు. “నీకున్నది తృప్తిగా తిని, ఇతరులకు ఆదరంగా పెట్టుకో” అన్న అమ్మ వాక్యాన్ని జీవితాంతం ఆచరించారు.
సంవత్సరానికి రెండు మూడుసార్లు జిల్లెళ్ళమూడి. వచ్చేవారు, అలా వచ్చిన ప్రతిసారీ వెంట క్రొత్తవారిని తీసుకు వెళ్ళేవారు. వారి ఊళ్ళో నిర్వహించిన సత్సంగాల్లో ఎన్నోసార్లు అమ్మచరిత్రను పారాయణ చేసి, ఆధ్యాత్మిక సత్యాలను ప్రకటించారు. ఏటా అమ్మ జన్మదినోత్సవం, అమ్మ కళ్యాణ దినోత్సవాలను నిర్వహించి తమ చింతల తోపులో అమ్మ పూజ నిర్వహించి, అమ్మ ప్రసాదవితరణ గావించేవారు. ఏటా ధాన్యాభిషేకానికి తన బంధుమిత్రులను కలిసి విరాళములు సేకరించి అమ్మకు సమర్పించేవారు. వారి కుటుంబసభ్యులంతా అమ్మను ఆరాధించేవారే. మానవతావాది, మనస్వి అయిన ఆత్మీయ సోదరులు శ్రీ వెంకటేశులకు ఇదే స్మృత్యంజలి..