మన భారత దేశంలో భగవంతుడు ఎన్నో ఆధ్యాత్మిక జ్యోతులని వెలిగించాడు. అందులో జిల్లెళ్ళమూడి అమ్మగారిది ప్రత్యేక స్థానం. ప్రేమకి పరాకాష్ట మాతృ స్వరూపం. అలా అమ్మ తత్వాన్ని పరి పూర్ణంగా ప్రకటించిన “అనసూయమాత” సమ కాలికులం కావటం మన అదృష్టం.
ఈ కలిలో, ఆకలి తీర్చటమే ప్రధాన ధ్యేయంగా అమ్మ అన్నపూర్ణాలయం ఏర్పాటు చేసారు. ఆ విశ్వ గర్భిణి, కుల మత జాతి భేదాలు మరచి అందరూ సహ పంక్తిని భోజనం చేయాలని ఆశించారు. ఎందుకంటే ఉన్నదంతా ఒక్కటే కాబట్టి!. ఆ ఆదర్శం నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా అభివృద్ధి చెందుతూ వస్తోంది.
ఈ ఆగస్ట్ 15 వతేదీ, మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు. బానిసత్వానికి స్వస్తి పలికిన రోజు. ఎవరికి తెలిసినా, తెలియకపోయినా, మన దేశ స్వాతంత్య్ర సముపార్జనలో మహనీయులు ఎంతోమంది అదృశ్యంగా పని చేశారు. ఆ స్వాతంత్య్ర పూర్ణ ఫలాన్ని అందించ టంలో, సమసమాజ స్థాపనలో ముందడుగు వేశారు మన అమ్మ. అందుకే, ఈ రోజున అన్నపూర్ణాలయ వార్షికోత్సవం చేసుకుంటున్నాం. నా గుండె అన్నపూర్ణాలయం” అన్న అమ్మ, ఆ వ్యవస్థ నిరంతరం సాగేలా ఆశీర్వదిస్తూనే ఉన్నారు.
అమ్మ ఒక సందర్భంలో “ నేనే గవర్నమెంట్ అన్నట్లు గుర్తు. అంటే, అంతా తానే అని, నేను నేనైన నేను అని చెప్పిన అమ్మ, ఆత్మ నిష్ఠ అంటే, అన్నీ వదిలి వేసి, శుష్క వైరాగ్యంతో ఉండటం కాదని, తానూ, చుట్టూ ఉన్న ప్రపంచమూ “అమ్మ”తో నిండి ఉన్నదని, ” అమ్మ” లోనే ఉన్నదని గుర్తించి, సుఖ సంతోషాలతో జీవిస్తూ, “అమ్మ” ఇచ్చింది ఎంత వీలయితే అంత ఇతరులకు పెట్టుకుంటూ తృప్తిగా బ్రతకటమేనని అన్నది.
అమ్మ దర్శనమే ఆత్మ దర్శనం. అమ్మ వాక్యాలే ఆత్మ బోధ. అమ్మ చూపించిన మార్గంలో నడవటమే ఆత్మనిష్ఠ. అన్నపూర్ణాలయ ప్రసాదం స్వయంగా అమ్మ చేతి ప్రసాదమే!. అమ్మ ఎవరినైనా ముందుగా పలకరించే మాట “భోజనం చేసావా నాన్నా!” అని. సోదర సోదరీమణులు ఎందరో ఈ మహాయజ్ఞంలో అనుక్షణం శ్రమిస్తున్నారు. వారందరికీ పాదాభివందనం చేస్తూ…. జయహో మాతా.