19.11.2021 కార్తీకపూర్ణిమ పర్వదినం సందర్భంగా శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ ఛారిటబుల్ ట్రస్టు వారు శ్రీ విశ్వజననీపరిషత్ వారి సహకారంతో శ్రీ రావూరి ప్రసాద్కు జీవనసాఫల్య పురస్కార ప్రదానం చేయడం జరిగింది. శ్రీ నరసింహానంద భారతీస్వామి గుంటూరు మంతాశ్రమాధిపతి పురస్కార ప్రదాన ఉత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేశారు. శ్రీ రావూరి ప్రసాద్ అమ్మకు పూలహారం సమర్పించి పుష్పార్చన చేసివచ్చి వేదికపైకి వచ్చారు. తదనంతరం శ్రీమతి బ్రహ్మాండం వసుంధర, శ్రీ వి.యస్.ఆర్.ప్రసాద్ – అరుణ దంపతులు జ్యోతిప్రజ్జ్వలన చేశారు. శ్రీ విశ్వజననీపరిషత్ పాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు, అధ్యక్షులు శ్రీ యం. దినకర్, కార్యదర్శి శ్రీ డి.వి.యన్.కామరాజు, శ్రీ టి.టి.అప్పారావు గార్లను వేదికపైకి ఆహ్వానించారు ట్రస్ట్ కార్యనిర్వాహకులు శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్.
ముందుగా శ్రీ రావూరి ప్రసాద్కు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆసనంపై ఆశీనులకావించి సత్కార కార్యక్రమం మొదలైంది. శ్రీ రావూరి ప్రసాద్ కుమారులు విజయనరసింహ, హైమాకర్ కుటుంబసభ్యులతో వచ్చి తండ్రి పాదాలకు పుష్పార్చన చేసి నూతన వస్త్రాలు సమర్పించారు. తదనంతరం ప్రసాద్ వద్ద పాటలు నేర్చుకున్న శిష్యురాండ్రు వారి గురుదేవుల పాదాలను అర్చించుకున్నారు. కుమారి మనీష ప్రార్థనాగీతంతో సభారంభమైనది.
తదనంతరం శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు దంపతులు ట్రస్టు పక్షాన పట్టువస్త్రాలతో ప్రసాద్ను అలంకరించారు. దినకర్ అమ్మచిత్రం గల రజత పతకం ప్రసాద్ మెడలో వేశారు. శ్రీ కామరాజు ముత్యాలమాల సమర్పించారు. శ్రీ వై. వి. మధుసూదనరావు స్పటికమాలను, శ్రీ వై.వి. శ్రీరామమూర్తి రుద్రాక్షమాలను, శ్రీటి.టి. అప్పారావు చందనమాలను, నరసింహరావు మామయ్య దంపతులు ప్రసాద్ పెద్దకుమారుడు విజయనరసింహ దంపతులకు, శ్రీ వల్లూరి రమేష్ దంపతులు ప్రసాద్ రెండవ కుమారుడు హైమాకర్ దంపతులకు నూతనవస్త్రాలు సమర్పించారు. ఫోటోగ్రాఫరులు శ్రీకాంత్, మూర్తి ప్రేమరాజు ప్రసాదు చందన, తులసిమాలలతో సత్కరించారు. శ్రీమతి అన్నేవర్ధని నవరత్న హారంతో సత్కరించింది. సోదరి రమాదేవి చందనమాలతో సత్కరించింది.
శ్రీ పి.యస్.ఆర్. “పసిడిసేసలు” పద్యపుష్పాలు సమర్పించి స్థానిక కార్యదర్శి శ్రీ కుమార్ ద్వారా ప్రసాదు అందించారు. చివరిగా అసలు పురస్కార ప్రదానం ముందు ట్రస్టు సభ్యులు చిరంజీవి పోతరాజు రవికిషోర్ ద్విముఖ గౌరీశంకర రుద్రాక్షరహారం సమర్పించగా, చిరంజీవి రాధావిశ్వనాధ్ నవరత్న హారం సమర్పించారు. శ్రీ నరసింహానందభారతీస్వామివారు షుమారు లక్షన్నర ఖరీదు చేసే స్వర్ణహారాన్ని ప్రసాద్ కంఠంలో వేసి జీవన సాఫల్య పురస్కారాన్ని మెమెంటోను అందించారు. శ్రీ ప్రసాద్కు పుష్పాభిషేకానికి ముందుగా శ్రీ లక్కరాజు సత్యనారాయణ (లాలా) తలపాగా అలంకరించగా, శ్రీ చక్కా శ్రీమన్నారాయణగారు గజమాలను శ్రీ ప్రసాదె మెడలో వేసి పుష్పాభిషేకం ప్రారంభించారు. పుష్పాభిషేకంలో ముందుగా ట్రస్ట్ సభ్యులు, ఆ తర్వాత వేదికపైన ఉన్న అతిథులు, ఆ తర్వాత సభలో ఉన్న యావన్మంది అక్కయ్యలు చెల్లెళ్ళు, అన్నయ్యలు తమ్ముళ్ళు కన్నులపండువుగా పుష్పాభిషేకం కావించారు. సభలో ఉన్న కొందరు అన్నయ్యలు, అక్కయ్యలు వసుంధర, రవి, మధు, సాయిబాబు, శ్రీరామమూర్తి, నరసింహారావుమామయ్య, రమాదేవి, శ్రీవిశ్వజననీపరిషత్ వారు, వి.యస్.ఆర్.ప్రసాదరావు మొదలగు వారు ప్రసాద్ ను నూతన వస్త్రాలతో సత్కరించారు.
స్వామివారు అనుగ్రహ భాషణం అయిన తర్వాత వేదికపై ఉన్న వారందరూ సమయ సముచితంగా ప్రసాద్ చేసిన సేవలను, వీడియో అనుభవసేకరణలను ప్రస్తుతించారు. చివరగా ప్రసాద్ కృతజ్ఞతా పూర్వకంగా అందరికీ నమస్సులు సమర్పించి శ్రీ పి.యస్.ఆర్.గారికి తనపై గల ప్రేమకు అభిమానాన్ని మాత్రమే ఈ సత్కారం చిహ్నమని, తన బాధ్యతలను పెంచిందనీ అన్నిటికీ అమ్మ అనుగ్రహమే కారణమని వివరించారు. ఇంతటి కార్యక్రమాన్ని ఇంతమంది సోదరీ సోదరులను పాల్గొనేటట్లు చేసిన శ్రీ పి.యస్. ఆర్ను అభినందించి, శ్రీ బ్రహ్మాందం రవీంద్రరావు శ్రీ విశ్వజననీపరిషత్ కార్యవర్గము, శ్రీ రావూరి ప్రసాద్ పిల్లలు నూతన పట్టుబట్టలతో సత్కరించారు. శాంతి మంత్రముతో సభ విజయవంతంగా ముగిసింది.