ఒకవైపు జిల్లెళ్ళమూడిలో అమ్మతో సంభాషిస్తూనో, విశ్వజననీ పరిషల్కి సలహాలు ఇస్తూనో కనిపిస్తారు, మరోవైపు నక్సలైట్లతో చర్చలకు వెళతారు, ఏ రాజకీయ నాయకుడో ప్రజాసమస్యపై చర్చించాలంటే అక్కడ హాజరౌతారు, విభజన ఉద్యమం పేరుతో ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య వైషమ్యాలు రాకూడదని కృషి చేస్తారు, కుర్తాళం పీఠాధిపతులతో మంత్రసాధన గురించో, మాతంగి సాధన గురించో మాట్లాడుతూ ఉంటారు. ఓ మూలగ్రంథ రచనో, ఏ పత్రిక వారికో వ్యాసరచనో సాగుతూ ఉంటుంది. ఇలా అందరితో అన్ని రంగాల వారికి ఆత్మీయుడనిపించుకున్న వారెవరు? అంటే జవాబు పొత్తూరి వెంకటేశ్వరరావు గారే! ఎప్పుడూ తెల్లని లాల్చీ పంచ కండువా ధరించి తెలుగుదనం మూర్తీ భవించినట్టు ఉండేవారు.
1958 ప్రాంతంలో మొదటిసారి ప్రసాదరాయ కులపతి, కృష్ణభిక్షువు, పి.ఎస్.ఆర్ వంటి వారితో కలసి జిల్లెళ్ళమూడి వెళ్ళారు. ఆ ప్రయాణం జీవిత చరమాంకం వరకు కొనసాగింది. ఆ తర్వాత ఏమిటి నేను అమ్మను అంటుంది? ఏ రకమైన సైకాలజీ ఇది? ఇంకా తెలుసుకోవాలనే జిజ్ఞాసతో పదేపదే జిల్లెళ్ళమూడి వెళ్ళటం తటస్థించింది. గంటల తరబడి, రోజుల తరబడి అమ్మ దగ్గర గడిపి అమ్మతో గంటల కొద్దీ సంభాషించే అవకాశాలెన్నో లభించిన అదృష్టవంతులు. ఆ క్రమంలో కొడుకుని ఎంత దగ్గరగా రానివ్వటానికి వీలుంటుందో అంత దగ్గరగా రానిచ్చింది అని చెప్పుకొన్నారొక ఇంటర్వ్యూలో. ఎంత నాస్తికుడనైనా సత్యాన్ని నమ్ముతా, తార్కికంగా చెపితే నమ్ముతా అంటారు. నిరీశ్వరవాది కాదుగాని హేతువాద దృష్టి అధికం. అమ్మ మాటల గురించి చెపుతూ “తెలుగులో సూత్రీకరణ ప్రక్రియ లేదు, అది ప్రారంభించిన కీర్తి అమ్మకే దక్కుతుంది. బ్రహ్మసూత్రాలు ఎంత తత్త్వ సంపన్నమైనవో, భావనా గర్భితమైనవో అమ్మ మాటలూ అంతే!” అంటారు. అమ్మ మాటలు వినగా వినగా చాలా కాలానికి సమస్త విశ్వాన్ని నిండిన శక్తి యేదో ఒకటి ఉన్నదన్న అభిప్రాయం నాలో యేర్పడింది అంటారు. ఆ అనుబంధం వల్ల కావచ్చు నాస్తికత నుంచి ఆస్తికత వైపుకు మళ్ళారు. జీవితం అంతా విధి నడిపించటమే అన్న తాత్త్విక ధోరణి యేర్పరచుకున్నారు. ఆ ప్రభావం వల్లనేమో వారి స్వీయ చరిత్రకు “విధి
నా సారధి” అని పేరు పెట్టుకున్నారు. అమ్మతో నా సంభాషణలను డా. శ్రీ పాద గోపాలకృష్ణమూర్తి గారి వలె నేను భద్రపరచుకోలేదు, దురదృష్టం అని చింతిస్తూనే బహుశః అది కూడా అమ్మ సంకల్పమేమో అంటారు. అమ్మలోని మానవీయ లక్షణాలు బాగా ప్రభావితం చేశాయి. అవి మహత్తులను మించినవి అని వారి నమ్మిక. అమ్మపై వచ్చిన అనేక గ్రంథాలకు అభిప్రాయాలు, పీఠికలు వ్రాశారు. ఒకచోట అంటారు – జిల్లెళ్ళమూడి అమ్మకు, అమ్మ నెలకొల్పిన సంస్థలకు యధాశక్తి సేవలందించిన అందరూ ధన్యులే అని. అట్టి ధన్యులలో వీరు ఎన్నదగిన వారు. జిల్లెళ్ళమూడి కాలేజి, ఆసుపత్రి రావటంలో వీరి పాత్ర ఉంది. విశ్వజననీ పరిషత్ అధ్యక్షులుగాను ఆ సంస్థ వారి పత్రిక ‘విశ్వజనని’కి గౌరవ సంపాదకులుగా సేవలందించారు.
ఒకసారి ఉత్తరంలో అమ్మ ‘అంఆ’ అని మాత్రమే వ్రాసిందట. అవి బీజాక్షరాలనేనా అని అడిగితే ఔననే నిర్ధారణ చేశారు కులపతి గారు. నా అనుభవంలో అవి అమ్మ ఉపదేశించిన బీజాక్షరాలు. దాన్ని నేను జపం చేస్తా, ఎవరైనా చేసుకుంటే మేలు కలుగుతుంది అనే విశ్వాసం నాది అని చెపుతారు. నా వృత్తిలో నేను విజయం పొందాను కదా, ఆ విజయానికి కారణం అమ్మే అన్న విశ్వాసం వీరిది. ఎన్ని ఉన్నత పదవులు చేపట్టినా, ఎంతో ప్రసిద్ధులతో పరిచయాలున్నా ఎంతో నిరాడంబరంగా, నిష్కామ కర్మయోగిలా జీవితం గడిపిన వారు. ఆయన భౌతికంగా కనుమరుగైనా, వారి రచనలో చిరంజీవిగా నిలుస్తారు.
మార్చ్ 5, 2020 ఉదయం అమ్మ ఒడిని చేరి సేదతీరుతున్న అనుంగు బిడ్డ, పత్రికా రంగంలో నిష్టాగరిష్టులు, ఏ భావజాలంలోను చిక్కుకోని నిబద్ధత, నిజాయితీలో విశిష్టులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు గారికి హృదయ పూర్వక అక్షరాంజలి.