గత సంచిక తరువాయి…
రాగద్వేషాలు రహితమైన ‘అమ్మ’ “నేను, నాది” అన్నమాటలు సామాన్యంగా ఉపయోగించ లేదు. అవుసరమైన వ్యావహారిక సందర్భాల్లో తప్ప ‘అనుసక్తత’ – (detached) భావంతో ‘అమ్మ’ అన్ని విషయాల్లో వ్యవహరించారు అని చెప్పటానికి ఎన్నో సందర్భాలున్నాయి. ఉదాహరణకి ఒకరు. ఆశ్రమవాసి అని నాకు గుర్తు. అతను. అన్నది. “అమ్మా” మేము అక్కడ 40 మందికి కూడా భోజనం పెట్ట లేక పోతున్నాము. ఇక్కడ మీరు 400 మందికి ఎలా పెడుతున్నారు?’ అని ఆశ్చర్యాన్ని ప్రకటించాడు.
‘అమ్మ’ అన్నారు అక్కడ మీరు పెడుతున్నారు. ఇక్కడ వీళ్ళు వాళ్ళ అన్నం తిని పోతున్నారు”, చాల చిన్నవాక్యం అయినా అత్యంత భావగర్భితమైంది. మేము పెడుతున్నాం ||అన్నది అహంకార పూరితమైంది. వాళ్ళ అన్నం వాళ్ళు తినిపోతున్నారు అని అన్నది. ద్వంద్వాతీతమైంది. ఇంకా నిశితంగా ఆలోచిస్తే అందరినీ పోషించే దైవమే వీళ్లకు పెడుతున్నాడు. మనం పెడుతున్నాం అని అనటంలో అర్థం ? చివరి మాటగా చెప్పాలంటే ఎవరికి ఎక్కడ ప్రాప్తం ఉంటే అక్కడ తింటాడు. అందుకే మేము పెడుతున్నామన్నది నిజం కాదు.
‘అమ్మ’ తన కుటుంబానికి జరిగిన సంఘటనల్లో కూడా ‘ద్వంద్వాతీతమైన భావనతో వ్యవహరించారు. జీవితపు సుఖదుఃఖాలను సమ్యక్ దృష్టితో స్వీకరించారు. ‘అమ్మ’ ‘ఏకైక కుమార్తె కుమారి హైమ ఏప్రిల్ 5, 1968న దివంగతులైనారు. కుమారి హైమది అతికి సున్నితమైన హృదయం. స్వర్గీయ శ్రీ ఎక్కిరాల భరద్వాజ, కుమారి హైమను తల్లిగా స్వీకరించాడు. జిల్లెళ్ళమూడికి వచ్చేవారిలో అనేక మందికి హైమ పట్ల పూజ్యభావం ఉండేది.. హైమ సమాధి పొందిన తరువాత ‘అమ్మ’ దగ్గరే ఉండి ఖననం చేశారు. హైమ స్వర్గస్థురాలైన నాలుగు రోజులకే ‘అమ్మ’ జన్మదినం జరగవలసి ఉంది. ఈ విషాద సంఘటన దృష్ట్యా జన్మదిన వేడుక జరుపుతారో లేదో అన్న అనుమానం నాకు కలిగింది. అయినా ‘అమ్మ’ని చూడాలన్న కోరికతో జిల్లెళ్ళమూడికి వెళ్ళాను. ఊహించినట్టుగానే జనం పెద్ద సంఖ్యలో రాలేదు. భవనంలో ‘అమ్మ’ వరండాలో పండగ సందర్భంగానే కూర్చొని ఉన్నారు. బహుశా.. అప్పటికి ఉత్సవం ప్రారంభం కాలేదు. అమ్మ చుట్టూ చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ‘అమ్మ’ కూర్చున్న చోటు నుండి కొద్ది దూరంలోనే (ఆవరణలోనే) కుమారి హైమను ఖననం చేసిన గుర్తులున్నాయి. అక్కడ నేల తడిగానే ఉంది. చాలా సేపు కంట తడిపెట్టి కొంగుతో తుడుచుకొన్న కళ్ళ మాదిరిగా ఉంది. ‘అదే భవనంలో ఎవరో భక్తులు వివాహ సంబరంలో ఉన్నారు. ‘అమ్మ’ వదనంలో విచార రేఖలు కనుపించ లేదు. నన్ను చూసి చిరునవ్వుతో పలుకరించారు. చేతిలో ఉన్న సంచి గోడప్రక్కన పెట్టి ‘అమ్మ’కి దగ్గరగా కూర్చున్నాను. ఓదార్పుగా రెండు మాటలు మాట్లాడాలి అని అనుకొన్నాను. కాని అలా చేయలేక పోయాను. ‘ఏమిటి ? అన్నట్టుగా ‘అమ్మ’ నా వైపు చూశారు.
”అమ్మా’ ఓ చిన్న ప్రశ్న అన్నాను.
అడగమన్నారు….”
“ఒక వైపు మరణం, మరో వైపు పెళ్ళి సందడి. ఏకకాలం రెండింటిని చూస్తున్న. నీకు ఏమనిపిస్తున్నది”? అని అన్నాను. క్షణమాత్రం కూడా ఆలస్యం చెయ్యకుండా, ‘అమ్మ’ వెంటనే అన్నారు. ఎదురుగా కనిపిస్తూన్న చెట్టును చూసిస్తూ “ఆ చెట్టుకు ఒక వైపు ఆకులు రాలుతున్నయ్యి, మరో వైపు ఆకులు చిగుర్చుతున్నయి. ఇదీ అంతే” అన్నారు నవ్వుతూ.
‘అమ్మ’ ఇచ్చిన సమాధానము ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని తృప్తిని కలిగించింది. ‘అమ్మ’ ‘ఇచ్చిన సమాధానం ‘అమ్మ’ ‘యదార్థస్థితిని’ స్పష్టపరుస్తుంది.
“దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే” (గీత (॥) -56)
దుఃఖములకు క్రుంగిపోనివాడు. సుఖములకు పొంగిపోనివాడును, ఆసక్తిని, భయక్రోధములను వీడినవాడును. అయినట్టి మనశ్శీలుడు (ముని) స్థితప్రజ్ఞుడనబడును. ఒకసారి శ్రీరాం గారు ఈ శ్లోకం యొక్క ప్రాముఖ్యత గురించి చెపుతూ, మొత్తం ‘గీత’లో ఈ శ్లోకం వజ్రంలాంటిది. అందులోకూడా ‘స్థితధీః’ మరింత శ్రేష్టమైనది అని అన్నారు. ‘స్థితధీః’ – అంటే స్థిరమైన, అచంచలమైన, ‘మనస్సు ఉండటం. ‘అమ్మ’ అన్న యదార్థమే నా స్థితి అన్న మాటకు అర్థం- దీన్నే ‘స్థితప్రజ్ఞత’ అని అంటారు.
స్థితప్రజ్ఞురాలైన ‘అమ్మ’ సర్వాన్ని యదార్ధస్థితితో’ చూశారు. అది ఎలా అన్నది మన ప్రశ్న. ‘అమ్మ’ తన జీవితాన్ని మనకి అసలైన ఆధ్యాత్మిక మార్గాన్ని చూపటానికి గడిపారు. మొదటి విషయం ‘అమ్మ’ విశ్వంలో ప్రతి ప్రాణిని తన బిడ్డగా చూచుకొన్నారు. బిడ్డల ఆలనాపాలనా విషయంలో భోజనం ప్రధానమైన విషయంగా భావించి తనను చూడటానికి. వచ్చిన వారందరిని భోజనశాలకు పంపించేవారు. తల్లి, తొలి పలకరింపు భోజనం చేయండి. అని వ్యావహారికంగాను, ఆధ్యాత్మిక పరంగాను, విశ్వంలో ‘అమ్మ’ అన్న పదానికి స్థానానికి ఉండే ఏకైక ప్రాముఖ్యతను మనకి అర్థమయ్యే పద్ధతిలో వ్యవహరించారు. అన్ని సంబంధాల్లోకి అత్యుత్తమైన సంబందము, ఆధ్యాత్మిక పరాకాష్ట చెందిన సంబంధం తల్లీ బిడ్డల సంబంధం అని, భగవంతుడికి, భక్తుడికి ఉండే సంబంధం ఈ సంబంధమేనని, ఆధ్యాత్మిక చింతనలో తల్లీ బిడ్డల సంబంధ “సంకేతం” తీర్చలేని సమస్య ఉండదని శ్రీరాంగారి ద్వారా తెలుసుకొన్నాను. ‘అమ్మ’ తాను ‘కాస్మిక్ మదర్’ ప్రతి రూపం అని స్పష్టంగా అన్నారు. “అంతటా ఉన్న అమ్మ తెలియడానికే ఈ ‘అమ్మ” అని చెప్పారు. ఒక సందర్భంలో సున్నితమైన మందలింపుగా అన్న ఈ వాక్యం కూడా ‘అమ్మ’ తన ‘కాస్మిక్ రూపాన్ని తెలియచేశారు. “నేను ఈ మంచమ్మీద కూర్చున్నానని నాకేమి తెలీదనుకొంటున్నారు. కాని నాకు గోడచాటులేదు. ఈ ఆవరణలో ఎవరేం చేస్తున్నదీ, ఎక్కడ ఏం జరుగుతున్నదీ నాకు తెలుసు. అంత కళ్ళు మూసుకొని కూర్చొ లేదు. అయినా మిమ్మల్ని నేను ఏమీ అనకపోవటానికి కారణం మీదేమి లేదని, ఆ పనులకు మీరు బాధ్యులు కారని అనుకోవటమే” ఈ వాక్యంలో ‘అమ్మ’ తాత్విక చింతన పూర్తిగా అర్ధమవుతోంది. ఎవరికీ ఇచ్ఛాశక్తి లేక అంతటికీ ప్రేరణ” కారణం అయినప్పుడు ఎవరినీ తప్పు పట్టటం వీలుకాదు. ఈ విషయాన్నే సూచించారు. అంతేకాదు తాను మనం చూస్తూన్న భౌతిక రూపపరిణామానికి కట్టుబడి లేను అన్నది కూడా ఘంటా పథంగా చెప్పారు.
మనం నడిపించే వ్యవహారమంతా “మనది” కాదు అని చెప్పటానికి చేతలు చేతుల్లో లేవు” అని అన్నారు. ‘అమ్మ’ అన్న మాట మరొకటి పై వాక్యంతో జత చేసుకోవాలి. అది “తోచింది చెయ్యి తోపించేది వాడేగా !” ఈ రెండు వాక్యాలు ప్రాంగ్ నిర్ణీతము” పట్ల ‘అమ్మ’ దృక్పధం తేటతెల్లమవుతున్నది.
“నాది, నేను” అని అమ్మ ఏ సందర్భంలోను వాడలేదు. ఈ రెండు ‘అహంకార ‘ శబ్దాన్ని పొడచూపుతాయి. తాత్విక ఆలోచనా పరులకి, ఈ రెండు మాటలు ఆధ్యాత్మిక పురోగతికి విరుద్ధమైనవి. అంతేకాదు నేను, నాది అని అనటం భ్రమాజనితంగా భావించబడుతుంది. సూటిగా, నిశ్శంకోచంగా ‘అమ్మ’ చెప్పిన వాక్యం, ముఖ్యంగా సాధకులకు ఉపయోగపడుతుంది. “ఏదైనా ఆచరించటం మన చేతుల్లో ఉన్నదా ? ఎప్పుడు ఏది తోస్తే అది చెయ్యటమే. మనకర్థం కాని శక్తి ఏదో ఒకటి ఉందిగా ? కాని మనకర్ధం కాని శక్తి ఏదో వుండి పని చేయిస్తూన్నా – మనం చేస్తూన్నాం కనుక “నేను” అనుకోక తప్పదు. మనల్ని నడిపించేది వేరే ఏదో ఉన్నా మన కాళ్ళు నడుస్తున్నయి కనుక నడుస్తున్నాం అనుకోక తప్పదు”.
ఇక్కడ అమ్మ నేను అని అనటానికి అనక పోవటానికి కారణం చెప్పారు. జ్ఞాని “నేను” “నాది” అనుకోక పోవటానికి కారణం తనదంటూ ఏదీ లేదుకనక (consistency of thought) ధృడాభిప్రాయం. తాత్మిక చింతనలో పునాది రాయి లాంటిది. ఉదాహరణకి రమణమహర్షి ‘నేను’ ‘నేనెవడను’ అన్న విచారణ అన్నింటికీ మూలం, ఆ విచారణ చేయమని అందరికీ ప్రభోదించారు.
‘అమ్మ’ అన్నింటికీ మూలమైన ‘శక్తి’ గురించి, దాని ప్రభావం వల్లనే ప్రతిది జరుగుతున్నది అని వక్కాణించారు. జరుగుతున్నదంతా ముందుగానే నిర్ణయమై ఉన్నది. అని స్పష్టంగా చెప్పారు. చిన్న సంభాషణ చూడండి.
ఒకరు అమ్మతో “ఏదో ఆ కొండకు మనమై వెళ్తే’ అని అంటే – ‘అమ్మ’ అన్నారు “కొండకు వెళ్ళటం, ఆ నమస్కారం చెయ్యటం – శాసనంలోవే” మరో సందర్భంలో ‘అమ్మ’ అన్న వాక్యం చూడండి.
“తెలిసినా తెలియక పోయినా, చూసినా చూడకపోయినా నమ్మినా, నమ్మకపోయినా, ద్వంద్వాలూ, ద్వంద్వాల కాధారమైన శక్తి ఒకటి ఉన్నదనీ, సర్వమూ తనే జరుపుకుంటుందనీ తెలుసుకోవాలి”.
‘అమ్మ’ చెప్పిన మాటలకి ప్రామాణిక శ్లోకం గీతలో ఇలా ఉన్నది.
నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్ |
కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణై: (గీత 3-5)
ప్రతి ప్రాణికి ప్రకృతి కొన్ని గుణాలని ప్రసాదిస్తుంది. ఆ గుణాలకి లోబడే మన ఆలోచనలు, కర్మలు సాగుతూ ఉంటయ్యి. ‘ప్రకృతి’ అన్నా ‘శక్తి’ అన్నా భగవంతుడు’ ఇవన్నీ పర్యాయ పదాలు. అంతటికి ఆధారమైన శక్తి తనే జరుపుకుంటుందని అన్న అమ్మమాట’ ‘ప్రకృతిజైర్గుణై’ పదానికి సరిపోతుంది.
‘అమ్మ’ అనేక సందర్భాలలో సర్వం ‘భగవంతుడి ఆధీనంలో ఉంటుందని ‘ఆది’ ఆయన ‘ఇచ్ఛ ప్రకారం నడుస్తుందని సూచించారు. చివరగా ‘అమ్మా’ మీ సందేశం ఏమిటి అని అడిగితే ఇలా అన్నారు.
“ఏది జరిగినా ఎవరు ఏది చేసినా మనం కాదు చేసింది. మనను నడిపించే శక్తి మరొకటి ఉన్నదని అనుకోవటమే”.