1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మ దర్శనం

అమ్మ దర్శనం

Kondamudi Subba Rao
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : September
Issue Number : 2
Year : 2022

బిడ్డల ప్రవాహం ఎప్పుడూ జిల్లెళ్ళమూడికి ఎదో దిశనుండి చేరుతూనే ఉంటుంది.

ఒక మతంవారూ, ఒక జాతివారూ, ఒక వర్ణంవారూ, ఒక వర్గంవారూ కాదు, సకలజనం భేదాతీతంగా చేరుతారు కొందరు; కొందరు మోక్ష గాములై, లౌకిక కామ్యార్థులై కొందరు జిజ్ఞాసువులై, మరికొందరు అమ్మ అనురాగామృత పానాసక్తులై. వారి యాత్రా ఫలాలు ఒకసారి విశ్లేషిద్దాం.

మొదటగా వారికి లభించేది అమ్మ దర్శనం.

 అమ్మ దర్శనమే చాలు సకల పాప సమూల నిర్మూలనకు. పద్మాల కంటే అతి మృదువయిన ఆ దివ్య చరణాలపై ఒక్క క్షణం మన దృష్టి నిలిచిన చాలు మన నాడీమండలంలోనే ఒక నవచైతన్యం నిండినట్లు, మన రక్తప్రసరణమే ఉత్తేజితమయినట్టూ, మన మనసులు పునీతమైనట్టూ, మన మనుగడే సార్థకమయినట్టూ అనుభూతులమవుతాము.

అమ్మ కన్నులూ, వానిలోని జ్యోతులూ, ఉదయపు తెల్లని ఆకాశంలో ఎర్రటి సూర్య బింబంలా భ్రుకుటి మీద కాంతులీనే ఆ కుంకుమబొట్టూ, నాసికకు తళతళలాడే బులాకీ, అమృత కలశాలు వ్రేలాడు తున్నట్లు కర్ణద్వయం, పద్మములవంటి ఆ నయన ద్వయం, నాజూకైన ఆ హస్తాలూ, అంగుళులూ, వానిలోని కోమలత్వమూ, ఎక్కడ చూచినా దైవలక్షణ సమన్వితమే. మనం మంత్ర ముగ్ధులమై మైమరచి భక్తిపూర్వకంగా ముకుళిత హస్తయుగళితో అలా నిలిచిపోతాము.

ఇక అమ్మ దృష్టియే మనపై క్షణకాలం ప్రసరించిందా … కావలసిన దేమున్నది? మనం అమ్మ కారుణ్య వర్షంలో తడిసినట్టూ, మన ఎడదలలో సుధలు కురిసినట్లూ మన జీవితాలే ధన్యమయినట్లు పులకించి పోతాము. ఆ చూపులు మన హృదయం లోకిసూటిగా గుచ్చుకుంటాయి. అవి ఎంతో పదునుగా బలంగా మన అంతరాంతరాలలోకి వెళ్ళి మూల మూలలా శోధిస్తాయి. అవి మన మనసులోని కాలుష్యంపై దాడి చేస్తున్నట్లు మనకు భావన కలుగుతుంది.

మన వ్యక్తిత్వం ఉనికిని కోల్పోయి ఆ పాదాల చెంత సర్వార్పణ మవుతుంది. ఆ రూపం దర్శించటం మన నయనాలు చేసుకున్న పుణ్యం. అక్కడ జరుగుతున్న అమ్మ నామం వినటం మన చెవులు చేసుకున్న పుణ్యం. అక్కడ అమ్మకు పూజచేసిన పుష్పాల పరిమళాలు ఆఘ్రాణించటం మన నాసిక చేసుకున్న పుణ్యం. అమ్మ దివ్యచరణాలను స్పృశించటం మన హస్తాలు చేసుకున్న పుణ్యం.

ఆ సన్నిధికి నడిచి రావటం మన పాదాలు చేసుకున్న పుణ్యం. భక్తిపారవశ్యంలో మునిగి తేలడం మన హృదయం చేసుకున్న పుణ్యం. నిజానికి అమ్మను చూసిన పారవశ్యంలో ఈ ప్రపంచం మర్చిపోతాం. అప్పటి దాకా మనల్ని అల్లకల్లోలం చేసిన కోరికల సుడిగుండం శాంతపడి ఏ కోరికా మనసులో ౦డదు. మనలో చాలా మందికి ఇది అనుభవమే. ఈ విషయంలో మనకేమి చింత ఉండవలసిన అవసరం లేదు. “అడిగితే అడిగినదే ఇస్తాను. అడగకపోతే కావలసింది ఇస్తాను. “అని అమ్మ ఇచ్చిన వరం ఉందిగా.

అమ్మ దర్శనం సకలార్ధ సాధకం. ఒక అలౌకిక ప్రశాంతత, లౌకిక భరోసా, ఏక కాలంలో కలుగుతాయి. అమ్మలో ఒక దైవం, ఒక మాతృమూర్తి ఒకే సమయంలో దర్శనమిస్తారు. ఏ ప్రశ్నలు వేయకుండానే మన ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. ఇందుకే “అమ్మ మాట్లాడరు కదా” అంటారు కొందరు.

కానీ “బధిరులు అమ్మ మాట వినని దురదృష్టవంతులు అనే మాటలవి” అంటాడు రామకృష్ణ అన్నయ్య. అమ్మ సంభాషణ రూపేణ కూడా మాట్లాడుతుంది. అమ్మ మాట్లాడని మాట్లాడలేని విషయం లేదు. వేదాలు శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు కావ్యాలు అన్నింటికీ అమ్మ సంభాషణలు సమానమైన స్థాయిలో ఉంటాయి.

“సర్వ సమ్మతమే నామతం” అని ప్రకటించిన అమ్మ అన్ని సిద్ధాంతాలను సమన్వయం చేస్తూ కొత్త సిద్ధాంతాలని ప్రతిపాదన చేస్తుంది. అమ్మ చెప్పే ప్రతి విషయం అర్థమై పూర్వీకులు చెప్పిన విషయాల కంటే ఎంతో విశిష్ట ఉన్నతంగా ఉంటాయి అని మేధావులు ఏకకంఠంతో ఉద్ఘాటిస్తున్నారు.

అమ్మను అనేకులు దర్శిస్తారు. వారిలో తాత్వికులు ఉన్నారు, విద్యార్థులున్నారు, ఆస్తికులు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు. అమ్మ అందరి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది అందరి ఆకలి తీర్చినట్లు. అయితే ప్రశ్నించేవాడి స్థాయికి అమ్మ వచ్చి మాట్లాడుతుంది. పరిగెత్తే వాడి వెంట కొంత దూరం పరిగెత్తి వాడు ఆగినప్పుడు పట్టుకోవడం అమ్మ విధానం. అందువల్లనే కొందరు అమ్మ చెప్పేది పూర్వ సిద్ధాంత సారమై ఉంటుందని అంటున్నారు. మరికొందరు అమ్మ పూర్వ శాస్త్రాలకు భిన్నంగా చెబుతున్నది అంటున్నారు.

అలాంటి సందర్భాన్ని పరిశీలిద్దాం. ఏప్రిల్ ఒకనాటి సాయంకాలం ఆరు గంటలకు ఒక సోదరుడు అమ్మ పాదాల వద్ద కూర్చున్నారు. వారికి చేసే ఉద్యోగ స్వభావం వలన అనేక బాధ్యతలు, ఒత్తిడి, పరుగులు తీసే ఉద్యోగం. ఎంతో కాలం నుండి ఒక ప్రశ్న వారిని వేధిస్తూ ఉన్నది. దానికి సమాధానం కోసం వారి నిరీక్షణ. అమ్మ వాత్సల్య పూరిత దృక్కులతో వారిని చూస్తూ ఉన్నది. వారి ప్రశ్న “అమ్మా! నేను ఉద్యోగం చేస్తున్నాను. నా ఉద్యోగానికి కాలనిర్ణయం లేదు. అవసరమైతే తెల్లవారకముందే ఇల్లు విడిచి వెళ్లాలి. మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు. అందువలన రోజూ చేయవలసిన దైవ కార్యక్రమాలు నిర్వర్తించ లేక పోతున్నాను. మడి కట్టుకుని గాయత్రీ మంత్రమైనా చేయలేకపోతున్నాను.

కానీ ప్రయాణం చేస్తూ అయినా ఆఫీసులో కుర్చీలో కూర్చుని అయినా మనసులో స్మరిస్తాను. అలా చేయటం తప్పేమో అని ఒక వైపున బాధ. నా విధిని సక్రమంగా చేయలేకపోతున్నానని మరోపక్క వేదన. ఏమి చేయమంటావమ్మా. నేను చేస్తున్నది తప్పా అమ్మా!” అన్న అతని వేదన విన్న అమ్మ “కాదు నాన్నా!” అన్నది. దానికా సోదరుడు “అయితే అలా చేసుకో మంటావా అమ్మా”అన్నాడు.

అమ్మ “చేసుకో నాన్నా! నీకు ఎట్లా అవకాశం ఉంటే అట్లాగే చేసుకో. నిష్ఠలూ, నియమాలు, మనం ఏర్పరుచుకున్నవి. మడి అంటే హద్దు అనేకదా. శరీరం శుభ్రంగా ఉంటే మనసు కూడా నిర్మలంగా ఉంటుంది అని ఊహ. అది అందుకు సహాయం చేస్తుంది కూడా. నీకు అందుకు అవకాశం లేక అలా చేయవనుకో అదేమీ తప్పు కాదు.

నీ ఆశయం ఏమిటి అంటే మడి కట్టుకో కట్టుకోకపోయినా మంత్రం జపించు, ధ్యానం చేయి. ఏ సాధన అయినా మనస్సుకు ఏకాగ్రత సంపాదించు కోవడం కోసం. ఏకాగ్రతతో ఈ మనసు అంటే, ఈ శరీరాన్ని ఆశ్రయించుకుని ఉన్న మనసు, సర్వ వ్యాప్తమైన ఉన్న మహా చైతన్యం ఒక్కటే అని తెలుసు కోవడమే జ్ఞానం.

ఆ తెలుసుకోవటం వల్ల మనస్సు అనేక బంధాలు నుండి బాధల నుండి భయాల నుండి విముక్తి పొందుతుంది. అవిచ్ఛిన్నమైన అనిర్వచనీయమైన ఆనందం అనుభవిస్తుంది. ఏ సాధన వల్లనైనా మనిషి కోరుకునేది తృప్తి, ఆనందమే కదా. అవిజ్ఞానం స్వార్ధం వలన కలుగుతుంది. జ్ఞానం మనసు వలన కలుగుతుంది. అందుకు ఏకాగ్రత కావాలి. అది ఎవరికి ఏ విధంగా లభ్యపడితే అట్లాగే చేయవచ్చును. అందుకు మంచి చెడ్డలు లేవు. తప్పొప్పులు లేవు. కాలం మారిపోయింది నాన్నా. కాలాన్ని అనుసరించి ఆలోచనలు మారాలి.

నువ్వు పుట్టిన కులాన్ని బట్టి జపతపాలు నీ స్వధర్మం అనుకుంటున్నావు. కులాలు వృత్తిని బట్టి ఏర్పడినవే. ఇప్పుడు నీ వృత్తి వేరు. దానిని బట్టే నీ ధర్మం. నీ ఉద్యోగంలో నీవు నీతి నిజాయితీతో ఉండటమే నీ ధర్మం. దానిని సక్రమంగా పాటిస్తే మరింకేమీ అవసరం లేదు. ఇది వాస్తవం. కానీ ఈ వృత్తి ధర్మాన్ని మించి మనస్సు ఇంకేమైనా కోరితే దానిని నెరవేర్చవలసిందే. లేకపోతే మనసులో అసంతృప్తి అశాంతి చెలరేగుతుంది.

అశాంతికి గురైన మనిషి అనేక బాధలకు గురి అయి అశక్తుడు అవుతాడు. అతను జీవితంలో ఏమీ సాధించలేడు.అందుకని నీకు వీలయినట్లు చేసుకో నాన్నా! నీకు ఎట్లా తృప్తిగా ఉంటే అట్లా చేసుకో సంకోచాలు ఏమీ వద్దు.” అతను తృప్తిగా అమ్మ వంక చూశాడు. సంశయం పోయి మనసు తేలికపడింది.

మరణానంతరం మన పరిస్థితులు ఏమిటి ? అన్నదానికి కొన్ని నిర్దుష్టమైన అభిప్రాయాలు ఉన్న సమాజం మనది. కొన్ని కార్యక్రమాలు చేసిన వారికి సుగతి, కొన్ని కార్యక్రమాలు చేసిన వారికి దుర్గతి ఇదీ మన నిశ్చితాభిప్రాయం. కానీ కాలాంతరంలో కొంతమంది మానవతా వాదులు వైదిక కార్యక్రమాలు ఆచరించేవారికే కాదు, జనహిత కార్యక్రమాలు ఆచరించే వారికీ సుగతే అన్న సడలింపు భావన కలిగించారు. అయితే మరణానంతర స్థితిలో తేడా ఉంటుంది అన్నది తిరుగులేని అభిప్రాయం. ఇది కర్తృత్వ భావన జీవుడికి ఆపాదిస్తూ చేసిన నిర్ణయం. ఆధ్యాత్మిక ప్రపంచంలో సామ్యవాదాన్ని ప్రకటించిన అమ్మ ఈ విషయంలో ఏం చెప్పింది ? ఇది చాలా ఆసక్తికరమైన విషయం.

చేతలు చేతుల్లో లేవు. ఏది చేసినా వాడి ప్రేరణతోనే” అని జీవి కర్తృత్వాన్ని కొట్టివేసిన అమ్మ అందరికీ సుగతే అని వినూత్న నిర్ణయం చేసింది. నీవు చేసే కార్యక్రమాలు నీ చేతుల్లో లేవు కనుక నీవు ఏం చేసినా నీకు సుగతే అని మానవజాతికి సంతృప్తి కలిగించే ప్రకటన చేసిన అమ్మ విశ్వజనని. బిడ్డలలో మంచి వాళ్ళు, చెడ్డ వాళ్ళు, అన్న భేదభావం లేకుండా అందరికీ సుగతే అని ప్రకటించిన అమ్మ పరమదయాళువు.

ఈ సందర్భంలో ఈ రోజు దినపత్రిక లో చదివిన ఒక సంఘటన ప్రస్తావిస్తాను. కొడుకా ఇంకా లేవా అంటూ ప్రాణాలు వదిలిన తల్లి. ఇచ్ఛాపురం లో జరిగిన సంఘటన ఇది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ ఎలాంటి వాడైనా ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉన్నాడు అని అనుకుంటున్న ఆ తల్లి బిడ్డ ఇంక లేడనే వార్త విని తట్టుకోలేక పోయింది, మనస్తాపంతో తుది శ్వాస విడిచింది.

వివరాలు :

శ్రీకాకుళం జిల్లాలో 09-07-2015న చోటు చేసుకున్న సంఘటన ఇది. ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి గ్రామానికి చెందిన దుంప మోహన్రావు, వయసు 40 సంవత్సరాలు. ఒక హత్య కేసులో 2011 నుంచి విశాఖపట్నం సెంట్రల్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. తల్లి దమయంతికి కుమారుడు అంటే చాలా ప్రేమ. అతను వారం రోజులుగా అనారోగ్యం తో క్షీణించి 09-07-2017 తెల్లవారుజామున 3 గంటలకు మృతి చెందాడు. కుమారుడి మరణవార్త తెలుసుకున్న దమయంతి తీవ్ర మనోవేదనకు గురై అదేరోజు మధ్యాహ్నం ఆమె కూడా ప్రాణాలు విడిచింది. ఇదీ వార్త. కొడుకు చెడ్డవాడైనా తల్లిప్రేమలో ఎలాంటి తేడా ఉండదని, రావణాసురుడి తల్లికి కూడా వాడంటే ప్రేమే.

మరి సాధారణమైన తల్లే కొడుకును ఇలా ప్రేమిస్తే ప్రేమలో ఎలాంటి లోపము చూపించని ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ అమ్మ గురించి చెప్పాలా? అందుకే తల్లికి తప్పే కనిపించదు అని చెప్పింది అమ్మ. దీనినే మరణానంతర స్థితికి అన్వయించి అమ్మ అందరికీ సుగతే అన్నది.

చీమలో దోమలో కాదు, చీమగా దోమగా ఈ చరాచరజగత్తుగా ఆ పరమాత్ముడు మారి పోతే మరణానంతరం ఈ జీవి అనంతమైన ఆ శక్తి లోనే విలీనం అవుతూంటే ఇక అందరికీ సుగతి కాక మరి ఏముంది?. అందుకే అమ్మ ఈ అల వెళ్లి మహా సముద్రంలో కలుస్తుంటే మరలా ఈ అలకు ప్రత్యేక అస్తిత్వం ఎందుకుంటుంది? అని ప్రశ్నించింది .

ఒక సందర్భంలో డాక్టర్ శ్రీపాద గోపాల కృష్ణమూర్తి గారు శ్రీ వీరమాచనేని ప్రసాద రావు గారు అమ్మతో సంభాషించి దానిని టేప్ చేసి సోదరులందరికీ ఉపయోగం కోసం ప్రచురించారు. తద్వారా అమ్మ ప్రవచించే తత్వానికి తగిన ప్రమాణికత కల్పించారు.

ఆనాడు సోదరులు శ్రీపాద వారు అమ్మ ను ప్రశ్నించారు. “అందరికీ సుగతే అన్నారు తాత, అంకదాసులతో మహోదధి తరంగాలలో. ఈ విషయం ఒకసారి వివరించండి” – అని.

అమ్మ ఇలా వివరించింది. “అడిగే వారి దృష్టిలో -శరీరం ఉండగా అడిగారు అంటే దానికి డబ్బు ఉద్యోగం భార్య బిడ్డల యోగక్షేమాలు ఆరోగ్యం అని అర్థం. ఇదే మనం అనుకుంటాం. కానీ ఇక్కడ అడిగాడు. తాత శరీరం వదిలిన తరువాత పొందే స్థితి. అమ్మా!నా గతి ఏమిటి? అని. శరీరం తరువాత పొందబోయేది అందరికీ ఒకటే . అందరి గతీ నీగతే. అందరికీ సుగతే. అదీ జన్మలు లేవు అనుకుంటున్నాను గనుక జన్మలు లేవు గనుక” అని అన్నాను అని అమ్మ స్పష్టంగా చెప్పింది. (అమ్మ తో సంభాషణలు మూడవ భాగం)

ఇంకొక సందర్భంలో ఒక సోదరుడు కొండప్ప అమ్మతో ఇలా అన్నాడు. కొండప్ప అందరికీ సుగతే అన్నారు?

అమ్మ: గతికి వీడు కారణం కాదు కనుక. 

నా దృష్టిలో తెలిసినవాడికి తెలియని వాడికి సుగతే

సోదరుడు: ఈ సుగతి విచారణ చేసే వాడికీ, బ్రహ్మ జ్ఞానికేనా? కుంటివానికి, గుడ్డివానికి వీరి మాటేమిటి? 

అమ్మ: శరీరం పోయిన తరువాత పొందే స్థితి అందరికీ ఒకటే. ఆ స్థితి అందరికీ ఒకటే సుగతి.

అమ్మ కుండబద్దలు గొట్టినట్టుగా చెప్పింది. (అమ్మతో సంభాషణలు మూడవ భాగం 39,40 పేజీలు) అవధులు లేని అనంత కరుణామయి మన అమ్మ. జయహెూమాత

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!