అమ్మ ప్రేమ, వాత్సల్యం, కరుణ లోకోత్తరం. ఎందరు ఎన్ని విధాలుగా వర్ణించినా అది కేవలం అనుభవైకవేద్యం. అనుభవించిన వాడు మరొకరికి వర్ణించి చెప్పాలంటే సరిపడా భాష లేదు. తేనె మాధుర్యాన్ని గురించి ఎంత చెప్పినా ఒక్కసారి రుచి చూసిన దానితో సమానం కాదుకదా! అమ్మ ప్రేమ మాధుర్యం కూడా అంతే!
అమ్మ వాత్సల్యం ఎంత మధురమో, అరుదైన అమ్మ మందలింపు అంతకంటే ఇంకా మధురం. “తల్లికి తప్పే కనపడదు” అని ప్రకటించిన విశ్వజనని మందలించే సందర్భం ఎలా వస్తుంది?
అవి నేను ముట్లూరు సిండికేట్ బ్యాంక్ లో పనిచేస్తున్న రోజులు. దాదాపు రెండు సంవత్సరాల లోపు వయసున్న మా అబ్బాయి కృష్ణకాంత్ని తీసుకుని మోటార్ సైకిల్మీద కూర్చోబెట్టుకుని నేను, నా శ్రీమతి జిల్లెళ్ళమూడి వచ్చాం. వచ్చేసరికి మధ్యాహ్నం అయింది. ఎండ కొంచెం తీవ్రంగానే వుంది. అన్నపూర్ణాలయంలో అమ్మ ప్రసాదం తీసుకుని అమ్మ దర్శనానికి వెళ్లామనుకున్నాం. ఎండ వేడికి, దానికి తోడు లైన్లో భోజనం పూర్తిచేయడంలో జరిగిన జాప్యానికి మా వాడు ఏడవటం మొదలుపెట్టాడు. ఎంత సముదాయించినా మానటం లేదు. కాసేపు అటూ ఇటూ తిప్పి, చివరికి అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళాం.
అమ్మ చుట్టూ కొంతమంది సోదరీ సోదరులు వున్నారు. అమ్మకు పాదాభివందనం చేసుకుంటున్నంత సేపు వాడు ఏడుస్తూనే వున్నాడు. ఇదంతా అమ్మ గమనిస్తూనే వున్నది. మేము ఒక పక్క కూచోగానే నెమ్మదిగా “ఇంత ఎండలో మీరు మోటార్సైకిల్ మీద రావటమే ఒక తప్పు. దానికి తోడు పసివాడిని కూడా ఇంత ఎండలో తీసుకువస్తారా?” అంటూ “ఇలాం టప్పుడు ఎవరైనా మంచి పాట పాడితే వాడు ఏడుపు ఆపేస్తాడు” అని, “అలా పాడేవారు ఇక్కడ ఒకరున్నారు” అని పక్కనే వున్న మల్లాప్రగడ విజయశ్రీ వైపు చూసింది.
విజయ వెంటనే అది అమ్మ ఆదేశంగా తీసుకుని పాట ప్రారంభించింది. “లాలిశ్రీ మాతృమూర్తీ! అతిలోక కారుణ్య రాజ్యవర్తీ! లాలి సౌజన్యకీర్తీ! ………” అని మధురంగా పాడటం ప్రారంభించింది. పాట పూర్తి అయేసరికి వాడు గాఢ నిద్రలోకి జారుకున్నాడు.
అమ్మ చిరునవ్వుతో చూస్తూ “ఈ పాట వింటుంటే నాకే నిద్ర వస్తున్నది. వాడెందుకు పడుకోడూ?” అన్నది.