సమాజ రక్షణ కోసం మానవుల మధ్య అపుడపుడు మహాత్ములు అవతరించి సమాజ పరిస్థితిని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని అనుసరించి తమ ఆచరణాత్మకమైన ప్రబోధాలతో సామాజిక జీవితాన్ని ప్రభావితం చేశారు. తమ సందేశం ద్వారా ఎందరికో వెలుగు దారి చూపించారు. సృష్టి చరిత్రలోనే ఏ విధమైన భేదాలు లేకుండా అందరినీ తన బిడ్డలుగా దర్శించి ప్రేమించి లాలించిన అపూర్వ ప్రేమమూర్తి జిల్లెళ్ళమూడి అమ్మ.
అన్నపూర్ణగా ప్రసిద్ది చెందిన అంధ్రరాష్ట్రంలో గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని జిల్లెళ్ళమూడి ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ది చెందింది. జిల్లెళ్ళమూడి అనగానే ప్రత్యేకంగా కనిపించేది తల్లీ బిడ్డల బంధం. ‘అందరూ నా బిడ్డలే’ అన్న భావమే అమ్మ ప్రత్యేకత. ఎందరెందరికో తన మాతృప్రేమను, అవ్యాజ కారుణ్యాన్ని అమృత తుల్యమైన వాత్సల్యాన్ని పంచి తన నివాసాన్ని వర్గం లేని స్వర్గంగా సమ సమాజానికి నమూనాగా రూపొందించి అందరికీ ఆరాధ్యమూర్తి అయింది అమ్మ. అమ్మ సన్నిధిలో లౌకికానికి అధ్యాత్మికానికీ సుందర సమన్వయం గోచరమవుతుంది. ‘ప్రజాసేవ కూడా మోక్షమార్గమే’ అన్న అమ్మ ప్రకటన అక్కడి ఆవరణలో అడుగడుగునా ద్యోతకమవుతుంది. సామాజిక భావన లేని ఆధ్యాత్మికత రేవు లేని కాలువ వంటిది అంటూ లౌకిక జీవితంలో మంచి పద్ధతులు పాటించటమే ఆధ్యాత్మికత అని వినూత్న ప్రబోధాన్ని అందించింది అమ్మ. మానవుణ్ణి ఉద్ధరించడానికే నారాక అని ప్రకటించింది అమ్మ. ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో మానవత్వపు విలువలకు పట్టు కొమ్మలైన విషయాలన్నింటినీ ఆచరణాత్మకంగా ప్రబోధించిన మహనీయ మాతృమూర్తి. ఒక్క మాటలో చెప్పాలంటే మానవీయ విలువలకు మకుటాయమానం అమ్మ. ప్రపంచంలోని మానవులంతా ఒక్కటే అందరికీ సమాన అవకాశాలు కనీస అవసరాలైన కూడు- నీడ ఏర్పడాలనీ, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలనీ దీనికి ఏ భేదాలు అడ్డు కాకూడదనేది మానవతావాదం. దానిని అక్షరాలా ఆచరించి చూపింది అమ్మ.
మానవ సమాజంలో ప్రాథమిక అంశం ఆకలి. అన్ని బాధల కంటే ఆకలి బాధ భరించలేనిది నాన్నా! అని ప్రవచించిన అమ్మ 1940 లలోనే గుప్పెడు బియ్యాన్ని తీసి ఒక చోట నిల్వ చేయడం, అలా సమకూర్చిన బియ్యాన్ని అవసరానికి తగినంత తిరిగి తీసుకోవడం, ఈ విధంగా ఎవరూ ఆకలితో ఉండకుండా భోజనం చేయడానికి వీలుగా అమ్మ ఆ పథకాన్ని ఏర్పాటు చేసింది. ఒకసారి ఒక జ్యోతిష్యుడు అమ్మ దగ్గరికి వచ్చి ఏదైనా ఆ ప్రశ్న వేయమ్మా అని అమ్మను అడిగితే ప్రపంచంలో ఎవరూ ఆకలితో బాధ పడకుండా ఉండే రోజు కావాలి; అది సాధ్యమేనా అని అడిగింది. ప్రపంచ మానవాళికి ఆకలి అంటే తెలియని రోజు కోసమే అమ్మ ఆరాటపడింది. ఏ సాధనలు చేయని అమ్మ జీవితంలో ఇదే నిరంతర సాధనగా కనిపిస్తుంది. అమ్మలోని మహోన్నతమైన మానవతా దృక్పథానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి.
ఎవరూ ఆకలితో ఉండకూడదనే సామాజిక దృక్పథంతోనే జిల్లెళ్ళమూడిలో 1958 ఆగస్టు 15 న అన్నపూర్ణాలయాన్ని ఏర్పరిచింది. అన్నపూర్ణాలయంలో భోజనం ఎవరికి పెట్టాలి అని అమ్మను అడిగితే డ్రస్సు, అడ్రస్సు చూడకుండా ఆకలే అర్హతగా పెట్టమని ఆదేశించింది. భావాలు కలిసిన పదిమంది నిస్వార్థంగా సమష్టి ప్రయోజనం ఆశించి ఏ పని చేసినా అది యజ్ఞం. అందుకే నిరంతరంగా సాగే ఈ అన్నదాన కార్యక్రమానికి అమ్మ మాతృయాగం అని పేరు పెట్టింది. రోజూ అన్నపుర్ణాలయంలో ఎంత ఎక్కువ మంది భోజనం చేస్తే అమ్మకు అంత ఆనందం. కేవలం సందర్శకుల కోసం ప్రారంభమైన అన్నపూర్ణాలయంలో అక్కడి కళాశాలలోని విద్యార్థినీ విద్యార్థులు, అనేక వృత్తుల వాళ్ళు ఎంతో మంది భోజనం చేస్తూ ఉంటారు.
నిరతాన్నదానమే కాక సామాజిక సేవా కార్యక్రమాలకు కూడ ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది అమ్మ. తుఫానులు, వరదలు, అగ్ని ప్రమాదాలు మొదలయిన ఎన్నో విపత్కర పరిస్థితులలో గ్రామంలోని వారందరికీ కూడ వాళ్ళ పరిస్థితులు చక్కబడే వరకు అన్నపూర్ణాలయంలోనే భోజనం ఏర్పాటు చేయించింది. 1977లో వచ్చిన తుఫానుకు దివిసీమ మొత్తం కొట్టుకుని పోయింది. అపుడు అమ్మ తన దగ్గరున్నవాళ్లను ఆదరించడమే కాదు, అక్కడకు తీసుకు వెళ్ళడానికి పులిహోర మొదలైన పదార్థాలను ఏర్పాటు చేయించి అక్కడికి వెళ్లి వాళ్లందరినీ దగ్గరకు తీసుకుని వారి కష్టాలను విని ఓదార్చి తీసుకు వెళ్లిన పులిహోర నోట్లో పెట్టి చీరలు, ధోవతులు తానే స్వయంగా పంచి పెట్టింది. ఇలాంటి సందర్భాలు ఎన్నెన్నో. కష్టాలలో ఉన్న అభాగ్యుల బాధలకు స్పందించడమే మానవుని ద్వారా వ్యక్తమయ్యే దివ్యత్వం అని దివ్యత్వాన్ని అమ్మ నిర్వచించింది. కొంతమంది భక్తులు ‘తరించడానికి సులువైన మార్గం ఏదన్నా చెప్పమ్మా !’ అని అమ్మను అడిగితే ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చడం కంటే తరించే సులువైన మార్గం ఏముంది అని చెప్పింది.
(సశేషం)