అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడి పుచ్చిన యమ్మ తన్నులో
Add Newనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మా
యమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్వ, కవిత్వ పటుత్వ సంపదల్.
కొద్దో గొప్పో తెలుగు సాహిత్యంతో పరిచయం వున్న ప్రతివాడి గుండెల్లో ప్రతిధ్వనించే పద్యం ఇది
“ఇమ్మనుజేశ్వరాధములకు ఇవ్వక, తాను తెనింగించిన శ్రీ మహాభాగవత పురాణాన్ని “సమ్మతి శ్రీహరి కిచ్చి”న బమ్మెర పోతరాజు చెప్పిన కమ్మని పద్యరాజమిది.
“అమ్మా! అని ఒక్కసారి అనినంతనె చాలునురా! ‘అహ’మంతయు తొలగిపోయి ఆత్మ పర వశించునురా…..!” అని సోదరుడు లక్ష్మీకాంతరావు గారు అమ్మను కీర్తిస్తూ వ్రాశారు. కానీ మనసారా ఆ ఒక్కసారి అనటం నేర్చుకోవటానికి ఎన్నిసార్లు అనాలో!
పోతనగారికి ఒక్కసారి అమ్మా అంటే తృప్తి కలగలేదు. పద్యం నిండా పదిసార్లు అన్నారు. చివరగా “దుర్గ మాయమ్మ” అన్నారు. అక్కడే వుంది అసలు సంగతి. “అమ్మ నాది” అంటాడు. పసివాడు. అలా అనటంలో వాడికి తృప్తి. తల్లి మురిసిపోతుంది. ఆ మాటలకి లౌకికమైన తల్లికే అంత ఆనందమైతే, త్రికరణ శుద్ధిగా “దుర్గ మాయమ్మ” అంటే జగజ్జనని కరుణించకుండా ఎలా వుండగలదు? అందుకేనేమో బెజవాడ కనకదుర్గమ్మ అపురూపమైన ఈ పద్యాన్ని తన గర్భాలయ ప్రవేశద్వారంపై చెరగని శిలాక్షరాలుగా వ్రాయించుకుని తన దగ్గరనే వుంచుకుంది.
సర్వసృష్టికారిణి అయిన అమ్మ “నాది” అనుకోగల స్థితి ఎంత గొప్పది! అలా అనిపించిన తల్లి స్త్రీ రూపంలో వున్న “దుర్గమ్మ”, పురుషరూపంలో శ్రీకృష్ణుడు – ఇదిగో ఇప్పుడు ఈ యుగంలో విశ్వజనని, మాతృప్రేమ స్వరూపిణి మన అమ్మ.
“అమ్మా! నే నిన్ను వీడ
నీ వాడ నే అన్యుల వేడ” అంటారు నదీరా!
“నేను నీవాడిని. నాకు ఇంకేమీ అక్కరలేదు” అన్నవాడిని భగవంతుడు అక్కున చేర్చుకుంటాడు. అయితే అలా అనాలంటే అందరికీ సాధ్యం కాదు. ఆమాట హృదయపు లోతులనుండి నిజాయితీగా బయటకు రావాలి. అలా ఒక ప్రహ్లాదుడు అనగలిగాడు, గోపికలు అన్నారు, అర్జునుడు అనగలిగాడు.
“నా జీవితమే సందేశం” అని చెప్పిన అమ్మ తన బాల్యంలోనే “నీకేం కావాలో చెప్పు” అని అడిగిన వాసుదాస స్వామితో “ఏమన్నా కావాలనేది అక్కర్లేకుండా కావాలి” అని సమాధానమిచ్చి స్వామివారినే దిగ్భ్రాంతులను చేస్తుంది.
అందుకే “కోరికలు కోరేటి కోరికే లేనట్టి మనసుండు నట్లుగా వరదోభవ!” అని రాజుబావ ప్రార్థిస్తాడు.
“అడిగితే అడిగింది ఇస్తాను. అడగకపోతే అవసరమైనది ఇస్తాను” అంటుంది అమ్మ. నిజానికి మనకు ఏది అవసరమో మనకంటే అమ్మకే బాగా తెలుసు. మన కోరికలలో దూరదృష్టి లేదు. అమ్మ దృష్టికి అడ్డుగోడలు లేవు.
అమ్మ మన మధ్య మసలిన కాలం ఒక స్వర్ణయుగం. ఎంతమందిని లాలించిందో! తరగని తన వాత్సల్యామృతాన్ని ఎంతమందికి పంచిందో! ఎవరికి వారు అమ్మ తనమీదే ప్రత్యేకమైన వాత్సల్యాన్నీ, ప్రేమను చూపిస్తున్నదని అనుకున్నారా లేదా? అదీ పరమాత్మ తత్త్వం!!
“మూడు కోట్ల సురలంతా కలసి
మూలవిరాట్టువు నీవై వెలసి
కంటబడితివి కన్నతల్లివి
వెంటబడితిని చంటిపాపను” అంటారు నదీరా!
ఆ విశ్వజననికి మనమంతా అడ్డాలలో బిడ్డలమే! కానీ మన అమ్మ, మన గమ్యం, మన దేవత అమ్మే అనీ, అమ్మ తప్ప వేరే లోకమే లేదనీ, అమ్మ తప్ప ఇంకేమీ వద్దనీ, అమ్మే సర్వస్వమనీ భావించే స్థితి మనకు రావాలి. అందుకోసం తపించాలి. ఆ తపనే తపస్సు కావాలి