సహస్ర నామధేయ అమ్మ. కాగా తన అశేష సంతానాన్ని ముద్దు పేర్లతో పిలుచుకుంటుంది. ఉదాహరణకి శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావుగారిని ‘వెంకన్న’ అనీ, శ్రీ వల్లూరు పాండురంగారావుగారిని ‘రంగడు’ అనీ, శ్రీ వై. వి. మధుసూదనరావు గారిని ‘మధు’ అనీ. డాక్టర్ ఎ.ఇనజకుమారి అక్కయ్యని ‘పాప’ అనీ చీరాల సో॥ శ్రీ వై.వి. సుబ్రహ్మణ్యం గారిని ‘బుద్ధిమంతుడు’ అనీ అలా పిలవటంలో మమకారం, వాత్సల్యంతో పాటు ఔచిత్యం కూడా ఉంది.
అమ్మ పెట్టుకున్న పేర్లు మనకీ అలవాటై పోయి పాపక్కయ్య, మధు అన్నయ్య, బుద్ధిమంతుడు అన్నయ్య అని పిలవటం పరిపాటయ్యింది. అవన్నీ సార్థక నామములు. ఉదా: బుద్ధిమంతుడు అన్నయ్య.
వారు 1961లో మొదటిసారిగా అమ్మను దర్శించు కున్నారు. సో॥ శ్రీ నోరి వెంకటేశ్వరరావుగారు తీసుకు వెళ్ళారు. రెండవసారి మే 5న అమ్మ కళ్యాణదినోత్సవానికి వెళ్ళారు. దర్శనం చేసుకుని, హడావిడిగా, ప్రసాదం తీసుకోకుండా తిరుగు ప్రయాణమయ్యారు. నాలుగు అడుగులు వేశారు. అంతలో అమ్మ ఎవ్వరినో పిలిచి “చీరాల నుంచి సుబ్రహ్మణ్యం అనే ఒకాయన వచ్చాడు. ఆయన్ని ‘సుబ్రహ్మణ్యం’ అంటే పలకడు. బుద్ధిమంతుడు అని పిలు” అని ప్రసాదం ఇమ్మని పంపింది.
బుద్ధిమంతుడని వారి కన్నతల్లి పిలుచుకునేది; ఈ ‘అమ్మ’కి ఎట్లా తెలిసిందోనని వారు ఆశ్చర్యపోయారు. ఇటువంటి సంఘటనే గోపాలన్నయ్య సందర్భంగా సంభవించింది. ఆ సన్నివేశంతోనూ ‘అమ్మే నా కన్నతల్లి’ అని గోపాలన్నయ్యకి రూఢి అయింది.
బుద్ధిమంతుడు గారి విషయంలో రెండు ముఖ్యమైన సంఘటనలను చెప్పుకోవాలి. ఒకసారి బందరు శర్మగారితో Cool drinks Marketing నిమిత్తం చిత్తూరు వెళ్ళారు. అమ్మకి నమస్కరించుకుని సంగతి చెప్పి బయలుదేరారు. చిత్తూరులో ఒక లాడ్జిలో బసచేసి, వ్యవహారం చక్కబెట్టుకుని తిరిగి లాడ్జి చేరుకున్నారు. శర్మగారికి సిగరెట్ త్రాగే అలవాటు ఉంది. ఆయన సిగరెట్ త్రాగుతూ పరుపు మీద పెట్టారు. కారణంగా పరుపు కొంత మేర కాలిపోయింది. పరుపు తిరగవేసి యాజమాన్యానికి ఏమీ చెప్పకుండా రూమ్ ఖాళీ చేశారు. బుద్ధిమంతుడు వెనక్కి వెళ్ళి విషయం చెప్పి తన్నిమిత్తం తన జేబులోంచి రూ.150/-లు కట్టివచ్చారు. రెండవది. చాలా చిన్న విషయం. ఎవరైనా చిల్లర అడిగితే “నా వద్ద ఉన్నది. కానీ ఇవ్వలే నంటారు. వారి నిజాయితీకి నిబద్ధతకి దర్పణం పట్టే ఈ సంఘటనలను పొట్లూరి సుబ్బారావు అమ్మతో ప్రస్తావించినపుడు అమ్మ “వాడు బుద్ధిమంతుడురా! అబద్ధం చెప్పడు” అన్నది.
అనేకసార్లు అమ్మ బుద్ధిమంతుడు గారిని ప్రాణాపాయ, విపత్కర స్థితి నుంచి సంరక్షించింది. జనవరి 1వ తేదీ నూతన సంవత్సర ఆహ్వాన సందర్భంగా, దీపావళి పండుగ సందర్భంగా ఆయన విశేష సేవలను అందిస్తారు. అది సోదరీ సోదరులందరకూ సువిదితమే.
తన సేవ చేసుకునేందుకు తానే వారిని అను గ్రహించింది అమ్మ. కారుణ్యామృతవర్షిణి అమ్మ.
అమ్మ పెట్టుకున్న ముద్దు పేర్లన్నీ సార్థక నామములే.Me