అమ్మ శతజయంతి ఉత్సవాలు రావటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. నేను చిన్నవయస్సులో ఆమె చేత ప్రభావితుడనైనాను. ఒక ప్రేమస్వరూపిణిగా ఆమె కొన్ని లక్షలమందిని ప్రభావితం చేసింది.
సమాజంలో ఒక ధర్మం నిలబడాలంటే రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి భయం వల్ల – ప్రభుత్వం, అధికారం, భయం వీటివల్ల ధర్మం కొంతవరకు నిలబడుతుంది. కానీ, ప్రేమవల్ల, తపస్సువల్ల వచ్చే మార్పు శాశ్వతంగా ఉంటుంది. ఆమె తన ప్రేమతోటి సమాజాన్ని మార్చటానికి పూనుకున్న వ్యక్తి. సమస్త ప్రపంచాన్నీ ప్రేమించింది. ఒక తల్లిగా తన బిడ్డలుగా ఈ ప్రపంచాన్ని భావించి అందరికీ ప్రేమను పంచింది. ఆ ప్రేమతరంగాలు ఇప్పటికీ ప్రసరిస్తూనే ఉన్నాయి. ఆమె చేత ప్రభావితుడనై ఆమెను గురించిన ఎన్నో గ్రంథాలు కూడా వ్రాశాను నేను.
ఆమె శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒక ప్రయోగం చేశాను. అదేమిటి అంటే ‘ఆత్మావాహన విద్య’ ద్వారా ఒకసారి ఆమె శరీరం విడిచిపెట్టినటువంటి రోజు, ఒక సంవత్సరం, నా ధ్యానమందిరంలో కూర్చుని ఆమెని ఆవాహనం చేశాను. ఆమె వచ్చి నిలుచున్నది. నా ప్రశ్నలకి – “నాయనా! ఇట్లా చెయ్యి. ఇట్లా చెయ్యి” అని సమాధానాలు చెబుతున్నది. “అమ్మా! నా తపస్సు పెంపొందించటం ఎట్లా? నీ అనుగ్రహం, దేవతల అనుగ్రహం రావటం ఎట్లా?” అని అడిగితే కొన్ని సూచనలు ఇచ్చింది.
అయితే, ఇక్కడ చెప్పదగ్గ ఒక విచిత్రం ఉన్నది. అదేమిటని అంటే మా చెల్లెలి మనవరాలు, 6 నెలల పసిబిడ్డ, మా మేడ మీద ఉన్నది. నేను అమ్మతో మాట్లాడుతున్నాను. ఆ బిడ్డ మెట్లుదిగి నడచివచ్చి అమ్మ ముందు నిలుచున్నట్లు నాకు అనిపిస్తున్నది. నేను కళ్ళుమూసుకుని అమ్మతో మాట్లాడుతున్నాను.
“ఇదేమిటి? నువ్వు ఎట్లా వచ్చావు? ఎందుకు వచ్చావు?” అన్నాను నేను. భౌతికంగా 6 నెలల బిడ్డ లేచి రావటం అనేది ఉండదు కదా! కంటిముందు కనిపిస్తున్నది. “నేను పూర్వజన్మలో అమ్మయొక్క భక్తురాలిని, శరీరం విడిచి పెట్టాను, కానీ ఆమె వచ్చిన సంగతి నాకు తెలిసింది. అందుకని వచ్చాను. నమస్కారం చేసుకున్నాను” అని చెప్పి వెళ్ళింది. అమ్మ దర్శనం – ఆమె ఉండేటటువంటి దివ్యభూమికలో ఉండి నన్ను అనుగ్రహించడం – అది ఒక అంశం. రెండవ అంశం ఏమిటంటే – పసిపిల్లకు మనస్సెక్కడిది? భౌతిక శరీరం చిన్నది కదా! అంటే There is a super mind. అప్పటికి మనస్సు develop కాలేదు. There is a super mind – దానికి తెలిసి వచ్చింది అని యోగశాస్త్రంలో ఉన్న ఒక విచిత్రమయిన దానిని – ఒక కొత్త అనుభవంగా ఆనాడు భాసించింది నాకు.
అలా ఆమె దివ్యభూమికలో ఉన్నది; భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నది. ఎప్పుడూ అనుగ్రహిస్తూ ఉంటుంది. అందువలన ఆమె ప్రేమ తరంగాలు ఎప్పుడూ ప్రసరించాలనీ అందరికీ శుభం జరగాలనీ, ఈ శతజయంతి ఉత్సవాలు దిగ్విజయం కావాలనీ కోరుతున్నాను.
నారాయణ! నారాయణ!!