ఒక చల్లని శుక్రవారము సాయింత్రము నాకు మా సోదరుడు వల్లూరు పార్థసారధికి అమ్మను దర్శించు కొనవలయునను కోరిక కలిగినది. వెంటనే బయలుదేరి బాపట్ల చేరుకొని, పూలదండలు కొని, 7వ మైలుపద్ద దిగి, నడుచుకుంటూ జిల్లెళ్ళమూడి రాత్రి 10.30 గం.లకు చేరుకున్నాము. ఆఫీసువద్ద వరండాలో రామకృష్ణ అన్నయ్య కనుపించి, ఇప్పుడే వస్తున్నారా అని పలకరించి, భోంచేసి రమ్మని చెప్పినారు. ముందుగా మేము, అమ్మను దర్శించుకొని, దండవేసి నమస్కరించు కొనవలయునని చెప్పగా, అమ్మ పడుకున్నారను కుంటాను, అయినా పైకి వెళ్ళి చూచిరండని పంపినారు. పైకివెళ్ళి అమ్మ గదివద్ద నిలచున్నాము. చీకటిగా ఉన్నది, ఎవరూ కనిపించలేదు. అలాగే అచ్చట నిలబడినాము. కొంచెము సేపైన తరువాత గదిలోనుండి శ్రీరామమూర్తి అన్నయ్య బయటకు వచ్చి మమ్ములను పలకరించి అమ్మ దర్శనమునకు వచ్చినామని చెప్పగా అమ్మ పడుకున్నారు. చూచివస్తానని గదిలోకి వెళ్ళి అటు ఇటూ తిరుగుతుంటే ఎవరదని అమ్మ అడిగితే, గుంటూరునుండి రామమూర్తి, పార్ధసారధి అన్నయ్యలు వచ్చారని చెప్పగానే మంచం మీద లేచి కూర్చొని, రమ్మనమని పిలిచారు. మహద్భాగ్యంగా మేము, అమ్మకు దండవేసి, పూలతో పూజించి, పాదాభివందనము చేసుకొని, మా కోరిక నెరవేరినందుకు సంతృప్తులమై నిలుచుంటే క్రిందకు వెళ్ళి భోజనముచేయమని చెప్పగా, క్రిందకు వచ్చి అమ్మ ప్రసాదము తీసుకొని విశ్రమించినాము.
అమ్మ వత్రోత్సవము – అపూర్వ అవకాశము:
అమ్మ వత్రోత్సవము 1983వ సంవత్సరంలో అత్యంత వైభవముగా నిర్వహించబడినది. ఆ సందర్భముగా నేను, రామరాజు కృష్ణమూర్తి అన్నయ్య అమ్మ దర్శనమునకు వెళ్ళినాము. అమ్మ మాకు కాలండర్లు, ప్రసాదం పొట్లాలు యిచ్చి గుంటూరులో ప్రతి ఇంటికి వెళ్ళి, కాలెండరు ప్రసాదము యిచ్చి, వాళ్ళు ఏమిస్తే అది తీసుకొనమని చెప్పినారు. గుంటూరు వెళ్ళిన తరువాత, నేను కృష్ణమూర్తిగారు, మోహనరావు, చలపతిరావు గారు నలుగురము ప్రతిరోజు సాయింత్రము, ప్రతి యింటికి వెళ్ళి అమ్మ ఆదేశానుసారము, కాలెండరు, కుంకుమ ప్రసాదము యిచ్చి మీరు అమ్మకు ఏమైనా సమర్పించదలుచుకుంటే జిల్లెళ్ళమూడిలో అందజేస్తాము అని చెప్పేవారము. కొందరు జిల్లెళ్ళమూడి నుండి వచ్చామని చెప్పగానే, ఆదరముగా లోపలికి రమ్మని, భక్తిపూర్వకముగా వారికి వారు ఇవ్వదలుచుకున్నవి సమర్పించే వారు. కొందరు ఇంటి తలుపుతీసి, జిల్లెళ్ళమూడి నుండి వచ్చామని చెప్పగానే, మాకిష్టములేదు వెళ్ళండని తలుపు మూసేవారు. పెద్దవాళ్ళని కొందరి ఇళ్ళకు వెళితే చాలా స్వల్ప విరాళము ఇచ్చేవారు; చిన్నవారి ఇళ్ళకు వెళ్ళితే ఎంతో భక్తిగా మా శక్తికొలది యిస్తున్నామని యిచ్చేవారు. అమ్మ చెప్పారు, ఉన్నవాళ్ళు ఎంతయిచ్చినా, లేనివాళ్ళు ఒక రూపాయి యిచ్చినా దానికి ఎంతో విలువ వుంటుందని. మేము సేకరించిన ద్రవ్యము, వారమునకు ఒకసారి అమ్మ దగ్గరకు వెళ్ళి ఆఫీసులో జమచేసి, అమ్మ దర్శనముచేసుకొని, ఆశీస్సులు అందుకొని వచ్చేవారము. ఇది మాకు అమ్మ కల్పించిన అరుదైన మహదవకాశము.
జయహో మాతా.
మరునాడు ఉదయము మరల అమ్మదర్శనము నకు వెళ్ళినాము. మాకు రెండు ప్లేట్లలో ఉప్మా తెమ్మని, ఒక చెంచా మా నోట్లోపెట్టి, ప్లేట్లు మా చితికిచ్చినారు. మేము ఉప్మాతింటూ, తినేవాళ్ళది అదృష్టమా, పెట్టుకొనే వాళ్ళది అదృష్టమా అని అడిగితే మన చేతిమీదుగా పెట్టుకోవడమే అదృష్టము నాన్నా అని చెబితే, నీ చేతి ప్రసాదము తినటముకన్నా అదృష్టమేమివున్నదని మేము ఆనందపరవశులము అయినాము. మా ప్రక్కన ఉన్న రామకృష్ణ అన్నయ్యకూడ ఎంతో ఆనందించి, ఈ విషయము, అప్పటి మాతృశ్రీ పత్రికలోకూడ ప్రస్తావించి నారు. సంతృప్త హృదయాలతో అమ్మవద్ద సెలవు తీసుకొని, అన్నపూర్ణాలయంలో ప్రసాదము స్వీకరించి తిరుగు ప్రయాణమైనాము.