1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మ సన్నిధిలో అధ్యాపకులు, విద్యార్థులు

అమ్మ సన్నిధిలో అధ్యాపకులు, విద్యార్థులు

Mallapragada Srimanarayana Murthy
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 21
Month : December
Issue Number : 5
Year : 2021

ఎన్ని పర్వతాలున్నా, హిమాలయాల ఔన్నత్యం సాటి లేనిది. ఎన్ని నదులున్నా గంగ పవిత్రత మాటల కందనిది. ఎన్ని క్షేత్రాలున్నా, ప్రయాగ ప్రత్యేక మైనది. ఎన్ని విద్యా సంస్థలున్నా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విశిష్టత అసాధారణం. జిల్లెళ్ళమూడిలో అవతారమూర్తి అమ్మ కరకమలాల మీదుగా ఆవిర్భవించిన ఈ కళాశాల అన్ని రంగాలలో సాధించిన అభ్యుదయం అనితర సాధ్యమైనది. విద్యతోపాటు సేవా దృక్పథం, క్రమశిక్షణ, ఆధ్యాత్మిక చింతన, వ్యక్తిత్వ వికాసం పెంపొందించు కుంటూ ఇక్కడి విద్యార్థులు ఈ నాటి సమాజంలో కరదీపికలుగా వెలుగొందుతున్నారు.

ఈ కళాశాలలో అధ్యాపకులకు, విద్యార్థులకు దక్కిన అపురూపమైన వరం అమ్మ సన్నిధి. అమ్మదర్శనం, అమ్మతో సంభాషణం, ప్రత్యక్షంగా అమ్మ ఆశీస్సులు అందుకోవటం వేల జన్మల పుణ్యఫలం.

అధ్యాపకులను, విద్యార్థులను తన బిడ్డలుగానే చూసింది అమ్మ. కన్నతల్లి ప్రేమనే మా అందరికీ చవి చూపించింది. ఎప్పటి కప్పుడు వారి బాగోగులను తెలుసుకుంటూ ఉండేది. విద్యార్థులకు ఇంతకంటే మెరుగైన వసతి భోజనాలు అందించాలనే తపన తరచుగా వెల్లడించేది అమ్మ.

సాక్షాత్తూ లలితా పరమేశ్వరి అమ్మగా అవ తరించిందని మనందరి ప్రగాఢ విశ్వాసం. మనలో ఎందరికో అది అనుభవం కూడా. విశ్వజనని సన్నిధిలో అధ్యాపకులు, విద్యార్థులు ఏదో ‘తెలియని ఆనందం’ తో ఉండేవారు. ప్రతి నిత్యమూ ఉదయం, సాయంత్రం ఆలయాలలో అర్చన, పారాయణ కార్యక్రమాలలో పాల్గొనటం, వాత్సల్యాలయంలో అమ్మను దర్శించి, ప్రత్యక్షంగా అమ్మ దీవనలు అందుకుని ఆనందించే అరుదైన అదృష్టం ఇక్కడి అధ్యాపకులకు విద్యార్థులకు దక్కింది.

అధ్యాపకు లందరమూ అప్పుడప్పుడు అమ్మ సన్నిధిలో కొంత సమయం ఇష్టాగోష్ఠిలో పాల్గొంటూ ఉండే వాళ్ళం. ‘ఏమీ తెలియని పసిపాప’ వలె చిత్రమైన సందేహాలు వెలిబుచ్చేది అమ్మ. సామూహికంగానూ వ్యక్తిగతం గానూ కూడా యోగ క్షేమాలు విచారించేది అమ్మ. ‘నా కేమీ తెలీదు నాన్నా!’ అంటూనే మనకు తెలియని ఎన్నో విశేషాలు వివరించేది అమ్మ.

 కళాశాల భవన నిర్మాణం జరుగక మునుపు తరగతి గదులు ఎక్కడ? అంటే, అది చిత్రంగా ఉండేది. ప్రధానభవనంలో మధ్య అంతస్తులో ఆశ్రమ వాసుల నివాసాలకు దగ్గరగా ఒక చివర భాషా ప్రవీణ ఫైనల్ తరగతి పాఠాలు జరుగుతూ ఉండేవి. అంటే వాత్సల్యాలయంలో అమ్మనివాసానికి సరిగ్గా దిగువన ఉన్న ప్రదేశం ఆ తరగతిగది. అధ్యాపకులు చెప్పే పాఠాలన్నీ అమ్మ వింటూ ఉండేది. ఆ తరగతికి పోతన భాగవతం పాఠం నేను చెప్తూ ఉండే వాడిని.

ఒకనాటి సాయంత్రం వాత్సల్యాలయంలో అమ్మ దర్శనం పొంది, నమస్కరించి, ఎదురుగా కూర్చున్నాను నేను. “ప్రహ్లాదుడి పాఠం బాగా చెప్పావురా!” అన్నది అమ్మ. నాలో నేనే పొంగిపోయాను. ఇప్పుడు గుర్తు లేదుకానీ కాస్తంత గర్వంగా కూడా అనిపించిందేమో అప్పుడు. నెమ్మదిగా సంభాషణకు ఉపక్రమించింది అమ్మ.

“నాన్నా! పరస్త్రీలు ఎదురైతే, వాళ్ళను తల్లిలా భావించి, తప్పుకునే వాడు ప్రహ్లాదుడు- అని ఏదో చెప్పావుకదా! అదేమిటి నాన్నా!” అని అడిగింది అమ్మ. “కన్నుదోయికి అన్య కాంత లడ్డంబైన మాతృభావన సేసి మరలువాడు” అని, ఆ పద్యం చదివి, భావం వివరించాను నేను. చాల అద్భుతంగా చెప్పానని నాకు నేనే అను కున్నాను. “ప్రహ్లాదుడి వయస్సు ఐదేళ్ళే అంటున్నావుగా నాన్నా! ఐదేళ్ల పిల్లవాడికి ఇట్లా కాకుండా వేరే భావం ఏం కలుగుతుంది నాన్నా!” అన్నది అమ్మ. నేను ఏదో నాకు తోచిన సమాధానం చెప్పాను. “భవ్య వయో బల ప్రాభవోపేతుడై కామ రోషాదుల క్రందుకొనడు” అని ఆ తరువాతి పద్యం చదివాను. “ఈ సందర్భంలో ముందుగా యుక్త వయస్కుడైన ప్రహ్లాదుని వ్యక్తిత్వాన్ని శీలసంపదనూ వర్ణించి, ఆ తరువాత అలాంటి ప్రహ్లాదుడి జీవితంలో ఐదేళ్ళ వయస్సులో జరిగిన కథా సన్నివేశాలను పోతన మహాకవి వివరించా”డని సమాధానం చెప్పాను నేను.

“బావుంది నాన్నా!” అంటూనే సంభాషణ కొనసాగించింది అమ్మ. “అయితే, పెరిగి పెద్దవాడైన తర్వాత మాత్రం కనపడిన స్త్రీలందరినీ తల్లిలా చూడటం ఎలా సాధ్యం? వాళ్ళపట్ల చెడు తలంపు లేదు- అని చెప్తే చాలు కదా!” అని అడిగింది అమ్మ. నా దగ్గర సమాధానం లేదు. నేను మౌనంగా తలవంచుకుని కూర్చున్నాను. అమ్మే మళ్ళీ వివరించింది.

“నాన్నా! పర స్త్రీలను కేవలం గౌరవిస్తే చాలదు. వాళ్ళను తన కన్నతల్లిలా చూడాలి. ఆదరించాలి కూడా’ – అని కవి చెప్తున్నట్లు మనం అనుకోవచ్చు కదా!” అన్నది. నేను ఆశ్చర్య చకితుణ్ణయ్యాను. అమ్మ ఎంత మంచి సందేశం ఇచ్చిందో కదా! అనుకున్నాను. అందరినీ తన కన్న తల్లివలె భావించి, వారి బాగోగులు చూశాడు. ప్రహ్లాదుడు. అలాంటి ప్రహ్లాదుణ్ణి గురించి అందరినీ తన బిడ్డలుగానే చూడగలిగిన అమ్మకు తప్ప నాబోటి సామాన్యుడికి ఎలా తెలుస్తుంది?

ఇలా అధ్యాపకుల ఆలోచనా పరిధిని విస్తృతం చేస్తూ, అమ్మ సంభాషించిన సందర్భాలు కోకొల్లలు. వాటిలో ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

అవతార పరిసమాప్తి చేసే ముందు అమ్మ వాత్సల్యాలయంనుంచి కదలి, అందరి ఇళ్ళకూ వచ్చింది. ఆశ్రమవాసులనూ అధ్యాపకులనూ పరవశింప చేసింది. అత్యాశ్చర్య కరంగా విద్యార్థుల వసతి గదులను కూడా సందర్శించింది అమ్మ. అన్ని తరగతుల విద్యార్థులూ తమ తమ వసతి గదుల్లో అమ్మను పూజించుకుని ఆనందించారు. అప్పుడు బి.ఏ. తెలుగు ఫైనల్ విద్యార్థుల ‘గైడ్’గా ఉన్న నేనూ విద్యార్థులతో పాటు ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆ నాడు విద్యార్థులు సమర్పించిన నూతన వస్త్రాలు ధరించి, వాళ్ళ పూజలు స్వీకరించింది అమ్మ.

విద్యార్థులను దగ్గరకు పిలిచి, “మీ కేదైనా వరం ఇస్తాను. కోరుకోండి రా!” అన్నది. “మాకు ఏం కోరుకోవాలో తెలీదమ్మా! మా తరఫున మా మాస్టారు కోరుకుంటారు” అన్నారు విద్యార్థులు. అమ్మ నా వంక చూసింది. ఏమి కోరుకోవాలో నాకూ తెలియలేదు.

“అమ్మా! వాళ్ళకే ఇస్తావా? ఆ వర మేదో నాక్కూడా ఇస్తావా?” అని అడిగాను నేను. “నీకూ ఇస్తానురా! కోరుకో” అని అమ్మ హామీ ఇచ్చింది.

“అమ్మా! ఒక్కవరమే ఇస్తావా? రెండు వరాలు కోరుకుంటే, రెండూ ఇస్తావా?” అన్నాను నేను. “రెండూ ఇస్తాను కోరుకోరా!” అన్నది అమ్మ.

అప్పుడు విద్యార్థుల తరఫున నేను అమ్మను రెండు వరాలు కోరుకున్నాను. “అమ్మా! తృప్తి, ధైర్యమూ – ఈ రెండు వరాలూ ఇవ్వమ్మా!” అని అడిగాను నేను. “ఇచ్చాను రా!” అన్నది అమ్మ. ఆ క్షణాలు నా జీవితంలో, మా విద్యార్థుల జీవితాలలో చాలా విలువైనవి. అలా ‘వర మిస్తాను. కోరుకో’ మని అమ్మ అనటం, విద్యార్థులకూ నాకూ కూడా ఇస్తాననటం, నేను ‘రెండు వరాలు కావా’లంటే, ‘రెండూ ఇస్తా ననటం’ అపూర్వమైన సంగతులు.

ఇది ఎప్పుడో 1985లో జరిగిన సన్నివేశం. ఇప్పుడు ఇన్ని దశాబ్దాల తరువాత ‘నన్ను’ నేను సమీక్షించుకుంటే ఎన్నో కోరికలతో పరితపించే సామాన్యుడినైన నాకు సాటిలేని సంతృప్తినీ, తద్వారా అంతులేని ఆనందాన్నీ అమ్మ అనుగ్రహించిందని నాకు అర్థమవుతోంది.

అలాగే, ఎంతో దుర్బలుడినైన నాకు ఎన్నో విషమ పరిస్థితులకు తట్టుకొని నిలబడగల ధైర్య స్థైర్యాలను అమ్మ పుష్కలంగా ప్రసాదించిందనీ తెలుస్తోంది. మా విద్యార్థులు కూడా అమ్మ ప్రసాదించిన తృప్తి ధైర్యమూ అనే ఈ రెండు ఆయుధాలతోనే జీవన పోరాటంలో అఖండ విజయాలు సాధిస్తున్నారు. ఆ దివ్యానుభూతినీ ఆనందాన్నీ తరచుగా వెల్లడిస్తూ ఉంటారు కూడా.

నేనేదో తెలివిగా అడగటం కాదనీ, ఆ రెండు వరాలూ మా అందరికీ అనుగ్రహించే ఉద్దేశంతోనే లీలామయమైన ఈ సన్నివేశాన్ని అమ్మ కల్పించిందనీ, ఈ వరాలే కోరుకునే స్ఫురణ కూడా అమ్మ సంకల్పంలో భాగమే ననీ చాల ఆలస్యంగా గుర్తించాను నేను. ఏ రెండు గుణాలు ఉంటే అన్నీ ఉన్నట్లే ఉంటుందో, ఏ రెండూ లేకపోతే ఎన్ని ఉన్నా ఏమీ లేనట్లే అవుతుందో ఆ రెండూ మా అందరికీ ప్రసాదించింది అమ్మ.

మా అందరికీ – అంటే మా అధ్యాపకు లందరికీ, మా విద్యార్థులందరికీ.

‘నరుడు’ ‘విజయుడు’ కావటానికి తగిన ప్రబోధం చేసి, కర్తవ్యంలో నిలబెట్టే విజయ సారథి అమ్మ. సకల విద్యల సారమూ అయిన సంతృప్తినీ ధైర్యాన్నీ అందుకు మూలమైన సంస్కార బలాన్నీ ప్రసాదిస్తూ అందరినీ అనుగ్రహించే విద్యా స్వరూపిణి అమ్మకు ప్రణ మిల్లుతూ… సెలవు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.