అమ్మ అనుంగుబిడ్డనైన నాకు అపారమైన ప్రేమానురాగాలను పంచి యిచ్చిన నా ఆత్మీయ సోదర సోదరీమణులు, వారి కుటుంబసభ్యులు, నా ధర్మపత్ని, నా కుటుంబ సభ్యుల వద్ద సెలవు తీసుకొని, అమ్మ సేవకై నా ప్రయాణం.
ఇంటికి పెద్దకొడుకుగా, తల్లిదండ్రుల సేవలో తరించి, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, కూతుళ్ళు వారి కుటుంబాల అభ్యుదయం కోసం నావంతు సహకారం అందించి, వారిని ఉన్నత స్థానాలలో చూచి తరించి అమ్మసేవకై నా ప్రయాణం. సేవాతత్వాన్ని అమ్మవద్ద నేర్చుకొని, నిడదవోలులో సాంస్కృతిక చైతన్యానికి నా వంతు కృషిచేసి, లక్ష్మీగణపతి నవరాత్రిమహోత్సవాలను మూడు దశాబ్దాలుగా నా ఆప్తమిత్రుల సహకారంతో దీక్షాదక్షతలతో నిర్వహిస్తూ తరించి, మరికొందరిని నావంతు ప్రోత్సహించి అమ్మసేవకై నా ప్రయాణం. నా ధర్మపత్ని జయలక్ష్మి సహకారంతో నిత్యము అతిథిసేవలో ఆనందిస్తూ, అమ్మను ఆరాధిస్తూ అనుసరిస్తూ జీవితం అంకితం చేసే ప్రయత్నంలో ఆనందంగా అమ్మసేవకై నా ప్రయాణం.
కృష్ణా గోదావరీ పుష్కరాలలో అమ్మ సంస్థకు ప్రతినిధిగా ఆప్తులు, ప్రియమిత్రులు, సోదరీ సోదరుల సహకారంతో సకుటుంబంగా అన్నదాన మహాయజ్ఞాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించి అమ్మసేవకై నా ప్రయాణం.
అమ్మే లోకమైన నేను అమ్మలోకానికి చేరి అమ్మ సేవలో తరించాలనీ ఆత్మీయులందరి వద్ద సెలవు తీసుకొని, అమ్మ దివ్యస్మృతిని సార్థకం చేసుకోవటానికి నా ప్రయాణం. అమ్మ శ్రీ చరణాలను ప్రార్థిస్తూ అమ్మవద్దకే నా ప్రయాణం. – ఇంక సెలవు.