సరిగ్గా 98 సంవత్సరాల క్రితం రుధిరోద్గారి చైత్రశుద్ధ ఏకాదశీ బుధవారం అరుణోదయ కాలంలో చెన్నకేశవస్వామి ఆలయంలో జేగంటలు మ్రోగుతుండగా, దేవాలయంనుండి బయలుదేరిన మంగళవాద్యాలు లోకానికి శుభసందేశమిస్తుండగా, మంద మలయానిలాలు జగతికి ఉపచారం సల్పుతుండగా వాత్సల్యమూర్తి, శుద్ధసత్త్వస్వరూపిణి, ప్రేమావతారమూర్తి సమస్త భూమండలాన్నీ పులకింపజేస్తూ అవతరించింది.
ఆ సంప్రదాయాన్ని అనుసరిస్తూ ప్రతి సంవత్సరం వలెనే తెల్లవారు జామున 4.30గం.లకు చి.వల్లూరి ప్రేమ 99సార్లు జేగంట మ్రోగించగా, శ్రీమతి వసుంధరక్కయ్య పూజాకార్యక్రమాలు వాత్సల్యాలయంలో నిర్వహించారు. అదే సమయంలో అనసూయేశ్వరాలయంలో సంప్రదాయంగా అనుసరిస్తున్న ఆచారంగా తంగిరాల కేశవశర్మ కుటుంబం తరపున శ్రీ తంగిరాల తేజోమూర్తి సమర్పించిన నూతన వస్త్రం ధరించగా, నరసింహారావు మావయ్య, మన్నవ శేషు అత్తయ్య అమ్మకు మంగళస్నానాదికాలు సమర్పించారు. శ్రీ బ్రహ్మాండం. రవి అన్నయ్య, వైదేహి దంపతులు మరియు శ్రీ విశ్వజననీ పరిషత్ తరపున శ్రీ దినకర్, కామరాజు అమ్మకు నూతన వస్త్రాలు సమర్పించారు.
తదనంతరం మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిగింది. ఉదయం 11.00 గం.లకు పాపక్కయ్య మరియు శ్రీమతి మొవ్వా శేషుమణి మరికొందరు సోదరీ మణులు అనసూయేశ్వరాలయంలో అనసూయావ్రతం జరుపుకున్నారు. అమ్మ కిరీటధారణియై దర్శనం ఇచ్చి భక్తులను పరవశింప జేసింది.
సాయంత్రం ఆవరణలోని సోదరీ సోదరులందరూ పాల్గొనగా అమ్మకు లక్షమల్లెలతో అర్చన నిర్వహించారు.
మండల దీక్షగా కొందరు సోదర సోదరీ మణులు ఈ సంవత్సరం మార్చి 14 నుండి అంబికాసహస్రనామ పారాయణ చేశారు. అమ్మ అవతరణ దినోత్సవం నాడు దీక్షావిరమణ చేస్తూ సామూహికంగా ఏప్రియల్ 23 సాయంత్రం రెండుసార్లు అంబికా సహస్రం పారాయణతో దీక్షావిరమణ జరిగింది.
అమ్మ అవనీస్థలిపై అవతరించి నడయాడడంతో….
– పరితప్త మానవాళికి చల్లని నీడపట్టు ప్రాప్తించింది.
– కోరనిదే వరాలిచ్చి రక్షించే సంరక్షించే సముద్ధరించే దివ్యమాత ఆశ్రయం లభించింది.
– మానవలోపాల్ని పాపాల్ని ఎత్తి చూపించి ఆగ్రహించని నిరుపమాన అనుగ్రహ స్వరూపం చేరువైంది.
– సదాచారం పట్ల సదవగాహన కల్గించి సన్మార్గగాముల్ని చేసే దిక్కు, దిక్సూచి దొరికింది.
– మూలకారణశక్తి సంపూర్ణతత్వం, సంపూర్ణతత్వం సుబోధకమైంది.
– మన బరువు, బాధ్యతలను తానే వహించి బేషరతుగా అందరికీ ‘సుగతి’ని ప్రసాదించే పరదేవతే మన కన్నతల్లి అయింది.