తొలి రోజుల్లో బాలయ్యన్నయ్య అని ‘అందరింట’ అందరూ ఆప్యాయంగా పిలుచుకునే శ్రీ కోమటి బాలయ్య గారిది ప్రకాశం జిల్లా ‘దుద్దుకూరు గ్రామం. ఈయనకు చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక జిజ్ఞాస మెండు. పుట్టిన సంపన్న వ్యయసాయ కుటుంబంలో గారాబంగా పెరిగిన వీరికి చిన్నతనంలోనే సంసారం పట్ల విముఖత కలిగి, అధ్యాత్మికతపట్ల ఆసక్తి పెరిగింది. ఆ జిజ్ఞాసతోనే వీరు S.S.L.C చదివాక 19 ఏండ్ల ప్రాయంలో ఇంట్లో చెప్పకుండా శ్రీ స్వామి శివానంద, హృషికేశ్ సన్నిధికి చేరారు. అనుకోకుండా అక్కడే ఆయనకు తమ వయస్సే కల శ్రీ S. పెంచెలయ్య గారితో పరిచయం ఏర్పడింది. అనంతర కాల పరిణామాల్లో 1960 దశక ప్రథమార్థంలో ఒకరి తర్వాత ఒకరు వీరిరువురూ, కొద్ది వెనుకా ముందులుగా, అమ్మ సన్నిధికి చేరారు. తరచూ అమ్మను దర్శిస్తూ అమ్మ అనుగ్రహ పాత్రులై, అమ్మ ప్రేమాను రాగాలు పుష్కలంగా పొంది, అనేక దివ్యానుభూతులు పొందసాగారు. 1963-64 లోనే శ్రీ బాలయ్య గారు కుటుంబ సమేతంగా తమ గొడ్లు, గోదాలతో జిల్లెళ్లమూడికి తరలి వచ్చి, అమ్మ సన్నిధిన ‘అందరింట్లో’ భక్తి శ్రద్ధలతో అనేకమైన వ్యవసాయ సేవలొనర్చారు. ఈమధ్య కాలంలోనే వయోభారంతో శ్రీపెంచలయ్య గారు అమ్మలో ఐక్యమయ్యారు. బాలయ్య గారు మాత్రం అమ్మఆలయ ప్రవేశానంతరం, భౌతికంగా అమ్మ ఎడబాటును సహించలేక, తెగిన గాలిపటంలా పలుచోట్ల అనేక మహనీయుల దర్శనాలుచేస్తూ, తమకు చేతనైన సేవలు గావించసాగారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా, తగిన అవకాశాన్ని దొరకపుచ్చుకొని, ఆయా ప్రదేశాలలో అమ్మను గురించి, అమ్మతో తమకు గల అనుభవాలు, అనుభూతులు చెప్పటం అనేది ఆయన జీవనంలో ఒక భాగంగా మారింది. ఆ క్రమంలోనే ‘పిరమిడ్ – ధ్యాన’ సమావేశాల్లో ఒకసారి అమ్మను గురించి ప్రసంగవశాన ప్రస్తావించడం జరిగింది. నా ఆహ్వానం మేర PMC ఛానల్ వారు ఆగష్ట్ 2021 నెలాఖరుకు జిల్లెళ్ళమూడిని గురించి ఒక documentary తియ్యబోతున్నారని ఆయనకు తెలిసింది. నేడు తన 86 ఏళ్ల వయసులో, నరాలు పట్టుతప్పి శరీరం వణుకుతున్న స్థితిలో, అమ్మను గురించి, అందరింటి ఉన్నతిని గురించి PMC Channel వారికి వివరించి వారిచే బాగా es documentary తీయించాలనే తపనతో, నేను మీరు పెద్దవారు, అంత ముందుగా జిల్లెళ్లమూడికి వచ్చి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనవద్దని వారించినా కూడా వినక, జిల్లెళ్లమూడికి 6 రోజులు ముందుగానే చేరారు. Channel వారు 28, 29 తేదీలలో వచ్చి shoot చేసుకొంటామన్నారు. వారు వచ్చేలోగా నరాల బలహీనతతో, ఆయన అటూ ఇటూ తిరిగే కదలికల వల్ల, ఏక్షణాన పట్టుతప్పి పడిపోతే ఆయనకేమౌతుందోనన్న ఆందోళన, ఒకప్రక్క నన్ను నిరంతరం వెంటాడింది. వద్దన్నా వినకుండా ఆవయసులో, అలా అనారోగ్యంతో, ఒంటరిగా ఆయన అంత ముందుగా జిల్లెళ్ళమూడికి చేరటం నాకు ఒకింత విసుగును కూడా కలిగించింది. అయినా అమ్మ వద్దకు వచ్చింది ఆయన. ప్రేరణ ఇచ్చి తెప్పించుకొన్నది అమ్మ. మధ్యలో నాపెత్తనం ఏమిటి? బోడి! ఆనుకొని సరిపెట్టుకొన్నాను.
ఆయన వచ్చిన దగ్గర నుంచి, రాబోయే Channel వారికి తగిన arrangements నేను చూస్తూ ఉన్నానా? లేదా? అని నాకు దగ్గరగా ఉండి ఏదన్నా నాకు సాయపడే ప్రయత్నం చేయసాగారు. మీరు rest తీసుకోండి! అన్నీ నేను చేసుకొంటానన్నా వినక, నా వెంటే ఉండి అటూ, ఇటూ నాతో పాటే తిరిగే ఆయన వైఖరి, నాకు ఒకింత చికాకు కలిగించింది.
25th Aug న నా పనులుచూసుకొని రాత్రి 9.30ని. కల్లా నా Room కి చేరి స్నానం చేసి స్టౌ మీద ఓట్స్ని ఉడికించే ప్రయత్నంలో ఉన్నాను.
Gate బయట చీకట్లో తలుపు తడుతూ నన్నెవరో పిలుస్తున్నట్లనిపించింది. Light వేసి వెళ్లి చూదును కదా! అక్కడ వణుకుతూ ‘బాలయ్యన్నయ్య’ నిలుచుని ఉన్నాడు. తలుపుతీసి లోపలికి రమ్మన్నాను. లోనికి వస్తూ నాకు నిద్ర పట్టటంలేదు బాబూ! అన్నారాయన. బాగా అలిసి ఉన్న నేను, నాకయితే నిద్రవస్తుంది! అన్నాను ఒకింత అసహనంగా!
నేనింకా ఏదన్నా చేసుకొని తిని, పడుకోవాలి! ఇంతకీ మీరేమైనా అన్నపూర్ణాలయంలో తిన్నారా? అని అడిగాను. నేనేమి రాత్రి పూట తినను అంటూ నాకు పడుకున్నా నిద్రపట్టటం లేదు! అని మళ్ళీ నాతో అన్నారు. నాదగ్గరున్న అమ్మ book ని ఆయనకివ్వబోయాను.
ఆ book ని తీసుకోకుండా బాబూ! నిన్నొక మాట అడగనా? నీవు అటూ, ఇటూ, తిరుగుతూ అనేకమైన ‘అమ్మ’ సేవలు చేస్తున్నావు. నీ కొడుకులు నిన్ను బాగా చూసుకొంటున్నారా? రాబడిలేని నీవు ఈ రోజులలో ఎట్లా ఇబ్బంది పడుతున్నావో! అన్న ఆలోచన కలిగి, నాకు నిద్రపట్టలా! ఆగలేక నీ దగ్గరకు వచ్చా! నాశక్తి కొలది ఇది నాదగ్గర ఉంది. నీ అవసరాలకు ఉంచు! అంటూ 4,5, 500/- నోట్లు వణికే చేతులతో తన జేబులో నుంచి తీసి, నాకు ఇవ్వబోయాడు. ఆయన మాటల, చర్యల వెనుక గల ఆయన మనస్సుకు స్థాణువైనాను. నా కనులలో గిర్రున నీరుబికాయి. ఒక మనిషిని అవగాహన చేసుకోవడంలోని నా మేధ, నా అవగాహన, ఆలోచనలు సిగ్గుతో తలవంచి మోకరిల్లాయి. మెల్లిగా తేరుకొని అన్నయ్యా! అమ్మ నాకు మంచి పిల్లలను ప్రసాదించింది. వాళ్ళు నన్ను కంటికి రెప్పలా చూసుకొంటున్నారు. అందుకనే నేను చేసే ఉద్యోగాన్ని సైతం వదిలి చేతనయిన అమ్మ సేవను, నాకోసంగా నేను చేసుకొంటున్నాను. కాబట్టి మీరు నా గురించిన బెంగను మాని హాయిగా నిద్రపొండి. – అని ఆయనకు నచ్చ చెప్పి పంపే సరికి రాత్రి 10 గ. సమయం దాటింది.
ఇక నేను ఓట్స్ ఉడికించి, దానిలో మజ్జిగ కలిపి తాగుదామని టేబుల్ ముందు కూర్చున్నాను. అంతలో రాత్రిపూట నేనేమీ తినను అన్న బాలయ్యన్నయ్య మాట స్ఫురణకు వచ్చింది. ఆయన మాటకు వెంటనే తగిన రీతి, నేను స్పందించ లేదనే ఆలోచనలు నన్ను చాలా సేపు కలవరపెట్టి ఆహారాన్ని తినలేక పోయాను. వెంటనే ఆయనకు phone చేస్తే ఆయన lift చేయలేదు. శ్రీమతి వసుంధరక్కయ్యతో చెబితే, నేను కావాల్సింది చేసి పెడతానంటూ అమర్నాటినుండి రాత్రి పూట ఆయనకు కావాల్సిన ఆహారాన్ని ప్రతిరోజూ తయారుచేసి పెట్టింది.
29th రాత్రి 10 గంటల దాకా channel వారి shooting జరిగితే, 30th ఉదయాన్నే శ్రీ బాలయ్యన్నయ్య తిరిగి ఆయన తన స్వగ్రామం ‘దుద్దుకూరు’ కు బయలు దేరారు. అనంతరం నా మనస్సులో చాలాసేపు అనేక ఆలోచనలు ముసిరాయి. ఇదేనా! అందరింట అందరి మధ్య ‘అమ్మ’ ఏర్పరచిన విశ్వ సౌభ్రాతృత్వానుబంధం అంటే! లేకుంటే ఎవరీ కోమటి బాలయ్య ? ఎవడీ రావూరి ప్రసాద్? మీ అందరికీ నేనే ‘అమ్మ’ నంటూ, అందరినీ సమంగా ప్రేమించి, అందరి మధ్య అనురాగానుబంధాన్ని పెంపొందించిన, ఈ ప్రేమ మూర్తి, ఈ అవ్యాజ కారుణామయి ఎవరు? అన్నీ అర్ధం అయ్యి, కానట్టు దోబూచులాడే అనేక మధురమైన ఆలోచనలతో మనస్సు ఓలలాడింది.