సుమారు రెండువేల సంవత్సరాల క్రితం వరాహమిహిరుని నాడీ జాతక గ్రంథంలో జిల్లెళ్ళమూడి గురించి వ్రాసిన భవిష్యద్దర్శనంలో –
“ఆవాసనం సువిస్తీర్ణం నరనారీ వహక్షమం
ఆరామ తరుసంపన్నం తపస్వి జనసంకులం
భవిష్యతి నిజావాసం బహుగోష్ఠీ సుసంకులం
దేవతాయతనం పుణ్యం గృహారామ సమన్వితం
ప్రతిష్ఠా చ తపశ్చర్యా భవిష్యతి సుదుర్లభా
క్రతుశ్చ మహతీనిష్ఠా బహుసిద్ధిప్రదా శుభా”
అమ్మ నివాసము – సువిశాలంగా పెక్కు స్త్రీ పురుషులుండుటకు అనువుగా, విద్వదోష్ఠులతో తపస్వులతో, తపోవన సంపన్నమై దేవతా నిలయమై, అనేక సిద్ధిదాయక క్రతునిర్వహణలతో – విరాజిల్లును అని ఉన్నది.
అమ్మ అవతరించిన క్షణం నుండి గమనిస్తే – ప్రతాప కోటయ్యగారు వంటి తపోధనులు, గంగరాజు పున్నయ్యగారు వంటి భాగవత శ్రేష్ఠులు, వెంకటప్పయ్యగారి వంటి ఉపాసకులు, సాధకులు – బారులు తీరి ఆ మూర్తి దర్శన స్పర్శన సంభాషణాదుల కోసం తపించారు. వారంతా చరిత్రలో కనిపిస్తారు. కొందరు మహితాత్ములు వస్తూ పోతూ ఉంటారు. అజ్ఞాతంగా, కొందరు ఖండాంతరాల్లో కొండగుహల్లో తపస్సు చేసుకుంటూ అమ్మను దర్శిస్తూ తరిస్తున్నారు – అన్న సంగతి కొంతవరకు తెలుసు మనందరికి.
మేము సుమారు 1982-83 ప్రాంతాలలో ఒకసారి అమ్మవద్దకు వచ్చినపుడు జరిగిన సంఘటన వివరిస్తాను.
‘అలనాటి జిల్లెళ్ళమూడి’ గురించి అమ్మ ఒక సందర్భాన్ని వివరించింది. వందల సంవత్సరాల నాటిమాట కావచ్చు – “కొంతమంది బాటసారులు ఎక్కడ నుండో నడుచుకుంటూ ఆ ప్రదేశము వరకూ వచ్చేసరికి మధ్యాహ్నకాలము అయింది. వారు ప్రయాణము ఆపి, వారితో తెచ్చుకున్న తీపి గుమ్మడికాయ అరచేయి వెడల్పున తొడిమతో సహితముగా రంధ్రము చేసి, ఆ భాగము తీసివైచి, కాయలోపలి గుజ్జు కొంత తీసి ఆ ఖాళీ ప్రదేశములో వారి వెంట నున్న బెల్లము వేసి, మూడు రాళ్ల పొయ్యి చేసి పొయ్యి మీద గుమ్మడికాయ పెట్టి మంట చేసి బాగా ఉడకబెట్టారు. ఆ వేడికి అది బాగా ఉడికి హల్వా మాదిరిగా తయారైనది. ఆ పదార్థము తిని కొంతసేపు విశ్రమించారు. ఆ స్థలము పేరు జిల్లెళ్ళమూడి” అని అమ్మ చెప్పిన సంగతి.
ఆ పొయ్యి పెట్టిన స్థలము, అన్నపూర్ణాలయ వంట ఇల్లు ఏమో! వారు బాటసారులో సత్యాన్వేషణా మార్గగాములో ఏమో! పరాత్పరి అవతరించు అవసరాన తగు ఏర్పాట్లు చేయదిగి వచ్చిన చతుష్షష్టి కోటియోగినీ గణమువారో!
వనాల్లో మునులు కందమూలాల్ని భక్షించే వారు, నామమాత్రపు ఆహారాన్ని తీసుకుని నిరంతర జప తప వేద విహిత కర్మానుష్ఠాన తత్పరులై ఉండేవారు. కందమూలం అంటే – కంద దుంపకి తడి మట్టి పూత బెట్టి నిప్పు మీద కాల్చి, ఒలుచుకుని ఆ గుజ్జుని స్వీకరించడం.
కాగా ఆ సందర్భంలో ఏమున్నది? అనిపిస్తుంది. ఏమున్నదో – దాని పూర్వావరాలు – మనకి అగ్రాహ్యము. ఎంతో ముఖ్యమైన సంగతి కనుకనే అమ్మ వివరించింది అంతగా. వాస్తవానికి అన్నపూర్ణాలయం ఒక యాగశాల. అమ్మ సన్నిధిలో పిల్లులు, కుక్కలు, పాములు, పందికొక్కులు సంచరించేవి. అమ్మయే తెలియజెప్పింది మన మందబుద్ధులకు – అవి యోగంలో పరాకాష్ఠ స్థితికి చేరుకున్నవని – నిరాహారంగా కఠోర తపశ్చర్య నాచరిస్తున్నాయని దేవతారూపాలని ఒక్కోసారి ఒక్కో సందర్భంగా.
అనసూయాదేవి, అత్రి మహర్షి దంపతుల ఆశ్రమ వాతావరణాన్ని వర్ణిస్తూ కాళిదాస మహాకవి రఘు వంశంలో అన్నారు –
‘అనిగ్రహత్రాస వినీత సత్త్వం, అపుష్పలింగాత్ఫల బంధివృక్షమ్’ అని. వనాల్లో, తపోవనాల్లో మచ్చిక చేయనవసరం లేకుండానే జంతువులు సాధువర్తన కల్గియున్నాయని, పుష్పముల అవసరం లేకుండానే వృక్షములు స్వాదు ఫలభరితములౌతున్నాయని.
త్రిమూర్తులను పసిబిడ్డలుగా లాలించింది ఆ అనసూయామాత; త్రిగుణాల్ని త్రిమాతల్ని పసిబిడ్డలుగా పాలిస్తోంది మన అనసూయ మాత.
పరాత్పరి అమ్మ మహత్వానికి, మహత్సంకల్పానికి జేజేలు.