అర్కపురి,
1-6-66
బ్రహ్మాండం భవానీప్రసాద్
అన్నయ్యా,
నిజమేనయ్యా, సందేహాలు నివృత్తి చేసుకోవలసిందే. సందేహం కలగకూడదు. కలిగినతర్వాత లోపల దాచుకుంటే, అగ్నిలా కాల్చి వేస్తుంది కనుక వెంటనే చల్లార్చడం శ్రేయస్కరం.
ఇంతకూ నువ్వడిగేది : మీరందరూ అమ్మను యింతగా ఆరాధిస్తున్నారు సింహాసనంమీద కూర్చోబెడుతున్నారు. కిరీటం పెడుతున్నారు. పూజలుచేస్తున్నారు. అందులోనూ కుంకుమరాసులతో పాదపూజ చేస్తున్నారు. పాలతో పాదాలకు అభిషేకం చేస్తున్నారు. ఆమెపాదాలు శిరస్సున ధరిస్తున్నారు. ఆమెమాటను వేదవాక్కుగా పాటిస్తున్నారు. ఆమెను ప్రాణంకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నారు. మీరు యింత మహోన్నతంగా భావించడంలో మీ ఉద్దేశమేమిటి?– ఎంత ‘గొప్పవ్యక్తి’ అనుకున్నా మీరిలా ఆరాధించలేరు. భగవంతుడని మీ అభిప్రాయం. అసలు భగవంతుడంటే ఏమిటి? ఈ అమ్మ ఆ భగవంతుడని ఎట్లా? నేను యిట్లా అడుగుతున్నానని నువ్వు బాధపడుతున్నావా? పైగా.. నేనొక నా స్తికురాలినని అనుకుంటావేమో…
అన్నయ్యా నా ఉద్దేశం ప్రకారం యీ ప్రపంచంలో ఎవరూ నాస్తికులు కారు. ప్రతిజీవికీ తన జీవితంలో ఏదో ఒక సమయంలో భగవంతుని ఉనికి అనుభూతమయి తీరుతుంది. ఏదో ఒక అనంతమూ అదృశ్యమూ అయిన శక్తి తననూ, యీ జగత్తునూ నడిపిస్తున్నదని అర్థ మవుతుంది, అయితే దానికి పేరుఏదయినా పెట్టుకోవచ్చు. ‘శక్తి’ అను కోవచ్చు. దైవం అనుకోవచ్చు. మరొకటి అనుకోవచ్చు. ఏమనుకున్నా ఒకటే. వాదనకు తర్కానికి పైకి ఎట్లాఉన్నా ఆంతరంగికంగా అందరూ ఆస్తికులే.
ఆ మాటకు వస్తే-పై కులమునకునే వీరందరూ ఆస్తికులంటావా? నేను అనలేదు. ఆస్తికత్వం అంటే దేవుడున్నాడని నోటితో అనడమేనా? సర్వజ్ఞడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడూ అయిన భగవంతుని త్రికరణ శుద్ధి గా విశ్వసిస్తే – ఈ ప్రపంచం యిట్లా ఎందుకుంటుంది ? ఈ ద్వేషాలకూ, స్పర్థలకూ, యుద్ధాలకు, బీభత్సాలకు తావేక్కడ ఉంటుంది? మనంఎట్లా అసత్యమాడగలం? ఎవరిని మోసం చేయగలం! ఎట్లా అధర్మంగా ప్రవర్తించగలం… భగవంతుడు ఏమీ తెలీనివాడనా? భగవంతుడెక్కడో లో ఒక మూల కూర్చుని మనను చూడలేడనా? మనసు ఏమీ చేయలేని బలహీనుడనా? మరేమిటి? అంటే పరిపూర్ణమయిన, విశ్వాసం పేరు. ఎప్పుడో అవసరమయినప్పుడూ అపదలో నున్నప్పుడూ అడ్డుపడమని అరవడమూ, ఆదుకొనమని అర్థించడమూ వేరు.
ఇంతకూ అసలు విషయానికి వద్దాం. అమ్మ దైవమని ఎట్లా- అనికదా నీ సందేహం. అసలు దైవమంటే ఏమిటి? దైవలక్షణాలు ఏమిటి? భగవంతుని అవతారాలుగా మనం చెప్పుకుంటున్న వ్యక్తుల లక్షణాలు ఎట్లా ఉంటాయి? అవి అమ్మలో ఎంతవరకు మనం గుర్తిస్తున్నాం?—వీటికి సమాధానాలు రాబట్టుకుంటే నీ సందేహం సమసిపోతుంది.
అమ్మను కొందరు రాజరాజేశ్వరీ అవతారంగా విశ్వసిస్తున్నారు, కొందరు గాయత్రిగా ఉపాసిస్తున్నారు. కొందరు పార్వతిగా పూజిస్తున్నారు. కొందరు లలితగా భావిస్తున్నారు. కొందరు రాముడుగా, శ్రీకృష్ణుడు శివుడుగా,ఆంజనేయస్వామిగా, కుమారస్వామిగా, శాయిగా, మహమ్మదుగా, క్రీస్తుగా అనేక రూపాలు ఆరాధిస్తున్నారు. కవులు పండితులు భక్తులు, జ్ఞానులూ, సాధకులూ, విజ్ఞానపరిశోధకులు అందరు అమ్మలోని దివ్యత్వాన్ని గుర్తించి అర్చిస్తున్నారు.
వారి భావనలకూ, ఆరాధనలకూ వారివారి అనుభవాలూ, ‘విశ్వాసాలే కారణం అనుకో, అన్నయ్యా ! వారి అనుభవాలు మనవి కావు. వారి విశ్వాసాలు మనవి కానక్కరలేదు. అని మనసుకు -హృదయానికీ సంబంధించినవి. కనుక ఎవరి విశ్వాసాలు, అనుభవాలు వారివే కావచ్చు. కానీ, యింతమందికి యిన్ని అలౌకిక అనుభూతులూ, యిన్నిరకాల రూపదర్శనలూ ఒక సామాన్యవనిత అయితే ఎట్లా కలిగిస్తున్నది? ఈ జనసహస్రాలు ఒక మానవాంగన పాదాలమ్రోల ఎందుకిట్లా సాష్టాంగపడుతున్నయి? వారందరూ పిచ్చివారంటారా?
శాస్త్రముల ననుసరించీ, పురాణేతిహాసముల ననుసరించి ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు. పంచ భూతాలూ అతని ఆజ్ఞను శిరసావహిస్తయి. అతడు కాలాతీతుడు.
ఇక, అవతారవ్యక్తులు, వారి యిచ్ఛానుసారం జన్మిస్తారు. ‘వారు సామాన్యులవలె కష్టసుఖాలు అనుభవించవచ్చును కానీ, కర్మ బద్ధులు కారు. ఒక నిర్ణీత పధకం ప్రకారం బృహత్తర కార్యాలు నిర్వహిస్తారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తారు. ద్వంద్వాతీతులై స్థితప్రజ్ఞులై ఉంటారు. మానసిక దారుఢ్యతా, శరీర సౌష్టవతా కలిగిఉంటారు. ఆత్మజ్ఞానులై ఉంటారు.
వీనిలో కొన్ని లక్షణాలూ గుణాలూ సిద్ధ పురుషులకు కూడా ఉంటయి. మరి, వారికీ, అవతారములకూ తేడా ఏమిటి అంటే వారికి సాధనవల్లా, కృషివల్లా లభించినశక్తులు అవతారములకు జన్మతః కలుగుతాయి. పైగా అవతారవ్యక్తులు అన్ని వేళలా ప్రశాంతంగా ఉంటారు, భిన్నత్వం కార్యకారణములు వారికి అవగతమే కనుక వారు ప్రేమ మయులై సర్వులనూ సమానంగా ఆదరిస్తారు. కారణం వారికి తోచదుకనుక.
అవతారమూర్తులలో యింకా అనేక ప్రత్యేక లక్షణాలూ, విశిష్ట గుణాలూ ఉండవచ్చు. నీకు తెలుసుగా నా శాస్త్ర పరిచయం ఎంతటిదో – కాకపోతే, నీ వన్నట్లు 5, 6 సంవత్సరాలనుండీ యిక్కడనే ఉంటున్నాను. కనుక అదీ అమ్మ సన్నిధిలో ఉండే మహద్భాగ్యం అమ్మసన్నిధిలో కరుణామూర్తి అయిన అమ్మ యీ అల్పురాలికి లభింపజేసింది కనుక. అమ్మలోని అనేకమయిన విశిష్టలక్షణాలు గమనించే అవకాశం ప్రాప్తించింది.
వాటినిబట్టి సోదాహరణంగా అమ్మకూ అవతారాలకూ గల సారూప్యతను వివరిస్తాను. తర్వాత నిర్ణయం నీ యిష్టం.
నేనేమీ మా అమ్మ—యిట్లా అంటున్నానని కోపగించుకోకు. నీకూ అమ్మకాకపోలేదు, నా అభిప్రాయంలోనూ, అమ్మదృష్టిలోనూ, కానీ నీకూ ఆ భావం రావాలి కదా. నీకు ఆ భావం వస్తే నువ్వు అమ్మ దివ్యత్వం అంగీకరించినట్లే. మరి నాకూ నీకూ అమ్మ అయితే అందరకూ అయినట్లే, అందరకూ అమ్మ కాగలిగిన అమ్మ దైవం కాక సామాన్య స్త్రీ ఎట్లా అవుతుంది? ఇంతకూ నే న నే దేమిటంటే మా అమ్మ దైవమన్న మా విశ్వాసాన్ని మీమీద బలవంతంగా రుద్దటానికి నేనేమీ ప్రయత్నించను. అది నా ఉద్దేశం కూడా కాదు.
అదీగాక యిటువంటి ప్రయత్నానికి అమ్మ అంగీకరించదు. లోగడ అనేక సార్లు యిటువంటి చర్చలు వచ్చి, అమ్మ ఏ అవతారం అని తర్జన భర్జనలై అమ్మను అడిగితే
“ఎవరినయితే మీ కేమి? అమ్మను ‘అయితే చాలదా?” అని తేల్చివేసి నవ్వేసింది.
నేను కన్నంతలో, విన్నంతలో నా శక్తి కొద్దీ ప్రయత్నించి నీ ప్రశ్నకూ సందేహానికీ సమాధానం యిస్తాను. నీవుమాత్రం సందేహించక నీ సందేహాలు తెలుపుతూ ఉండు.
ఉంటానన్నయ్యా,
నీ చెల్లి,
భవాని..