“తీరు పట్టుదలకు మరో పేరు
వయసు పట్టనట్టి జోరు-కార్యదీక్ష ఇంకో పేరు
అప్యాయతకు మారు పేరు అదే అసలు తీరు”
అమ్మ అనుంగు బిడ్డలు ఒకొక్కరుగా అమ్మ ఒడి చేరుతున్నారు. బహుశా అమ్మ శతజయంత్యుత్సవం ఏర్పాట్ల కోసం తరలి వెళుతున్నారేమో..
అలా 21-04-2021న శ్రీ భట్టిప్రోలు చలపతిరావు గారు అమ్మ దగ్గరికి తరలి వెళ్ళారు.
ఒక నిండు జీవితం గడిపి అన్ని రకాల విజయాలు. చవి చూసి, తన చిత్రానికి అన్ని సొబగులు అద్దిన తదనంతరం తృప్తిగా తన చేతిలోని కుంచెను వదిలేశారు.. డ్రాయింగ్ మాష్టారు కదా! ఎక్కడ ముగించాలో తెలుసు. ఒక ఉపాధ్యాయుడుగా తన జీవితాన్ని సఫలీకృతం చేసుకున్నారు. ఆయన అవటానికి డ్రాయింగ్ మాస్టరే కాని విద్యాబోధనలో ఎన్నో కొత్త పద్ధతులు. మీద ఎంతో అవగాహన ఉండేది. వాటిలో ఒకటి సహకార విద్యాబోధన.
అంటే విద్యార్థులను ఎప్పుడూ విద్యనభ్యసించే వారిగానే ఉంచకూడదు. వారు నేర్చుకున్నదానిని వారు ఇతరులకు బోధించే అవకాశం కూడా ఇవ్వాలి. అప్పుడే వారు నేర్చుకున్న విద్య స్థిరపడుతుంది.
దీనికోసం ఆయన తోటి ఉపాధ్యాయులతో వాదనకు దిగుతుండేవారు. వారు ఈయన విధానానికి . తగు మద్దతు పలకక పోతే వారే స్వయంగా “ప్రయివేటు” రూపంలో విద్యార్థులను పోగేసి ఈ విధానం అవలంబించారు. వారి ప్రయివేటులో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులు ఉండే వారు. దానిలో 6వ తరగతి వారికి ఆ తరగతిలో తెలివిగల విద్యార్థులు, ఆపై తరగతి విద్యార్థులు బోధించేవారు.
ఇదే విధానం మిగతా 7, 8, 9వ తరగతి విద్యార్థులు పాటించేవారు. 10తరగతి విద్యార్థులకు వారి తరగతిలోని తెలివిగల విద్యార్థులు బోధించేవారు. వారెవరికీ తెలియని విషయమైతేనే చలపతిరావు గారు బోధనకు పూనుకునే వారు. ఈ విధానం ఆయనను ఎంతో విజయవంతమైన ఉపాధ్యాయుని చేసింది. బోధించే పిల్లలకు ఆ సబ్జెక్ట్ లో పట్టు పెరిగేది. ఆత్మవిశ్వాసం పెరిగేది. చెప్పించుకునే పిల్లలు తోటివారి దగ్గరే నేర్చుకుంటారు. కనుక మొహమాటం లేకుండా తెలుసుకుంటారు. ఈ విధానం అమ్మ చెప్పింది అనేవారు.
ఏదో సందర్భంలో అమ్మ చెప్పిందట తెలిసిన వారు తెలియనివారికి చెప్పాలి” అని. అమ్మ ఏం చెబితే అది తు.చ. తప్పకుండా ఆచరించే చలపతిరావు గారు తన వృత్తి జీవితంలో అమలు పరచి అఖండ విజయం సాధించారు.
మరో విషయం ప్రస్తావిస్తాను. గమనించండి. అమ్మ మీద చలపతిరావు గారి గురి తెలుస్తుంది. వారు ఒకసారి తను వ్రాసిన ఒక నాటకం అమ్మకు వినిపించి దానికి పేరు పెట్టమన్నారు. అమ్మ తనకు సహజమైన చాతుర్యంతో “ఏదో ఒకటి పెట్టు నాన్నా!” అన్నది. ఆ మాటే వేదవాక్యంగా చలపతిరావు గారు ఆయన నాటకానికి “ఏదో ఒకటి” అని పేరు పెట్టుకున్నారు. ఆ రోజుల్లో మేమంతా షేక్స్పియర్ “యాజ్ యు లైకిట్ “నాటకాన్ని గుర్తుకు తెచ్చుకున్నాం. చివరికి “సృష్టి అంతా ఏదోఒకటి నుంచే వచ్చింది”అన్న అమ్మ తత్వానికి దర్పణంగా ఆ నాటాకాన్ని మలిచారు. అమ్మ మాటమీద అంత గురి మరి.
అప్పికట్లకు జిల్లెళ్ళమూడికి మధ్య ఏర్పడిన పసిడి వంతెన మీద నడవగలిగిన భాగ్యశాలువలో చలపతిరావు గారు ఒకరు. మిగతా భాగ్యశాలుర గురించి చెప్పనక్కరలేదు.
కొండముది రామకృష్ణ అన్నయ్య, గోపాలన్నయ్య, దత్తాత్రేయ శర్మ అన్నయ్య, హనుమంతరావు అన్నయ్య. పన్నాల రాధాకృష్ణశర్మ అన్నయ్య, డాక్టర్ చక్రి అన్నయ్య, నబీ అన్నయ్య, అదం అన్నయ్యలే వారు.
చలపతిరావుగారు డ్రాయింగ్ మాష్టారు కనుక అమ్మ ఫొటోలు బహుళ ప్రచారంలో లేనప్పుడే అమ్మ చిత్ర పటాన్ని చిత్రీకరించి అప్పికట్లలో వారి ఇంట్లో ప్రముఖంగా ఏర్పాటు చేసిన విషయం నాకింకా గుర్తు.
అలాగే కళాకారుడు అవటంతోనో ఏమో సంగీతం అంటే ఇష్టపడే వారు. వారి పెద్దమ్మాయి శ్రీమతి దుర్గమ్మ గారికీ సంగీతం నేర్పించారు. అదీ రాజుబావ వ్రాసిన అమ్మ పాటలు ఇష్టంగా నేర్పించారు. అమ్మ స్వర్ణోత్సవం అప్పుడు ఎన్నో బానర్స్ చిత్రీకరించి ప్రదర్శించారు. ఇలా అమ్మతో తన జీవితాన్ని పడుగు పేకలా పెనవేసుకున్నారు. తన వృత్తి జీవితంలో విశ్రాంతి తీసుకున్న తరువాత జిల్లెళ్ళమూడి చేరి అమ్మ సంస్థల సేవలో అవిశ్రాంతంగా గడిపారు. అన్నపూర్ణాలయంకు స్వయంపోషకత్వం కలిగించాలని కూరగాయల పెంపకానికి ఆయన చేసిన అవిరళ కృషి చిరస్మరణీయం.
దేవాలయాలకు కావాల్సిన కొబ్బరికాయల దిగుబడి సంస్థ స్థలాలలో తీసుకురావాలని అవిశ్రాంత కృషి చేశారు. ఈ కృషి అంతా ఒక రిపోర్ట్ రూపంలో ఇవ్వాలని అమ్మ దగ్గరకు వెళ్లారేమో. వారు అమ్మకు చేసిన సేవ మరొకటి.
తన కొడుకు రామచంద్రగారిని తన కోడలు సుగుణ గారిని అమ్మ సేవకు అంకితం చేశారు. ప్రాధాన్యతా క్రమంలో చివరగా కాకుండా వ్యాసంలో చివరగా ఒక మాట. మా చలపతిమామయ్య మా నాన్నతో పెనవేసుకున్న బంధం ఏ మాటలకూ అందనిది. అమ్మ రామకృష్ణ అన్నయ్యకు బహిఃప్రాణం అయితే రామకృష్ణ అన్నయ్య చలపతిరావు గారికి బహిఃప్రాణం. రామకృష్ణ అన్నయ్యకు గడ్డిపోచ తగిలినా చలపతిరావు గారికి గడ్డపలుగు గుచ్చుకున్నట్లు ఉండేది. మా నాన్నకు అమ్మ ఇచ్చిన మాట “నువ్వు సంస్థను చూడు. నీ ఇంటి బాధ్యత నాది.” ఆ బాధ్యతా నిర్వహణలో అమ్మ కు ఉపకరణంగా అప్పికట్ల లో ఉపయోగపడినవారు చలపతిరావు గారు. ఈ మాట వారు పదే పదే గుర్తు చేసుకునే వారు. అందుకే ఆయన రామకృష్ణ అన్నయ్య కు పెట్టని కోటలా ఉండే వారేమో.
మా అమ్మకు అన్నయ్యగా మాకు మేనమామగా ఆయన చూపించిన ఆదరణ మరువలేనిది. ఆయన మామీదే కాదు, అందరినీ ఆప్యాయతతో అదరించే వారు. అసలు ఆయన అప్యాయతకు మారు పేరు.
మరో విశేషంకూడా ఉంది. రామకృష్ణఅన్నయ్య అందరికీ అన్న అయితే, చలపతిరావుగారు అందరికీ చలపతిమామయ్యే. మాతోపాటు మా బావలు కూడా ఆయనను చలపతిమామయ్యా అనే పిలిచే వారు. కానీ అందరినీ అన్నివేళలా ఆనందపరచిన ఆయన మా సుశీల అత్తయ్యను బిడ్డలను అనంత దుఃఖసాగరంలో ముంచి వెళ్లారు. ఆమెకు ఓదార్పు అమ్మ ఒక్కతే ఇవ్వగలదు. అమ్మ కు మనం చెప్పవలసిన అవసరం ఉందా?
జయహోమాతా