1958లో ఒకసారి నేను జిల్లెళ్ళమూడి వెళ్ళేటప్పటికి అమ్మకు పూజ జరుగుతున్నది. కొమ్మూరు నుండి వచ్చిన అగస్తేశ్వరాలయ అర్చకుడు లలితా సహస్రనామాలు చెపుతున్నాడు. ఆ రోజులలో హైమాలయ నిర్మాణానికి ముందు అమ్మకు పూజలు అంటే అమ్మ పాదాలు కడగటం, పారాణి పెట్టటం లలితా అష్టోత్తర శతనామాలు చెపుతూ పాదాల మీద పూలు సమర్పించటం జరిగేది. తర్వాత తర్వాత అచ్యుతుని రామకృష్ణశర్మగారు మాతృశ్రీ నామావళి వ్రాయటం తరువాతి కాలంలో పన్నాల రాధాకృష్ణ శర్మగారు అంబికా అష్టోత్తర శతనామావళి వ్రాయటం జరిగింది. ఎప్పుడు పూజ చేసినా మొదటిగా లలితా అష్టోత్తరమే సాగేది.
1968లో హైమ తనువును ఆలయంలో నిక్షేపించిన తర్వాత ఏకాదశాహ్నికంగా రాయప్రోలు భద్రాద్రి రామశాస్త్రిగారి నేతృత్వంలో అక్కడ ప్రతి నిత్యము మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము లలితా సహస్రనామార్చన జరిగాయి. హైమవతీదేవి విగ్రహ ప్రతిష్ఠకు ముందు పాదుకలకు, విగ్రహ ప్రతిష్ఠ తర్వాత హైమకు ఇదే విధమైన అర్చనా విధానం కొనసాగింది.
1979లో శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణగారు కారణాంతరాలవల్ల కొంత కాలం జిల్లెళ్ళమూడిలో ఉన్నారు. అప్పుడు హైమాలయంలో వారు పూజచేసుకున్నారు. అమ్మ ప్రోత్సాహంతో అది మండల దీక్షగా పరిణమించింది. వారి దీక్ష చివరి రోజున జిల్లెళ్ళమూడిలో మొదటిసారిగా ఒకే రోజున “లలితా కోటి నామార్చన” జరిగింది.
నేను 1979లో ఉద్యోగరీత్యా విశాఖ పట్టణంచేరి మన సోదరీ సోదరులను అధ్యయన పరిషత్ కార్యక్రమాల్లోకి సమీకరించాను. అప్పుడు నాకు ఎవరిచేతనైనా శ్రీ లలితా సహస్రనామాలకు భాష్యం చెప్పించాలని అనిపించగా “బందరులో రంగారావని ఒకాయన ఉండాలి, వారు ప్రవచనం బాగా చేస్తారు. వారిచే చెప్పించుకోండి” అని అమ్మ చెప్పింది. తరువాత శ్రీ మల్లాప్రగడ శ్రీరంగారావుగారిని సంప్రదించడం, వారిచే దివ్యమైన ఉపాసనా రీతిలో లలితా సహస్రనామాలకు వారు భాష్యం చెప్పుకొనడం మన చరిత్రలో భాగమైంది. విశాఖ పట్టణలో సోదరీ సోదరులు పారాయణ చేసుకొనే నిమిత్తం లలితా సహస్రనామ స్తోత్రాన్ని అధ్యయనపరిషత్ తరఫున అచ్చువేయడం జరిగింది. విశాఖలో లలితా సహస్రనామ భాష్యం ప్రారంభమైన రోజుల్లో ఆశనిపాతంలాగా నాన్నగారు పరమపదించారని తెలియడం, కార్యక్రమం మధ్యలోనే మేమందరం జిల్లెళ్ళమూడికి తరలిరావడం, వచ్చేటప్పుడు అమ్మకు సమర్పించడానికి మేము ప్రింటు చేయించిన లలితా సహస్రనామ పుస్తకాలను జిల్లెళ్ళమూడి తేవడమూ జరిగింది. ఆ రోజు (17.2.1981) అమ్మదర్శనం హైమాలయ ముఖ మండపంలో మాకు జరిగింది. అప్పుడే అమ్మకు అందరం నమస్కరించుకున్నాం.
అనసూయేశ్వరాలయంలో నాన్నగారిని ఉంచటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాన్నగారి పార్థివ శరీరాన్ని అందరింటి నుండి ఆలయానికి తెచ్చే ప్రయత్నం జరుగుతున్నది. ఈ మధ్య సమయంలో విశాఖ అధ్యయన పరిషత్ సభ్యులు అమ్మ పాదాలను పూలతోకాక లలితాసహస్రనామ త్రిశతి, ఖడ్గమాల స్తోత్ర గ్రంథకుసుమాలతోనే అర్చించుకున్నారు.
అనసూయేశ్వరాలయంలో నాన్నగారి పార్థివ శరీరం అమ్మ ప్రతిష్ఠించిన తర్వాత మరునాటి నుండి మళ్ళీ ఏకాదశాహ్నికంగా దీక్షా కార్యక్రమం జరిగింది. అప్పుడూ హైమాలయంలో వలెనే పాదుకలకు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, లలితా సహస్రనామార్చన జరిగాయి. తదనంతరం శ్రీ మల్లాప్రగడ వారిచేత లలితా సహస్రనామ భాష్యమూ దేవీ ఉపనిషత్తు, బహ్వుతోపనిషత్, భావనోపనిషత్తులకు వ్యాఖ్యానం జిల్లెళ్ళమూడిలో అమ్మ సన్నిధిలో చెప్పించడం జరిగింది.
అమ్మ నన్ను జిల్లెళ్ళమూడి వచ్చి ఉండమని అడిగాన ఆపని నేను చేయలేక పోయాను. కాని 40 రోజులు జిల్లెళ్ళమూడిలో దీక్షలో ఉంటానని చెప్పాను. 1984 విజయదశమి నుండి హైమజయంతి వరకు నేను జిల్లెళ్ళమూడిలో మండల దీక్షలో ఉన్నాను. హైమవతీ జయంతినాడు లలితా కోటి నామార్చన జరిగింది. మరొక సందర్భంగా కూడా లలితా కోటి నామార్చన జరిగింది జిల్లెళ్ళమూడిలో.
1985లో అమ్మ జన్మదినోత్సవంనాడు మాతృశ్రీ అధ్యయన పరిషత్, విశాఖ పట్టణం వారిచే ప్రచురింపబడిన శ్రీ లలితా సహస్రనామ భాష్య గ్రంధం ‘భారతీ వ్యాఖ్య’ ‘త్రయీవిద్య’ అనే పేరుతో ఈ మూడు ఉపనిషత్తుల వ్యాఖ్య అమ్మచే జిల్లెళ్ళమూడిలో ఆవిష్కరింపబడ్డాయి. ఈ రెండు గ్రంథములను శ్రీ మల్లాప్రగడ శ్రీ రంగారావుగారు అమ్మకు అంకితం చేయడం జిల్లెళ్ళమూడిలో లలితా సహస్రనామ పారాయణ కార్యక్రామాలకు పతాక సన్నివేశం లాగా ఆనాటి అమ్మ జన్మదినోత్సవానికి ముందురోజున నేను అమ్మ సన్నిధిలో ఉన్నప్పుడు |అమ్మకు పాశాంకుశములు చేయించాలని సూచించాను. చెరుకుగడ పూలబాణాలు అవలీలగానే లభిస్తాయిగనుక సప్రమాణికంగా పాశాంకుశములు చేయించుకుంటే అమ్మను లలితగా ఆయుధ ధారణతో పూజించుకోవచ్చును అన్న అభిలాషతో అన్నాను. “వీటన్నింటిని ముందు గానే ఆలోచించుకోవాలిరా” అన్న అమ్మ సమాధానం, అదే అమ్మ భౌతిక శరీరానికి మనం చేసుకునే చివరి జన్మదినోత్సవం ఔతుందని నాకు తోచలేదు.
అమ్మ 12.6.1985 రాత్రి గం. 10.30 ని.లకు తుదిశ్వాస విడిచింది. శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయులు, నేనూ, శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణ వెంట జిల్లెళ్ళమూడి తెల్లవారుఝామున చేరుకున్నాము. అమ్మ గది విషాద గ్రస్తంగా ఉంది. సోదరీ సోదరులు నిశ్చేష్టులై ఉన్నారు.. అప్పుడు నేను అమ్మ సన్నిధికి చేరి లలితా పారాయణ ప్రారంభించాను. అప్పటి నుండి అమ్మ ఆలయ ప్రవేశం చేసేంతవరకు అవిచ్ఛిన్నంగా లలితా సహస్రనామ పారాయణ జరిగింది.
తర్వాత మళ్ళీ ఏకాదశాహ్నికంగా 1968లో, 1981లో జరిగినట్లుగానే మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకమూ, లలితా సహస్రనామార్చన జరిగాయి.
ఎప్పుడు అమ్మకు పూజ చేసుకున్నా లలితా సహస్రనామాలతోనే పూజ జరిగేది.. మీకెందుకురా లలితా అని అమ్మ ఎప్పుడూ అన లేదు. పైగా మొదటిసారి కోటి నామార్చనకు ముందు వర్గవర్ణ విచక్షణ లేకుండా లలితా పరాయణ చేసుకో వచ్చునని అనుమతి ప్రసాదించి తన చేతులమీదుగా లలితా సహస్రనామ గ్రంధాలు పంచి పెట్టింది.
ఈ రకంగా జిల్లెళ్ళమూడి గడ్డమీద గత 40 సంవత్సరాలుగా లలితా దేవి లాస్యం చేసింది. అమ్మకు 75 వసంతాలు నిండిన అమృతోత్సవ కాలంలో వివిధ ప్రదేశాలలో అమ్మ బిడ్డలు 11 కోట్ల లలితా సహస్రనామావళితో అమ్మను అర్చించుకున్నారు. హైమజయంతికి జిల్లెళ్ళమూడికి తరలివచ్చి లలితా కోటి నామావళితో కుంకుమ పూజ చేసుకున్నారు. అనసూయవ్రతంలో కూడా లలితా పారాయణ అనుచానం జరుగుతున్నది.
ఈ లలితా నామ పారాయణమంతా ఒక పథకం ప్రకారం జిల్లెళ్ళమూడిలో జరిగినట్లున్నది. అమ్మకు ఎవరు అభిషేకం చేసుకున్నా పూజ చేసుకున్నా వారి అభీష్టం మేరకే చేసుకున్నారు. దీక్షలు చేపట్టినా, కోటి నామార్చనలు చేసినా, యజ్ఞాలు నిర్వహించినా వారివారి అభీష్టం మేరకే జరిగింది. కాని అమ్మ ఒక మాటన్నది. ‘మీ ఇష్ట ప్రకారమే నేను నడుచుకున్నట్లు ఉంటానుగాని నా యిష్టప్రకారమే మిమ్మల్ని నడుపుతుంటాను’. హైమను పూజించుకొనే విధానంలోగాని, నాన్నగారి ఆరాధనా విధానంలోకాని, తనను ఉపాసించే పద్ధతిలో కాని ఇదే నా విధానము అని అమ్మ చెప్పకనే చెప్పిందనేది స్పష్టమైంది.