ఆ కారుకు నాలుగు చక్రాలు. అందులో విచిత్రమేముంది? ఏ కారుకైనా నాలుగు చక్రాలే ఉంటాయి. కానీ ఈ చక్రాలు వేరు. ఈ కారు ఒక్కొక్క చక్రం ఒక్కొక్కరిది. అదేమిటండీ? అంటే అది అంతే. ఆ కథా కమామీషు ఏమిటంటే చీరాల డాక్టరు గారు పోట్లూరి సుబ్బారావు గారు, నేను, శానిటరీ ఇనస్పెక్టర్ వెంకయ్య గారు, గోరంట్ల హనుమంతరావు గారు – ఈ నలుగురం అమ్మ దగ్గరికి ప్రతివారం దర్శనార్థం వస్తూ ఉండే వాళ్ళం. చీరాల డాక్టర్ గారు జిల్లెళ్ళమూడి అమ్మ ఆస్థాన ఫోటో గ్రాఫర్ కూడా. ఆయన చీరాలనుండి వస్తూ ఫోటోగ్రఫీ కి సంబంధించిన బరువైన సామాన్లు రెండు సంచులనిండా తెచ్చేవారు. జిల్లెళ్ళమూడి 7 వమైలు రాయి నుండి ఏప్రయాణసౌకర్యం లేని రోజులలో ఆ సామాన్లు అన్నీ ఆయనే మోసుకొచ్చేవారు. ఆయన తప్పితే రావూరి ప్రసాద్, మన్నవ దత్తాత్రేయ శర్మ (దత్తు అన్నయ్య), కొన్ని సార్లు డాక్టర్ గారి కొడుకు పార్థు ఆయన సామాన్లు మోసుకొచ్చేవారు. నాకు కూడా లగేజ్ బాగానే ఉండేది. అమ్మ అన్న వితరణ ఎంత చేసిందో దానితో పాటు అమ్మ బిడ్డలందరికీ బట్టలు కూడా పెట్టి ఆశీర్వదించేది.
ఆ రోజులలో అమ్మచేతి గోరుముద్దలు తిన్న వారు, అమ్మచేత బట్టలు పెట్టించుకున్న వారు ధన్యులు. వాటితోపాటు అమ్మ కట్టుకునే వస్త్రాలు అవీ చీరాల, మద్రాస్ నుండి తెచ్చే బాధ్యత ఎక్కువగా అమ్మ నా భుజస్కంధాలపై పెట్టింది. నేనూ జిల్లెళ్ళమూడికి ప్రయాణ సౌకర్యాలు లేనప్పుడు 7 వ మైలునుండి సామాన్లు, బట్టలు మోసుకుంటూ వచ్చేవాడిని. వెంకయ్య గారు శానిటరీ ఇనస్పెక్టర్ గా చీరాలలో పనిచేస్తూ ఉండేవారు. ఉద్యోగ బాధ్యతలతో ఎప్పుడంటే అప్పుడు ఆఫీసుకు వెళ్ళవలసి వచ్చేది. హనుమంతరావు గారు తిమ్మసముద్రంలో పెద్ద భూస్వామి, వ్యాపారవేత్త. ఆయన కూడా పనుల ఒత్తిడి తో ఎప్పుడంటే అప్పుడు ప్రయాణాలు చెయ్యవలసి వచ్చేది.
కానీ మేమందరం అమ్మను చూడటానికి ప్రతివారం తప్పనిసరిగా జిల్లెళ్ళమూడి రావలసిన వాళ్ళమే. కొన్ని థాబ్దాలు బాపట్ల నుండి వ్యాన్ సౌకర్యం ఏర్పాటు చేయబడింది. రామకృష్ణారావు అన్నయ్య గారు ఒక వ్యాన్ కొని రిపేర్లు చేయించి బాపట్ల జిల్లెళ్ళమూడి నడిపించారు. వెంకటేశ్వర్లు అనే ఆయన డ్రైవర్. అదో పుష్పక విమానం. ఎంతమంది ఎక్కినా ఇంకొళ్ళకు చోటు ఉండేది. బాపట్ల బస్టాండ్‌లో దిగి అక్కడి నుంచి సామాన్లు మోసుకుంటూ మాతృశ్రీ ప్రింటర్స్ దగ్గర ఆగి ఉన్న వ్యాన్‌లో అమ్మ భక్తులు జిల్లెళ్ళమూడి చేరేవారు. ఆ వ్యాన్ లో అమ్మ కబుర్లు ఎన్నో చెప్పుకునే వాళ్ళం. బాపట్ల నుంచే జిల్లెళ్ళమూడి వాతావరణం పరిమళించేది. అలా కొంతకాలం ఈ నలుగురం వ్యాన్ ప్రయాణం చేసి జిల్లెళ్ళమూడి వచ్చేవాళ్ళం.. ఇలా కాదు అనుకొని నలుగురు కలిసి ఒక కారు కొందామని అది జిల్లెళ్ళమూడి ప్రయాణానికే ఉపయోగిద్దామని నిర్ణయం తీసుకొని ఒక అంబాసిడర్ కారు కొన్నాము. ఆ కారుకి అలా మా నలుగురివి నాలుగు చక్రాలు. ప్రతి శనివారమో, ఆదివారమో చీరాలలో సామాన్లతో సహా బయలుదేరి జిల్లెళ్ళమూడి చేరేవాళ్ళం.. ప్రయాణ సౌకర్యం ఉంది కాబట్టి ఎంతరాత్రైనా అమ్మ చెప్పే ఆధ్యాత్మిక విషయాలు విని చీరాల చేరేవాళ్ళం. కారు డ్రైవర్ సామాన్లు, పెట్రోల్ గోల్ మాల్ చేస్తున్నాడని గమనించి చీరాల డాక్టరు గారే డ్రైవింగ్ చేసేవాళ్ళు. ఆయనకు రాని విద్యలేదు. కారు రిపేర్ కూడా చేసేవారు.
ఒకరోజు జిల్లెళ్ళమూడిలో అమ్మ దగ్గర చాలా విషయాలు మాట్లాడుతూ, అమ్మను విడిచి వెళ్ళలేక చివరికి తప్పదు కాబట్టి చీరాల బయలుదేరాము. అమ్మ హెచ్చరిస్తూనే ఉంది -చాలా ఆలశ్యమయింది, బయలు దేరండి అని. కారు ఉందిలే అన్న భరోసాతో లేట్ గా భోజనం చేసి జిల్లెళ్ళమూడి నుండి బయలుదేరాం. డాక్టర్ గారి డ్రైవింగ్ విచిత్రంగా ఉండేది. మనిషే బాగా ఒడ్డూ పొడుగూ. చొక్కా విప్పి బనీన్ తో డ్రైవింగ్ చేయటం ఆయన అలవాటు. అలాగే బయలుదేరారు. స్టువార్ట్ పురం వెళ్ళే సరికి అర్థరాత్రి అయింది. ఆ ప్రాంతం దొంగలకి, దొంగతనాలకి ప్రసిద్ధి ఆరోజులలో. పొలీస్ పెట్రోలింగ్ పెట్టారు. ఈ కారు చూసేసరికి పోలీసులకి అనుమానం వచ్చి వెంబడించారు. ఒక వస్తాదులాంటి మనిషి డ్రైవింగ్ చేస్తున్నట్లు ఉన్నాడు. వెంబడే ముగ్గురు ఆగంతకులు ఉన్నారు. దొంగలే అనుకొని పోలీసులు వెంబడిపడ్డారు. కారు ముందుకొచ్చి కారుని ఆపారు. మేము చీరాల వెళుతున్నాము. దొంగలంకాదు అని డాక్టర్ గారు ఎంత చెప్పినా వినలేదు. చివరికి నేను, హనుమంతరావు గారు, శానిటరీ ఇనస్పెక్టర్ వెంకయ్య గారు కారుదిగి మేము జిల్లెళ్ళమూడి అమ్మ భక్తులం, డ్రైవింగ్ చేసే ఆయన చీరాలలో డాక్టరు గారు అని ఐడెంటిటీ చెప్పి, అమ్మ సంగతులు విన్న తర్వాత కారు పోనిచ్చారు. అమ్మ చెప్పినప్పుడు బయలుదేరకుండా లేట్ చేసినందుకు బాగా బుద్ధి చెప్పిందని అనుకుంటూ, అమ్మ పేరు చెప్పి బతుకు జీవుడా అని బయటపడ్డామని తర్వాత నవ్వుకొని, అమ్మకి మనసారా నమస్కరించుకున్నాం. తర్వాత రోజులలో కొన్ని సంవత్సరాలు కారుని జిల్లెళ్ళమూడి ప్రయాణానికి వినియోగించుకొని చివరికి దాన్ని అమ్మకే ఇచ్చేశాము. కొన్ని రోజులు అమ్మ దాన్ని వాడుకుంది. తర్వాత దాన్ని అమ్మేసి రీబిజిలి చీజీళిబీలిలిఖిరీ అమ్మ సంస్థకే ఇచ్చేశాము. ఇదీ నాలుగు చక్రాల కథ. రచన.