“అమ్మ దివ్యసిద్దాంత తత్త్వ మహాలయ ప్రాకారానికి మూల స్వరూపంగా భాసిల్లి ఆ అన్నపూర్ణేశ్వరి ఆశయాభిలాషలకు ఊపిరిగా వర్ధిల్లి, జగజ్జనని తన బిడ్డల క్షేమానికై సంకల్పించిన విద్యా, వైద్య, ప్రయాణాది సమస్త రూపశాఖలకు పట్టుగొమ్మగా, ఆటపట్టుగా, జీవధారగా భాసించి, అమ్మ దర్శనార్ధమైవచ్చు అశేష జనసందోహ నివాసవిలసితమైన “అందరిల్లు”కు ఆయువుపట్టుగా, నిర్మాణ విరాట్టుగా కృషి సల్పిన పెద్ద అన్న అధరాపురపు శేషగిరిరావు అన్నయ్య.
పొన్నూరులో మధ్వ బ్రాహ్మణ కుటుంబంలో అధరాపురపు కృష్ణారావు ప్రయాగమ్మల పూజాఫలంగా 23.5.1912న జన్మించిన శేషగిరిరావుగారు విద్యా వినయ వివేక సంపన్నులై చిన్నతనం నుండీ అందరికీ తలలోని నాల్కగా ఉండేవారు.
ఏ విశ్వవిద్యాలయాల్లోనూ పట్టా పుచ్చుకోక పోయినా జీవితం నేర్పిన పాఠాలవల్ల, సత్న్సేహ సంపత్తి వల్ల సద్ధంధ పరిచయం వల్ల సంస్కారవంతుడుగా తీర్చిదిద్దబడి చిన్నతనంలోనే మాతృదేశ దాస్యవిముక్తికై స్వాతంత్య్ర సమరరంగం లోకి దూకి శ్రీ కృష్ణ జన్మస్థానాన్ని దర్శించారు. పదవుల కోసం ప్రాకులాడక ప్రజాహిత జీవనంలో తన ఆస్తిపాస్తులు కర్పూరంలా కరిగించిన త్యాగమయ జీవి. పొన్నూరు పంచాయతీబోర్డ్ అధ్యక్షుడుగా ఉన్నా, మరి ఏ ఇతర పదవులు చేపట్టినా, అవి పదవులుగా కాక, బాధ్యతలుగా స్వీకరించి ప్రజాసేవ ప్రధాన లక్ష్యంగా వ్యవహరించారు. ఎల్లప్పుడూ పదిమంది మధ్య చిరునవ్వుతో ఖద్దరు దుస్తులను ధరించిన ఆ స్వచ్ఛమైన విగ్రహం అందరినీ ఆకర్షించేది. రాజకీయ ప్రత్యర్థులు కూడా ఈయనలోని నిజాయితీని, స్వార్థ త్యాగాన్ని హర్షించేవారు, సాహసాన్ని, ధైర్యాన్ని ప్రశంసించేవారు. స్వాతంత్య్ర సమరయోధునిగా తనకిచ్చిన 5 ఎకరాల భూమిని అమ్మ సంస్థ అభివృద్ధికి సమర్పించారు.
1959వ సంవత్సరంలో ఆయన జీవితం రాజకీయాల నుండి మరో మలుపు తరిగింది. జిల్లెళ్ళమూడి అమ్మను దర్శించటం, ఆ పవిత్ర మాతృమూర్తి పాదపద్మాల దర్శన స్పర్శనం ఆయనలో ఒక వినూత్న సుప్తదీప్తిని జాగృతం చేసింది. మాతృత్వపు మమకారపు రుచులు చవిచూసిన ఆయన హృదయం నిరంతరం ఆ దివ్యత్వంలోని అమృతం సేవించాలనే ఆరాటంలో మునిగిపోయింది. అందువల్ల ఆయన వంటి కర్తవ్య పరాయణులు అమ్మ వద్ద అందరింటి బాధ్యతలు స్వీకరించి, అక్కడే ఉండవలసి వచ్చింది. నిరంతర కార్యశీలి అయిన శ్రీ శేషగిరిరావుగారు జిల్లెళ్ళమూడిలో నేడు కనిపిస్తున్న ప్రతిపనికి పునాది వంటివారు. ఆయన అగ్రేసరతలో అక్కడ పని రూపుదిద్దుకున్నది.
అధరాపురపు శేషగిరిరావు గారు జిల్లెళ్ళమూడి అందరింటి వాస్తుశిల్పి అంటే ఆశ్చర్యం లేదు. వారు సంస్థ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్న రోజులలోనే ఇప్పుడున్న అందరిల్లు. అన్నపూర్ణాలయం నిర్మాణం జరిగాయి. వారి అవిరళకృషి వల్లనే సంస్కృత పాఠశాల, కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. వారెప్పుడూ అర్థరాత్రి జిల్లెళ్ళమూడి వచ్చేవారు. ఒకరోజు జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మ నిద్రిస్తుండంతో నమస్కారం చేసుకొని వెళ్ళిపోయారు నిద్రపోవడానికి.
శ్రీ శేషగిరిరావుగారు జిల్లెళ్ళమూడి వచ్చిన క్రొత్తలోనే నాన్నగారి వద్దకు పోయి అమ్మను వదిలి ఉండలేని తన స్థితిని వివరించి తనను నాన్నగారి రెండవ కుమారుడైన రవి తర్వాత బిడ్డగా స్వీకరించమని అర్ధించాడు. సంస్థ అభివృద్ధికై ఆయన ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసుకొని అమలు పరచడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నమే. ఆయన తపస్సు. ఆ పనిలో అన్నం, నీరు పట్టేవి కాదు, ఎండ, వాన లెక్కచేసేవారు కాదు. అర్ధరాత్రి ప్రయాణం చేస్తున్నా ఏదో ఒక మహత్తర జ్యోతి ఆయనకు ముందు దారి చూపిస్తూ తీసుకొని పోయేది. ధ్యాసే ధ్యానం అన్న అమ్మ మాట ఆధారంగా సర్వవేళలా అమ్మ ధ్యాసలోనే ఉండేవారు. పొంగు క్రుంగులు ఆయనలో లేవని నేననను. కాని అమ్మ ఓదార్పు లాలనలు ఆయనకు శాంతిని ప్రసాదించేవి. అయితే, చేపట్టిన పని పూర్తయ్యేవరకు విశ్రమించేవారు కాదు.
అమ్మపై ఆయన ఆరాధన భావం అచంచల మయినది. ఆయన విశ్వాసం చెక్కుచెదరనిది. ఎన్ని ఆటుపోటులు వచ్చినా ఎన్ని బాధలు కల్గినా ఆఖరికి తన ఆరాధ్య దైవమే తనను పరీక్షలకు లోను చేసినా ఆ విశ్వాసం నుంచి కించిత్తు కూడా చలించలేదు.
అమ్మ ఆజ్ఞ అయితే అది కొండ మీద కోతినయినా తేవలసిందే. ఆ స్వామి భక్తి పరాయణత అటువంటిది. ఆ ప్రయాసలో శరీరము మనస్సు స్వస్థత తప్పినా లెక్కించేవారు కాదు. రామునకు ఆంజనేయునిలా, అమ్మకు శేషగిరిరావు అన్నయ్య ఉండేవారు. ఆయన నమ్మకానికి తగ్గట్టే అమ్మ కూడా ఆయనకు ఎన్నో అనుభవాలను ప్రసాదించింది.
కారణాలేవైనా శేషగిరిరావన్నయ్య పద్మనాభరావు (బాబురావు) గారింట్లో ఉండగా 26.12.1970లో అమ్మ చింతనలో ఉంటూ అమ్మలో లీనమైనారు. అందరిల్లే ఆయనకు ఆధారమైంది. అమ్మే ఆరాధ్యమైంది. అమ్మే సర్వస్వమైంది. సర్వసంగపరిత్యాగిని చేసింది. ముక్తిని ప్రసాదించింది.
‘నేటి జిల్లెళ్ళమూడి రోడ్డు నిర్మాణంలో వారి స్వేదధార ఉన్నది. జిల్లెళ్ళమూడిలోని విద్యుద్దీప కాంతిలో వారి విజ్ఞాన రోచిస్సు ఉన్నది. దినదినాభివృద్ధి నొందే అన్నపూర్ణాలయపు గాడిపొయ్యి మంటలో విశ్వశ్రేయస్సుకై వారి వేదనా జ్వాల ఉన్నది. సముచితమై సర్వజనాశ్రయమై తనరారే భవనద్వయ సౌందర్యంలో వారి మందస్మితం ఉన్నది. మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీ పునాది రాతిలో వారి సర్వస్వం ఉన్నది” అని వారి తర్వాత సంస్థ బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణ అన్నయ్య వ్రాసిన వ్రాతలు అక్షరాల నిజాలు.
అమ్మకు అత్యంత ప్రియతమ పుత్రుడయిన శ్రీ శేషగిరిరావు అన్నయ్య జిల్లెళ్ళమూడిలోని ప్రతి అణువణువులోనూ ప్రత్యక్షమౌతారు. ఆయన చిరంజీవి. ఆయన వేసిన బాటలు మనకు ఎల్లప్పుడూ మార్గదర్శకత్వం నెరపుతుంటవి.