- కర్మసిద్ధాంతం:
‘శుభకృత్ శుభమాప్నోతి, పాపకృత్ పాపమశ్నుతే’ అంటే సత్కర్మలు చేస్తే పుణ్యం, దుష్కర్మలు చేస్తే పాపం పొందుతాం. తత్ కర్మ ఫలానుభవం కోసం జన్మప్రాప్తి. కర్మ ఫలం నశిస్తే మోక్షం. జన్మలెత్తినపుడు ‘బుద్ధిః కర్మానుసారిణీ’ అన్నట్లు కర్మఫలాన్ననుసరించి బుద్ధి నడిపిస్తుంది. అవశ్య మనుభోక్తవ్యం కృత కర్మ శుభాశుభం. పుణ్య, పాప కర్మ ఏదైనా సరే – తత్ఫలాన్ని అనుభవించి తీరాల్సిందే – అంటూ సంక్షిప్తంగా కర్మ సిద్ధాంతాన్ని వివరించవచ్చు.
- సో॥శ్రీ విఠాల రామచంద్రమూర్తిగారితో ప్రసంగవశాన అమ్మ అన్నది – “అది (కర్మసిద్ధాంతం) ఎవరు చేసుకున్నది వారు అనుభవిస్తారని మనకి చెప్పటం కోసం చెప్పటం.
మీరనుకునే (కర్మ) సిద్ధాంత ప్రకారం – ఏ రకమైన కర్మ చేస్తే రాముల వారు పుట్టి ఉంటారు? ఏ రకమైన దుష్కర్మ చేస్తే అడవికి పోయి ఉంటారు? ఏ రకమైన ఘనకార్యం చేస్తే రాములవారు పుట్టారు? ఏ రకమైన లోపం ఉంటే కైకకు అటువంటి మనస్సు, మందరకి అటువంటి ఆలోచన వచ్చింది? దానికి కూడా కారణం ఉండాలి కదా!
కర్మ సిద్ధాంత రీత్యా – మంచినీళ్ళు త్రాగినా, దొడ్లో గొడ్డును కట్టేసినా, ఒక బిడ్డ కడుపున పుట్టినా పూర్వజన్మ, సుకృతం చేతనే అంటారు. ‘ఋణాను బంధరూపేణా పశుపత్ని సుతాలయః’ అన్నారు. ఆ సిద్ధాంత రీత్యా – రాములవారు దశరధుని కడుపున ఎలా పుట్టాడు? ఎందుకు పుట్టాడు?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.
1970 నుంచి జిల్లెళ్ళమూడి వస్తున్నాను. అంతో ఇంతో అమ్మ మాటల్ని అర్ధం చేసుకున్నాను. కానీ ఈ మాటలు నాకు బోధపడలేదు. మానవులకి కర్మ సిద్ధాంతం వర్తిస్తుంది కానీ మాధవుడు చేస్తే ‘లీల’ అంటాం కదా! అభిప్రాయపడ్డా.
- కాగా, 31-3-2019న S.V.B.Cలో ‘అన్నమయ్య పాటకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో ‘పనిలేదు, పాటలేదు – రమించెవీడు.
‘మా మనసెల్ల దక్కగొనె మాధవ గోవిందుడు’ అనే పాట పాడారు. దానిని
వ్యాఖ్యానిస్తూ సహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావుగారు ఇలా ఎన్నో విప్లవాత్మక సత్యాలను ఉద్ఘాటించారు –
“శ్రీ వేంకటేశ్వరస్వామికి, మా వెంట తిరుగుతూ మమ్మల్ని భ్రమలో ముంచెత్తి వేయటమే తప్ప పనీలేదు, పాటా లేదు – అంటోంది నాయిక. ఆ ఎత్తుగడ చాలా గొప్పది.
ఇది మనకేదో వేళాకోళంగా కనపడుతుంది కానీ – బ్రహ్మసూత్రాలలో ఉన్న మాట అది. ఉత్తర మీమాంసలో – ‘భగవంతుడు ఈ సృష్టి ఎందుకు చేశాడు? – అని అంటే, ఋషులు తర్కించి తర్కించి తర్కించి చివరకు చెప్పిందేమిటంటే ‘లోకవత్తు లీలా కైవల్యం’ అన్నారు. కేవలం పనీ పాటా లేక ఆడుకుందుకు చేశాడు అని. అవును. ‘బాలవత్ క్రీడా’ అని చాలా స్పష్టంగా చెప్పారు వేదాంత గ్రంథాలలో. అంతకంటె సమాధానం కూడా లేదు.
ఏదైనా పనిగట్టుకొని ఒక లక్ష్యంతో చేస్తే మనల్ని ఇంతమందిని మాయలో ముంచి బాధ పెట్టినట్లే అవుతుంది కదా! ఆయన కెవరిచ్చారు ఆ అధికారం? ఆయనకంటే మనం వేరైతే మనల్ని బాధపెట్టే అధికారం ఆయనకి ఎవరిచ్చారు?
ఏదో కర్మ ఫలాలు అనుభవించండి అంటారు. తొలి సృష్టి ప్రారంభమై నపుడు ఎవరి కర్మఫలాలు ఉన్నాయి?
మనకంటె (మానవులకు) పూర్వజన్మ, అంతకు పూర్వజన్మ అసలు మొట్టమొదట (సృష్టి) ప్రారంభించినపుడు బ్రహ్మదేవునికి ఏ కర్మఫలం ఉంది? పెద్ద చర్చ ఇది. అక్కడ చెప్పిన పెద్ద సమాధానం ఏమిటంటే – లోకవత్తు లీలాకైవల్యం” – అని.
అది విన్నాక నాకు తత్త్వం సుబోధకమైంది. అమ్మ మాటలు అర్థం చేసుకోవాలంటే ఒక జన్మ కాదు, వంద జన్మలు సరిపోవు.
ప్రప్రథమంగా అమ్మ కర్మ సిద్ధాంతాన్ని ఖండించింది. కర్తృత్వాన్ని మనిషి తలమీద నుంచి తప్పించింది. స్వయంకృతాపరాధం అనే ఆత్మన్యూనతా భావాన్నుంచి వెలికి దీసి గట్టున పడవేసింది. నిస్సీమశాంతి సాగర తీరాన రమ్యహర్మ్యంలో సేద దీర్చింది.
“నాన్నా! నువ్వు ఎంతగా చేస్తున్నానని అనుకున్నా ఆ శక్తి అనుకోనిదీ చేయించనిదీ నువ్వు అనుకోలేవు చెయ్యలేవు” అన్నది. చిత్రం ఏమంటే – మనకి అతీతమైన ఒక అదృశ్యశక్తి ప్రేరణ వలన ప్రభావం వలన కర్మలనాచరిస్తున్నాం. ఆ శక్తి తన ఇచ్ఛానుసారంగా మనల్ని నడిపిస్తూ, మన ఇచ్ఛానుసారంగా నడుస్తున్నట్లు అనిపింపజేస్తుంది. ఒక విధంగా కేవలం ఒక గుంజకు త్రాడుతో కట్టివేయబడిన పశువుకు ఉన్న స్వేచ్ఛ మనకు ఉన్నది.
‘చేతలు చేతుల్లో లేవ’ని విస్పష్టంగా చాటింది అమ్మ. ఆ తాత్పర్య పరాకాష్ఠ స్థితిలో ఒకనాడు ఒక సోదరుడు – ‘అమ్మా! నేను చాలా చెడ్డవాడిని. అన్నీ తప్పుడలవాట్లే నమ్మా’ – అన్నాడు. వెంటనే అమ్మ “మనుషులందరూ మంచివాళ్ళే నాన్నా! చెడ్డవాడు ఎవడయినా ఉన్నాడూ అంటే మనం అనుకునే ఈ చెడ్డతనాన్ని మనకు ఇచ్చిన ఆ భగవంతుడు మాత్రమే” అన్నది. అలా అని కుసంస్కారాన్ని దుష్ట సంస్కృతిని అమ్మ ప్రోత్సహించదు. వాసనారూపమైన బురదని కడిగివేస్తుంది; ఉద్దరిస్తుంది.
అమ్మ జీవిత చరిత్ర నవలోకిస్తే అమ్మ చేసిన సంస్కరణలు అసంఖ్యాకం మత్స్యకారుడు, పోలీసు (అంకదాసు), మాచెమ్మ, పెమ్మరాజు సత్య – నారాయణమూర్తి… ఎందరో! అలా గ్రంథస్థమైన సంఘటనలే కాక ఎన్నో వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది. సిసలైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో ఆచరణాత్మకంగా ప్రబోధించింది. అమ్మ అంటే రాశీభూతమైన ఆదరణ ఆప్యాయత. కనుకనే “అందరూ ఒకే తల్లి పిల్లలు అనే భావంతో ఉండండి. బాధల్లో ఉన్న వాళ్ళను ఆదుకోండి” అని సందేశాన్నిచ్చింది. స్వధర్మాన్ని తు.చ. తప్పకుండా ఆచరించమని ప్రబోధించింది.
శ్రీ గరికపాటి వారి ప్రశ్నలు అక్షరాలా అమ్మ తత్త్వానికి ప్రతిబింబాలు. అమ్మ సత్య స్వరూపిణి. అమ్మ మాటలు Shakespeare, Shelley, Einstein – ఎవరి పలుకుల్లోనైనా రసరమ్యంగా ఆధ్యాత్మిక సత్య సంశోభిత వినీలాకాశంలో తారాగణంలా ప్రకాశిస్తాయి.
“భగవంతుడు ఈ సృష్టి ఎందుకు చేశాడు? అంటే ఋషులు తర్కించి చెప్పినది – లోకవత్తు లీలా కైవల్యం – ఆడుకుందుకు చేశాడు – అని” అన్నారు శ్రీ గరికపాటి వారు.
Shakespeare, King Lear Drama లో, అంటారు –
“As flies to wanton boys
Are we to the gods,
They kill us for their sport”అని.
“భగవంతునికంటే మనం వేరైతే మనల్ని బాధ పెట్టే అధికారం ఆయనకి ఎవరిచ్చారు? అని సూటిగా ప్రశ్నించారు శ్రీ గరికపాటి. ఆ మాట 16 అణాలా వాస్తవం.
“మీరు కానిది నేనేదీ కాదు” అన్నది అమ్మ. ‘నన్ను పరీక్షిస్తున్నావా అమ్మా?’ అని అడిగితే, “నిన్ను పరీక్షించమంటే నన్ను నేను పరీక్షించుకోవటమే” అన్నది.
“మీరు నా బిడ్డలే కాదు, నా అవయవాలు” అని మహోన్నత సత్యాన్ని ప్రకటించింది – విశ్వజనని అమ్మ.
సృష్టిలో అనాధలు, పీడితులు, దుఃఖార్తులూ ఉన్నారంటే ఆ రూపంగా దుఃఖిస్తున్నది, అలమటిస్తున్నది, విలపిస్తున్నది భగవంతుడే. దైవం తనతో తానే ఆడుకొంటున్నాడు. వేరొకరి ప్రమేయం లేదు. సుఖదుఃఖాలు, కలిమిలేములు, న్యూనతాధిక్యాలు రెండూ తనే. ఇదే తత్త్వతః అద్వైత సారం – జీవో బ్రహ్మైవ నాపరః – కనుకనే ఆకలితో పస్తులుండే వారికి పట్టెడన్నం ప్రేమతో పెడితే, దాహంతో గొంతు ఎండిపోయే వారికి మంచినీళ్ళు నోటికి అందిస్తే, నిరాశ్రయులై కాలిబాటలో పడుకొని చలిబాధకు గజగజ వణికే వారి శరీరాన్ని వెచ్చని రగ్గుతో కప్పి ఆదుకుంటే – వారిపై అమృతవర్షం కురుస్తుంది. ఆ రూపంలో ఉన్న దరిద్రనారాయణుడు సాక్షాత్తూ నారాయణుడే కనుక.
మాన్యులు శ్రీ గరికపాటి వారు మరొక అద్భుతమైన ప్రశ్న వేశారు – ఏదో – ‘కర్మ ఫలాలు – అనుభవించండి’ – అంటారు. తొలిసృష్టి ప్రారంభమైనపుడు ఎవరి కర్మ ఫలాలు ఉన్నాయి? మనకంటే పూర్వజన్మ, అంతకు పూర్వజన్మ – మొట్ట మొదట ప్రారంభించినపుడు బ్రహ్మదేవునికి ఏ కర్మ ఫలం ఉంది? పెద్ద చర్చ ఇది” – అని.
ఈ ప్రశ్నల్ని అమ్మ అలనాటి నుంచి పలుమార్లు సంధించింది. కానీ రక్తంలో జీర్ణమైన సుస్థిర భావాలు అంత తొందరగా మారవు. ‘సన్తః పరీక్షాన్యతరత్భజంతే’- దేనినైనా తరచి నిగ్గుదేల్చుకుని అంగీకరించాలి. పూర్వజన్మ కర్మఫలం ఈ జన్మలో అనుభవిస్తున్నాడన్నారు. తొలి జన్మలో వ్యక్తికి కర్మఫలం లేదు. ఆ శక్తి ఏం చేయిస్తే అది చేశాడు. ఆ కర్మఫలం తర్వాత జన్మలో అనుభవిస్తున్నాడు అనుకుంటే – వ్యక్తికి తనదంటూ కర్మఫలం ఎక్కడిది?
కర్మ సిద్ధాంత అస్థిత్వం ఎక్కడ???
‘సృష్ట్యారంభంలో బ్రహ్మదేవునికి ఏ కర్మఫలం ఉంది?’ అనే ప్రశ్నను విన్నపుడు, అమ్మ వేసిన ప్రశ్న ‘ఏ రకమైన కర్మ చేస్తే రాములవారు పుట్టి ఉంటారు’? ఏ రకమైన దుష్కర్మ చేస్తే రాములవారు అడవికి పోయి ఉంటారు?’ – అనేది చక్కగా అర్ధమవుతుంది.
వైకుంఠ ద్వారపాలకులు జయవిజయులు మునుల శాపానికి గురి కావటంలో వారిదోషం ఏమిటి? అంతా భగవత్సంకల్పం – లీల; ‘దేవుని పరంగా లీల, మనిషి పరంగా కర్మఫలం’ అనికాకుండా సృష్టి కదలికలన్నీ లీలా మాత్రమే అని అర్ధమవుతోంది.
“ఇది ఏమిటి? అసలు ఇది ఏమిటి”? – అంటూ అమ్మ ఇంకా లోతుగా తర్కించి జన్మలు కర్మఫలం కావని, ఆర్జితములు కావని, ఆ శక్తి ఇస్తే వస్తాయని అన్నది. అంటే వ్యక్తికి తత్త్వతః ఒక I.D.No. /C.I.F. No. లేనే లేవు. ఈ సత్యాన్ని ఘంటాపధంగా ఎలుగెత్తి చాటుతూ అమ్మ, “సముద్రంలో అలలేచి మళ్ళీ కలిసిపోయినట్లే మీ జన్మలూనూ, నా సంకల్పంతో జన్మ ఎత్తి నాలోనే లయమవుతారు” – అన్నది.
ఏతావతా కర్మ సిద్ధాంతం ఎక్కడ???
ఉపయుక్త గ్రంథావళి (Select Bibliography):-
- Jillellamudi Amma conversation part I – You Tube
- ‘అన్నమయ్య పాటకు పట్టాభిషేకం’ – Episode 124, part 03,
31.3.2019, SVBC., TTD., Youtube.