స్థాపన: అమ్మ తన మహత్సంకల్పం మేరకు జిల్లెళ్ళమూడిలో ప్రాచ్య కళాశాలను స్థాపించింది. ప్రిన్సిపాల్గా ముందుగానే డా॥ పన్నాలవారిని ఎంపిక చేసింది. సంస్కృతం, తెలుగు భాషాభ్యసన ప్రాతిపదికగా ఓరియంటల్ కళాశాలను స్థాపించాలని అమ్మ ఎందుకు సంకల్పించింది? వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, భగవద్గీత, పురాణేతిహాసాలు – యావత్ ఆర్ష సంస్కృతి సంస్కృత భాషలో ఉన్నదనా? భారతీయ భాషలన్నింటికి మూలం సంస్కృతభాష; కాగా సంస్కృత భాషకి మూలం పరమేశ్వరుడు అని మనకి తెలుసు. సంస్కృత భాషని దేవభాష, గీర్వాణభాష అనీ పిలుస్తారు. సంస్కరించే భాష సంస్కృత భాష. జ్ఞాన సర్వస్వానికి నిధి, నిధానము సంస్కృతమే. కాలక్రమేణ ఆ ఉత్తమ స్థాయిని అందుకోలేని తరాలు dead language అని పేర్కొనటం దురదృష్టకరం. సంస్కృత భాష అమృత భాష; మృతభాష కాదు. అదే ప్రపంచానికి మున్ముందు దిక్కు, దిక్సూచి అని పండితులు ఉద్ఘాటించారు.
‘పలు సందియము లడంచును.
వెలయించు నగోచరార్థ విజ్ఞానములో
కుల కక్షి శాస్త్ర మయ్యది
అలవడ దెవ్వనికి వాడు అంధుడు జగతిన్’ అనేది ఆర్యోక్తి.
Physics, Chemistry, Botany ఇత్యాది భౌతిక శాస్త్ర విజ్ఞానము కనిపించేది. ‘ఆత్మ విద్యా మహావిద్యా శ్రీవిద్యా’ అని లలితా సహస్రనామాల్లో కీర్తించబడిన విద్య, జ్ఞానము అగోచరార్థం – కంటికి కనిపించనిది. ఆ లక్ష్యాన్ని చేర్చేది సంస్కృతం.
Engineering, Medicine తప్ప దేనినీ విద్యగా పరిగణించని ఆధునిక కాలాన్ని దృష్టిలో ఉంచుకుని అమ్మ
1972లో ‘గురుకుల బోధన’ పద్ధతిలో ఓరియంటల్ కళాశాల స్థాపించింది. ప్రొఫెసర్ L.S.R. కృష్ణశాస్త్రి గారు అన్నారు “విశ్వవిద్యాలయాల్లో Buildings ఉన్నాయి కానీ Builders లేరు” అని. వాస్తవానికి అమ్మయే వ్యక్తిత్వవికాస నిర్మాత. విద్యార్థినీ విద్యార్ధులు అనుదినం ఉదయం సుప్రభాతం, సాయంకాలం సంధ్యావందనం, సోమ – శుక్రవారాల్లో లలితా లక్షనామ పారాయణ, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనునట్లు చేసి తద్వారా వారి వ్యక్తిత్వ వికాసానికి రాచబాట వేసింది అమ్మ.
అభివృద్ధి: కర్మయోగులు అనదగు డా॥ పన్నాల వారు, శ్రీ విఠాలవారు మున్నగు ప్రధానాచార్యుల బోధనలో శిక్షణలో కళాశాల మూడు పూవులు ఆరుకాయలుగా వృద్ధి చెందింది.
1971లో కళాశాల స్థాపించబడినా 1985 వరకు భవన నిర్మాణం జరగలేదు. 1985 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిటీ నియమించింది. కొన్ని కళాశాలలనే కొనసాగనివ్వాలని. జిల్లెళ్ళమూడి కళాశాలలో ఉన్నత విద్యాప్రమాణాలు, ఉపాధ్యాయ విద్యార్ధి నిష్పత్తిపరంగా సంతృప్తికరమే. కాని కళాశాలకి భవనం లేదు అని అడ్డు చెప్పింది. ఒక సంవత్సరం గడువు ఇవ్వండి, భవనం నిర్మిస్తామని హామీ నిచ్చాం..
ఒకనాడు పునాదులపై నిలబడియున్న ఇనుప చువ్వల్ని చూసి, ఆవేదన చెంది, అమ్మవద్దకు వెళ్ళి నేను “అమ్మా! ఆ బాధ్యత నేను స్వీకరిస్తాను”అని విన్నవించుకున్నాను. వెంటనే అమ్మ దోసిళ్ళతో పూలుతీసి ఆశీఃపూర్వకంగా నా తలపై పోసింది. అది అమ్మ. ఆదేశమని ఆ బాధ్యతను శిరసావహించాను. సోదరీ సోదరుల సహకారంతో 1986లో భవన నిర్మాణం పూర్తిఅయింది. అంతా అమ్మ సంకల్ప బలం, అమ్మ ఆశీర్వచన మహత్వం. బాలుర హాస్టల్ వెలిసింది. నేడు బాలికల హాస్టల్ కూడా నిర్మాణదశలో ఉంది. ఈ అభివృద్ధిసాధనలో శ్రీ కొండముది రామకృష్ణ, శ్రీ గోపాలన్నయ్య, డా॥ పొత్తూరి వెంకటేశ్వరరావు గారలు ఇంకా అనేక సోదరీసోదరులు మూలస్తంభాలుగా నిలిచారు. నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధిస్తున్నాం. భాషప్రవీణ, విద్యాప్రవీణ కోర్సుల స్థానే B.A. (OL.) Degree Course ప్రారంభమైంది. ఆంగ్లభాషా బోధన, Computer శిక్షణతో కళాశాల విద్యార్థులు కేవలం ఉపాధ్యాయ వృత్తిలోనే కాక వివిధశాఖల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వారి వృత్తినీ ప్రవృత్తినీ రెంటినీ తీర్చిదిద్దింది అమ్మ.
నేడు మన కర్తవ్యం: 1971లో కాలేజి ప్రారంభమైంది. 1 1/2 సంవత్సరాలు కేవలం భక్తుల విరాళాలపైనే ఆధారపడి నడిచింది. అమ్మ కృప, పెద్దల కృషితో Grant-in-Aid మంజూరైంది. ఉద్యోగులకు జీతభత్యాలను ప్రభుత్వమే చెల్లిస్తోంది.
రోజులు మారాయి. కాలక్రమంలో Grant-in Aid లో పనిచేసే ఉద్యోగి Retire అయితే Grant పోతుంది, Post పోతుంది. ఆ స్థానాల్లో అధ్యాపకులకు గౌరవవేతనాన్నిచ్చి సంస్థయే కళాశాలను నిలబెడుతోంది.
రోజురోజుకు పరిస్థితులు మరింత జటిలంగా సమస్యాత్మకంగా మారుతున్నాయి. Grant-in-Aid లోని Post లన్నీ ప్రభుత్వాధీనమైనాయి. ప్రస్తుతం పనిచేస్తున్న ఐదుగురు Contract based Lecturers కూడా ప్రభుత్వాధీనమైతే విద్యార్థులకు ఉచిత భోజన వసతి సౌకర్యాలతోపాటు కళాశాల నిర్వహణ, సిబ్బంది. యావన్మందికీ జీతభత్యాలు – మొత్తం బాధ్యత సంస్థమీదే పడుతుంది.
ఈ క్లిష్టపరిస్థితులలో సోదరీసోదరులు, కళాశాల పూర్వవిద్యార్థుల సమైక్య కృషి సహకారాలతో అమ్మ స్థాపించిన సేవా సంస్థ, కళాశాలను నిలబెట్టుకుందామని విజ్ఞప్తి చేస్తున్నాను. అమ్మచేతి ఉపకరణాలుగా జన్మసార్ధకతను సంతరించుకుందాం!
2021 డిసెంబరు నెలలో కళాశాల స్వర్ణోత్సవాల్ని అంగరంగవైభవంగా నిర్వహించుకుందాం!!
వాణ్యేకా సమలం కరోతిపురుషం!!!