మా చిన్నప్పుడు జిల్లెళ్ళమూడిలో ఎలిమెంటరీ విద్య తప్ప మరేదీ లేదు. నాకు అమ్మను విడిచి ఉండాలని పించేది కాదు. కాని చదువుకోసం చాలా చోట్ల ఉండాల్సి వచ్చింది. అప్పికట్ల స్కూలులో మా బాబాయి లోకనాధం గారు ఉపాధ్యాయునిగా ఉండేవారు. పూండ్లలో ఉండి అక్కడకు రోజూ పోయి వస్తూండేవాడిని. బాపట్ల, చీరాలలో సుబ్బారావు అన్నయ్య, నేను కొంతకాలం ఉండి చదువుకున్నాము.
1963, 64 ప్రాంతాలలో భద్రాద్రి రామశాస్త్రి గారు జిల్లెళ్ళమూడిలో ఉండి ఇక్కడి ఆడపిల్లలు ఝాన్సీ, సావిత్రి, మా హైమవంటివారికి సంస్కృతం నేర్పేవారు. వారందరూ సంస్కృతంలో మాట్లాడటం కూడా చూశాను.
1964 ప్రాంతంలో శ్రీ పన్నాల రాధాకృష్ణ శర్మగారు వచ్చారు. వారు జిల్లా పరిషత్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తుండేవారు. అమ్మ “జిల్లెళ్ళ మూడిలో సంస్కృత కళాశాల పెడితే వస్తావా?” అని వారిని అడిగింది. “ఇక్కడ హైస్కూలు లేదు. కాలేజి ఏమిటమ్మా ? చిన్న పల్లెటూరు. పైగా నాకు కాలేజిలో పనిచేయడానికి కావలసిన అర్హతలేదు” అన్నారు.
ఆ తర్వాత వారు చదివి బి.ఎ., యం.ఎ. పాసై ఒక సంస్కృత కళాశాలలో ఉద్యోగం చేస్తూ అమ్మ వద్దకు వచ్చి ఇక్కడ మనకు తగిన వసతులు ఉన్నవి కదా సంస్కృత కళాశాల ఇక్కడ పెడితే బాగుంటుందని అడిగారు. అమ్మ అదివరకే నిర్ణయించింది కనుక దాని విషయం చూడమని శ్రీ అధరాపురపు శేషగిరిరావుగారికి చెప్పింది. వారు అన్ని ఆలోచనలు చేసి మాతృశ్రీ విద్యాపరిషత్ పెట్టడానికి తగిన అప్లికేషనులు పెట్టి ప్రభుత్వం నుండి విశ్వవిద్యాలయం నుండి తగిన అనుమతులు తెచ్చారు. 1971లో కళాశాల ప్రారంభమైనది. రాధాకృష్ణ శర్మగారు ప్రధానాచార్యులు, కార్యదర్శి బొడ్డుపల్లి సీతారామశర్మగారు. కళాశాల అభివృద్ధికి గోపాలన్నయ్య, రామకృష్ణన్నయ్య, ఎంతో కృషి చేశారు. శ్రీ విఠాల రామచంద్రమూర్తి గారు కూడా వచ్చి కళాశాలకి పేరు ప్రతిష్ఠలు కోసం కృషి చేశారు.
నాకైతే సంస్కృతం ఏమీ తెలియదు. చిన్నప్పుడు కచటతప, గజడదబలు చెప్పేవాళ్ళని పరిహాసంగా అంటుండేవాడిని. తర్వాత కళాశాలలో చదివే విద్యార్థులను చూచి సంతోషించాను.
అమ్మ అమ్మగానే కాక మహాద్భుతశక్తి సంపన్నురాలుగా రాను రాను అర్థమౌతూ వచ్చింది. అన్నపూర్ణాలయం, విద్యాలయం, వైద్యాలయం వంటివి. ఏర్పాటు చేయడం మానవాళికి, ప్రపంచానికి ఒక విశ్వజీవన సందేశం అందించింది అని అనిపించింది.
పూరిపాకలో మొదలైన కళాశాల ఈనాడు మహోన్నతమైన భవనాలలో కళాశాలే కాక విద్యార్థులకు, విద్యార్థినులకు ప్రత్యేక హాస్టలులతో విరాజిల్లుతున్నది. ఆ నిర్మాణాల కోసం సహాయసహకారాలు అందిస్తూ వస్తున్నాను.
ఈనాడు ఓరియంటల్ కళాశాల స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నది. ఇది ఒక మహత్తర సన్నివేశం. ఇక్కడ చదివిన విద్యార్థులు అమ్మను మరచి పోకుండా, తాము చదివిన కళాశాలను మరచిపోకుండా వైభవంగా స్వర్ణోత్సవాలను జరపాలని సంకల్పించి శ్రీ విశ్వజననీ పరిషత్ పెద్దలతో కలిసి ఏర్పాట్లు చేయడం హర్షించదగ్గ విషయం.
ఇలా రెట్టింపు ఉత్సాహంతో త్వరలో రాబోతున్న అమ్మ శతజయంతి ఉత్సవాలను మహోన్నతంగా, విశ్వవ్యాప్తంగా అబ్బురపడే రీతిలో జరపాలనీ జాతికి ఒక నూతన సందేశాన్ని ప్రసారం చేయాలని నేను పూర్వవిద్యార్థి సంఘం సోదరీ సోదరులందరినీ కోరుతున్నాను.