జిల్లెళ్ళమూడి అమ్మ మాతృశ్రీ అనసూయా మహాదేవి గర్భవాసాన జన్మించి, అమ్మకు ప్రతిరూపంగా, కారుణ్యం, వాత్సల్యం, ప్రేమ… ఇలా అమ్మ నుంచి అన్ని సల్లక్షణాలను తనలో సహజాతంగా కలిగి ఉండి, అమ్మ సాన్నిధ్యంలో పెరుగుతూ, అమ్మపట్ల ఎనలేని భక్తి ప్రపత్తులు కలదై, అహరహము అమ్మనే స్మరిస్తూ, సాటి జీవుల పట్ల అపార కారుణ్యాన్ని ప్రదర్శిస్తూ, తోటి అక్కయ్యల అన్నయ్యల పట్ల నిష్కల్మష ప్రేమను కురిపిస్తూ, సృష్టిలో సమస్తాన్ని తల్లీబిడ్డలుగానే దర్శిస్తూ, అమ్మను అనన్యభక్తితో సేవిస్తూ, చివరకు అమ్మ కంటే ఎంతో ముందుగా ఆలయ ప్రవేశం చేసి, అమ్మ బిడ్డలందరికి అక్కయ్యగా, శ్రీ హైమవతీ దేవిగా జిల్లెళ్ళమూడిలో కొలువుతీరిన హైమమ్మను గురించి అమ్మ వచించిన మాటలు మనకు నిత్య స్మరణీయాలు. సదా ఆచరణీయాలు.
“హైమకు నేను దైవత్వం ఇచ్చాను, హైమ మీకు దారి అనుకుని నామం చేయండి. భవిష్యత్తులో హైమాలయం తపస్సాధకులకు నిలయం అవుతుంది” అని అన్నది అమ్మ.
అంతేకాదు అమ్మా! నీవు ‘అంఆ’ అంటే అంతులేనిది, అడ్డులేనిది, ఆధారభూతమైనది అని నిర్వచనం చెప్పావు. మరి ‘హైమ’ అంటే ఏమిటమ్మా? అని కొందరు సోదరులు అమ్మను అడుగగా…..
అమ్మ ఎంతో దయార్ద్ర హృదయంతో ‘మ హై!’ అని బదులు పలికింది. రాష్ట్ర భాష అయిన హిందీ లో ‘మ హై’ అంటే, “అమ్మ ఉన్నది” అని అర్థం.
ఔను నిజమే! అన్నిటికి, ముమ్మాటికి “అమ్మ ఉన్నది” అని అనుకోగలిగితే, అలా గుర్తించ గలిగితే, ఆ నమ్మికయే అణువణువున, ప్రతీక్షణమున నిలువుకోగలిగితే అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది?
హైమకు అమ్మ చెప్పిన నిర్వచనం అంతులేని విలువకలిగినది. అది ఒక మహామంత్రం. మంత్రరాజం. ఆ మంత్రానికి లభించనిదంటూ ఏదీ ఉండదు. ఒక విధంగా అది రహస్యాలన్నింటిలోనూ రహస్యమైనది. గొప్పవాటికన్నింటిలోనూ గొప్పది. అంతలా ఆశ్రయించి, ఆ లోతు చూసిన వారికే ఆ సంగతి బోధపడుతుంది.
ఒకరొకసారి ‘దేవుడు ఉన్నాడా?’ అని అమ్మను ప్రశ్నించగా, ‘ఉన్నది దైవమే’ అని అమ్మ చెప్పింది. తన కడుపున పుట్టిన ఆడ బిడ్డకు ‘అమ్మ ఉన్నది’ అనే అర్థం వచ్చేలా ‘హైమ’ అని పేరుపెట్టుకుంది. చివరకు దైవత్వం ఇచ్చి, దేవతను చేసింది. తానూ మ్రొక్కింది. ఇతరులనూ మ్రొక్కుకోమని సూచించింది. అంతేకాక పలు కష్టాలలో ఉన్నవారికి నివారణోపాయంగా హైమకు ప్రదక్షిణాలు చేసుకోమని సూచించింది. అంతేకాదు కొందరికి హైమమ్మకు కొబ్బరికాయలు కొడతామని మొక్కుకోమని సూచించింది.
జగదారాధ్య అయిన అమ్మ, తానే స్వయంగా ఎన్నోమార్లు హైమమ్మకు పూజాదికాలు చేసింది. అంతేకాక హైమమ్మ కోరిక మేరకు హైమమ్మకు ఎంతో ప్రీతిపాత్రమైన ‘జయ హె మాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరీ శ్రీ పరాత్పరీ’ అమ్మనామాన్ని నిరంతరం హైమమ్మతల్లి వినేలా అఖండ నామం జరిగేలా ఏర్పాటు చేసింది. ప్రతీ సోమ, శుక్రవారాల్లో శ్రీ లలితా లక్షనామార్చన జరిగేలా ప్రేరణ నిచ్చింది.
ప్రతి రోజూ క్రమం తప్పకుండా శ్రీ హైమాలయంలో ప్రదక్షిణలు చేస్తూ, తమ అభీష్టాన్ని హైమమ్మకు నివేదించి సత్ఫలితాలను పొందిన, పొందుతున్న భక్తులు అనేకమంది. అలా హైమ్మమ్మ కల్పవల్లిగా, కామితార్థ ప్రదాయినిగా, కారుణ్యసింధువుగా, అభీష్ట వరదాయినిగా లోకప్రసిద్ధి నొందినది.
దివ్యలోకాల నుంచి దిగివచ్చి విశ్వజననిగా, మాతృవాత్సల్యామృతవర్షిణిగా, మోక్షప్రదాయినిగా అవతరించి అమ్మ మనతో మనవలె మనమధ్య ఈ అవనీస్థలిపై నడయాడింది.
కాగా, లోకకళ్యాణార్థం జన్మించిన హైమ విశ్వసహోదరిగా, కృపాధారాధారగా, పరహితార్థ కామనయే ఊపిరిగా శ్వాసించి, అమ్మనే విశ్వసించి అమ్మనే ఉపాసించి, మాధవిగా ఎదిగింది; అమ్మ ప్రతిబింబంగా వరాలదేవతగా ఆలయంలో విరాజిల్లుతోంది, అనుగ్రహిస్తోంది.