దాదాపు 2010 సంవత్సరంలో అశోక్ హౌస్లోలో వీరయ్య అనే వాచన్ వచ్చాడు. అప్పటి నుంచి అమ్మ మందిరం చూసుకోవటం, ఎవరైనా వస్తే వాళ్ళ గురించి విషయాలు సేకరించి మాకు చెప్పేవాడు. ఉదయమే మందిరం తాళం తీసి అమ్మకు నమస్కారం చేసుకునే వాడు. సాయంత్రం మందిరంలో లైట్లు వేయటం, మళ్ళీ రాత్రి 9 గంటలకు తాళాలు వేసుకొని ఎంతో భక్తిశ్రద్ధలతో చేసేవాడు.
మందిరంలో ఫంక్షన్ అయినా ఎంతో శ్రద్ధగా అక్కడంతా కడిగించేవాడు. వని అమ్మాయి రాకపోయినా తానే కడిగేవాడు. ఆరోగ్యం సరిగాలేకపోతే “ఏం వీరయ్య? మీ వాళ్ళ దగ్గరికి వెళ్లొచ్చుకదా” అంటే ‘అమ్మ’ను చూపించి, ఆ అమ్మ కోసమే వచ్చాను. ఆమె చూసుకుంటుందని చెప్పేవాడు. లాక్ డౌన్ సమయంలో గూడా మందిరాన్ని అంటిపెట్టుకునే వున్నాడు.
అశోక్ హౌస్ ఫస్టుఫ్లోర్లో ఉన్న రామకృష్ణగారు ఆయన సతీమణి లక్ష్మిగారు అతని అవసరాలు కనిపెట్టి చూస్తుండేవాళ్ళు. లాక్ డౌన్ సమయంలో అతనికి టిఫిన్, భోజనం కూడా రోజూ వాళ్ళే పెట్టేవారు. మూసిన కన్ను తెరవకుండా జ్వరంతో బాధపడ్తుంటే రామకృష్ణగారే 108 ఫోను చేసి ఆ వీరయ్య స్నేహితుడికి 2000 రూపాయలు ఇచ్చి కె.జి.హెచ్. లో జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. అక్కడ ఎంతమంది వున్నా ఆ దంపతులకు అమ్మ మంచి బుద్ధి కలుగజేసింది. అతను ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చాక బాగా నీరసంతో వుంటే వాళ్ళ అబ్బాయికి ఫోను చేస్తే తాను వచ్చి తీసుకు వెళ్తానన్నాడు. మురళి మందిరంకు వెళ్ళినప్పుడు అమ్మకు చెప్పు నేను మా అబ్బాయితో వెళ్తున్నానని నాకు కబురు పెట్టాడు. ముందు రోజే దసరాలకు అతనికి కొత్తబట్టలు తీసేదాన్ని. ఈ రోజైనా తెప్పించాలని అనుకున్నాను. అప్పుడే వెళ్తాడని అంటే మురళిని అడిగాను. డబ్బు లేవైనా వున్నాయా అంటే 500/- వున్నాయన్నాడు. అది అతనికి ఇవ్వమని చెప్పాను. ప్రొద్దున్నే 9.30 కి వెళ్ళి అమ్మగారు ఇమ్మన్నారని ఇస్తే తీసుకొని జేబులో పెట్టుకున్నాడు.
అతనికి అమ్మ మందిరాన్ని వదిలిపెట్టి వెళ్ళాలని లేదు. ఎప్పుడు అన్నా ‘ఆ అమ్మే’ చూసుకుంటుందనే వాడు. అ లాంటిది అతని కోరిక తీర్చి మధ్యాహ్నం 11 గంటలకు కార్తీక సోమవారం 23వ తారీఖున అమ్మలో లయమయిపోయాడు. మధ్యాహ్నం అది విని ఆశ్చర్య పోయాను.
రామకృష్ణగారే అతని అంత్యక్రియలు ఎంతో ఘనంగా జరిపించారు. ఇంతకీ తీసుకువెళ్తానన్న కొడుకు రానేలేదు. వీరయ్యతో రోజూ కబుర్లు చెప్పుకునే స్నేహితుడే ‘మా నాన్నకు తలకొరివి నేను పెట్టలేదు, నేనే తాతకు పెడ్తానని ఎవరు పెడ్తారా అన్న ఆలోచనకు కూడా ‘అమ్మే’ అతనికి బుద్ధి పుట్టించింది. రామకృష్ణ గారి దంపతుల ఋణం తీర్చుకోలేనటువంటిది. వాళ్ళను చల్లగా చూడమని అమ్మను ప్రార్థిస్తున్నాను.