1. Home
  2. Articles
  3. Viswajanani
  4. గృహస్థాశ్రమంలో అమ్మ

గృహస్థాశ్రమంలో అమ్మ

V S R Moorty
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 21
Month : June
Issue Number : 11
Year : 2021

(శ్రీ జిల్లెళ్ళమూడి అమ్మ కళ్యాణోత్సవం సందర్భంగా ఈ వ్యాసం ప్రచురింపబడింది.)

సనాతనం సనూతనంగా వుండటం సహజ పరిణామం. మనదైన సదాచారాన్ని కాదనుకుని, విదేశీయమైన సంస్కృతిని మనదిగా చేసుకునే ప్రయత్నంలో విషాదమే మిగులుతుంది. వ్యవస్థలన్నీ రూపంతరీకరణం జరిగి దురవస్థకు దారితీస్తుంది. సనాతన భారతీయంలో వివాహవ్యవస్థ ఒక పటిష్ఠ పవిత్ర విధానం. అది ఆరోగ్యకరం. సభ్య సంస్కార సమాజగతిని శాసించే వివాహ వ్యవస్థది. ఈ దేశ సంస్కృతిలో కీలకభూమిక స్త్రీ పురుషులు భిన్న కుటుంబ నేపథ్యాల నుండి వచ్చి, కళ్యాణ కాలం నుండి జీవితం కడవరకు కలిసి వుండటం, మిగతా ప్రపంచానికి మార్గదర్శనం చేయిస్తుంది. జనజగత్తుల చేత సాక్షాత్ దేవీ స్వరూపంగా ఆరాధింపబడే అమ్మది, అతివర్ణాశ్రమిగా ఆధ్యాత్మికస్థితి.

భౌతికస్థాయిలో కేవలం గృహిణిగా భావిస్తే, ఆమె అంతమాత్రమే కాదు. వేదకాలం నాటి పెద్ద ముత్త యిదువుగా వ్యవస్థను వన్నెలీనించిన కళ్యాణ కల్పవల్లి ఒక పెన్నిధిని సన్నిధిగా మార్చుకోవటం పెండ్లి. ఆ పరిణామమే పరిణయం. కళంకరహితంగా వుండటమే కళ్యాణం. గళబద్ధమైన మంగళసూత్రాలు ధర్మకామం వైపు కలసి నడిపించే పాదాలు.

ఒకరి భావాలను మరొకరు మన్నిస్తూ, మర్యాదతో, సంయమనంతో, నిబద్ధతతో, వరస్పరాశ్రితులుగా జీవించటమే సంసార జీవనం. భావం తెలుసుకుని భార్య, బాధ్యత నెరిగి భర్తా ప్రవర్తించటమే దాంపత్యం.

దారం, బంగారం కలిస్తే సూత్రం. దారం మార్పు కుంటుండాలి. మార్పెరగనిది బంగారం. మాలిన్యం లేనిది. బంగారం. అవి దేహాత్మలకు ప్రతిరూపాలు.

ఆలోచన, ఆదరణ కలిస్తేనే శక్తికి నిండుదనం. పురుషుడిలో స్త్రీ స్త్రీలో పురుషుడు కలిసి వున్నారు. వివాహం, అర్థనారీశ్వరరత్వానికి పతాక, ప్రేమ, భక్తి, సమర్పణ కలిసిన త్రిపిటి

సర్వాన్నీ స్వాధీనం చేసుకున్నదే సాధ్వి. వివాహ జీవితం రాజీపడటం నేర్పదు. సర్దుకుపోవడం నేర్పుతుంది. గృహస్థ జీవితంలో మానవ స్వభావం ప్రభావానికి లోనైనపుడు పిల్లల పట్ల వాత్సల్యం, అతిథుల పట్ల ఆదరం, భర్త పట్ల వినిర్మల ప్రేమగా ప్రకటిత మవుతుంది.

సత్యధర్మ, శాంతి, ప్రేమ భావనలన్నింటినీ ఆచరణాత్మకం చేసుకోగల వీలు వివాహ వ్యవస్థలో వున్నాయి. నిజానికి మనిషి దృష్టిలో వున్న ఈ భేదభావం సృష్టికర్తకు లేదు. ఒకటి లేకుండా మరొకటి మనుగడ సాధించలేదు. బాల్య, కౌమార, యౌవన, వార్ధక్యాలతో యిమిడి వున్నదంతా ప్రేమే! కానీ భిన్నస్థితులలో ఈ మాటలన్నీ ఆధునిక స్త్రీ పురుషులు అర్థం చేసుకోవలసినవి. వాటిని ఆచరించు సమస్థితి ఏర్పడి నిత్యశాంతి వెళ్లి  విరుస్తుంది.

ధర్మబద్ధమైన కామంవలననే భద్రజాతి ఏర్పడుతుంది. మనస్యేకం, వచన్యేకం, కర్మణ్యేకం మహాత్మనః . ఇంట్లో భార్య భర్త బిడ్డ – ఈ ముగ్గురి మధ్యా సమన్వయం ఉంటే ఆ యిల్లు ప్రశాంత నిలయమౌతుంది. ఎక్కడ శాంతి వుంటే అక్కడ సుఖం, సంతోషం, ఆనందం నిత్యవసంతంగా వుంటాయి.

ప్రేమించటానికి, పంచుకోవటానికి అనువైన వేదిక, గృహస్థాశ్రమం, జీవితంలో ఏర్పడే సమస్యలు, సవాళ్లు, ఒత్తిడులు సంయోగ వియోగాలు, సుఖదుఃఖాలు, జయాప జయాలు చీకటి వెలుగులు .. వీటన్నింటినీ కలిసి ఎదుర్కోగల స్థైర్యాన్ని వివాహ జీవితంలోంచి పొందాలి.. ఎందుకంటే ఇవన్నీ ఉంటేనే జీవితం.

తూర్పు పడమరలు ఎదురెదురుగా వున్నా, ఒకే చతురస్రంలో భాగమై కలిసే వున్నట్లు భార్యాభర్తలు వుండాలంటుంది అమ్మ! ఈ పవిత్ర వ్యవస్థలో అత్త, కోడలు – ఒక అనివార్యమైన బాంధవ్యం.

భార్య భర్తగా విడిగా చూస్తే ద్వైతం! ఇద్దరినీ కలిపి చూస్తే అది అద్వైతం. మనసులు కలవట మంటే రెండు భావాలు కలవటం, ఏకసూత్రం ఏకశిల, ఏకాత్మభావన బలమైనవి. అవి సంఘటిత స్వరూపాలు. అవే ప్రపంచానికి బలం.

పురుషుడి జీవితంలో ప్రవేశించే స్త్రీ అతడి మనసెరిగి వర్తించే మనస్విగా, తలపుల గాఢతతో తపస్విగా స్వచ్ఛకీర్తితో యశస్విగా, కార్యనిర్వహణలో మంత్రిగా, అన్నం పెడుతున్న వేళ అమ్మగా, బహుముఖీనంగా జీవనాలంబన మౌతుంది. స్త్రీ జీవితంలో ప్రవేశించే పురుషుడు, భద్రతను, ఆధారాన్ని ఆదరాన్ని, ఆలంబనను కల్పించే భావశక్తిగా వుంటాడు.

పరస్పర విరుద్ధ భావజాలంతో కలిగి జీవించవలసిన పరిస్థితి. అందుకే అమ్మ “అత్తగారు తన కోడల్ని కూతురుగానూ, కోడలు తన అత్తగారిని అమ్మగానూ ప్రేమించగలిగితే, అది నిజమైన అద్వైతం” అన్నది. ఇదొక అధివాస్తవిక దృష్టి. ఆధునిక యువత అమ్మ జీవితాన్ని అర్థం చేసుకుని, జీవించగలిగితే వివాహ వ్యవస్థ నిలబడుతుంది. స్థితిగతులు, అందచందాలు శాశ్వతం కావు. కలసి బ్రతకటం ఒక అవసరంగా కాక, ఒక ఆధ్యాత్మ విధానంగా దర్శించగలిగితే, దాంపత్య ధర్మం ఏ జాతినైనా నడిపించగల ధార్మికశక్తి అవుతుంది. ధర్మబలమంతా అవగాహనలో, ఆచరణలో యిమిడి వుంది. ఏ పురుషుడైనా, ఏదో ఒక దశలో తన భార్యను’’అమ్మా’ అనగలిగితే అది విశిష్ట దాంపత్యానికి గుర్తు

(ఆంధ్రప్రభ వార్తాపత్రిక సౌజన్యంతో)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!