ఈ ఇరువురు మహనీయులు చిన్నతనమునుండే పారమార్థిక పారలౌకిక శక్తులు కలిగినవారే. దైవబలమేదో వారి అనుగ్రహశక్తిలో అంతర్లీనమై వారి ఆశీస్సులలో ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఒకసారి చూస్తే మరల మరల వారి దర్శనం చేసుకోవాలనే కోరిక కలగటం అనివార్యం అవుతూ ఉంటుంది. ” మన్మనాథవ మద్భక్తో మద్యాజీ … ” అని గీతాచార్యుడు. చెప్పినట్లు వారిని నమ్ముకున్నవారి యోగక్షేమాలు వారే. చూచుకోవడమనేది ఇద్దరిలో అజ్ఞాతంగా ఉండే సహజ ప్రవృత్తి. భక్తుల మనోభావాలను తృటిలో గ్రహించి వారికి అల్పాక్షరముల అనల్పార్ధము స్ఫురించునట్లు సరళమైన భాషలో మార్గదర్శనం చేసి ఉపశమనం కలిగిస్తారు. స్వామివారు 17 భాషలు తెలిసిన బహుభాషావేత్త. అమ్మ ట్రాన్స్ లో అనేక విదేశీ భాషల్లో ఎవరెవరితోనో మాట్లాడేది.
గృహస్తాశ్రమం మన సాంఘిక వ్యవస్థకు జీవగర వంటిదని నమ్మి, గృహస్త ధర్మాచరణకు పెద్దపీట వేసినవారే. నేను మీలో దైవత్వం చూస్తాను, మీరు నాలో మానవత్వం చూస్తారు అని చెపుతూ ఉండేది అమ్మ. మన బోటి సామాన్యులలోనే దైవత్వాన్ని చూడగలిగిన ‘అమ్మ’నడిచేదైవంలో’ దైవత్వాన్ని చూడటంలో విశేషమేముంది?
‘అవచనేనైన ప్రరోవాచ. అన్న ఉపనిషత్ పద్ధతిలో మౌన సందేశం తోనే భక్తులనుద్ధరించినవారే. ఎందరో ఎన్నెన్నో ప్రశ్నలతో సందేహాలతో వచ్చి, అమ్మ సన్నిధిలోకి వచ్చినంతనే భాష అవసరంలేని భావస్థితికి లోనై, సందేహనివృత్తి అయినవారే. అదే అనుభవం మహాస్వామి సన్నిధిలోనూ జరుగుతూ ఉండేది.
స్వ-పర భేదాలు గాని, జాతి మత లింగ, దేశ భేదాలు గాని లేని వారే. అద్వేష్టా సర్వభూతానాం అన్న మాటకు ఆదర్శమై నిలచినవారే. ఇద్దరూ వేదోద్ధరణాసక్తులే. ఇద్దరూ అద్వైతానుభూతిలో ఓలలాడినవారే.,
ఏ మహిమ జరిగినా మహత్తు జరిగినా, మరణశయ్య మీదున్నవాడు లేచి కూచున్నా, ఈ వ్యాధికి చికిత్స లేదు అని డాక్టర్లే చేతులెత్తేసిన భయంకర వ్యాధు ఓ చిటికెడు విభూది తోనో, కుంకుమతోనో, చెంచాడు. తీర్థం తోనో నయం చేసి, అబ్బే నాదేముంది మీ విశ్వాసం అటువంటిది అనో, అలా జరగవలసి ఉందనో, మీ యెడల ఈశ్వరేచ్ఛ అలా ఉందనో చెప్పి, తమ కర్తృత్వాన్ని అంగీకరించని విరాగులే! ఇంతకూ ఈ ఉపోద్ఘాతం, ఈ పోలికలు ఎందుకు చెపుతున్నానంటే:
స్వర్ణోత్సవాల తర్వాత 1975 ప్రాంతంలో అమ్మ అనేక ప్రదేశాలు పర్యటించి వాత్సల్య యాత్రలు చేసింది. అందులో భాగంగానే మదాసు సోదరుల కోరిక మేరకు మద్రాసు వెళ్ళింది. హేమమాలిని కల్యాణ మండపంలో వేలాది మందికి దర్శనమిచ్చింది. అక్కడ నుంచి తిరువణ్ణామలై లోని రమణస్థాన్ వెళ్ళి ప్రఖ్యాత రచయిత చలం గారికి దర్శనమిచ్చింది వారింట్లో. ఆశ్రమ నిర్వాహకుల ఆహ్వానం మీద రమణాశ్రమం కూడా దర్శించింది. తిరుగు ప్రయాణంలో కంచి సమీప గ్రామం ‘కలువాయ్’ లో కంచి పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు విడిది చేసి ఉన్నారని తెలిసి కలువాయ్ లో ఆగింది అమ్మ పరివారం. అమ్మ రాకను గురించి ముందుగానే తెలియపరచారు. సమయం రాత్రి 11-30 అయింది. పెద్దస్వామి వారి గురించి అడిగితే – వారు విశ్రాంతి తీసుకుంటున్నారు. ‘ఇప్పుడు వారిని చూడటం కుదరదు’ అని చెప్పారు అంతేవాసులు . కాస్సేపటికి అమ్మ పరివారమంతా తిరుగు ప్రయాణమై కార్లలో ఎక్కబోతుండగా ఒక ఆశ్రమవాసి పరుగుపరుగున వచ్చి మహాస్వామి రాబోతున్నారు మీరందరూ ఉండవలసిందని చెప్పేడు. ఆ విడిది ప్రాంగణమంతా పందిళ్లు వెయ్యబడి ఉన్నాయి.. మధ్యలో ఒక వేదిక యేర్పాటు చేసి ఉంది. కరెంట్ లేని రోజులు కదా, ఒకటో రెండో పెట్రోమాక్స్ లైట్లు వెలుగుతున్నాయి.
రాత్రి సమయమనిగాని, స్త్రీ దర్శనమని గాని ఎంచక యతి నియమాల్ని పక్కన పెట్టి మహాస్వామివారు
అమ్మ దర్శనానికొచ్చారు. వచ్చి ఆ వేదికమీద నిలబడి. తమ దండాన్ని కుడి భుజం మీద మోపి, అది జారకుండా.. తల ఆ దండానికి ఆన్చి, రెండు చేతులూ జోడించి తదేక దృష్టితో అమ్మను చూస్తూ నిలబడిపోయారు. అమ్మ కూడా వారినే చూస్తూ ఉండిపోయింది. 13 వ యేట సన్యసించినది మొదలు ఏ మానవ మాత్రులకు జగద్గురువులైన వారు నమస్కరించ లేదని అంటారు. మాటలు లేని, మాటలకందని ఆ దివ్యానుభూతిలో పదిహేను నిముషాలు గడిచి పోయాయి.
శబ్దమే కాదు నిశ్శబ్దం కూడా బ్రహ్మమే అని కదా అమ్మ వాక్యం. ఆ బ్రహ్మస్థితిలో ఇద్దరూ లీనమైన భాషాతీత భావాతీత దివ్య క్షణాలు ! వారి మౌనం నుండి ప్రసారమైన సందేశమేదో వారికే ఎరుక. ఇక స్వామి కదిలేలా లేరని అమ్మే బయలుదేరింది !