“భూదేవి రూపంలో సమస్త జగత్తునూ ధరిస్తోంది శ్రీమాత, ధాత్రి అంటే పోషించేది అని అర్థం. సమస్త జగత్తునకూ స్థితి కారకురాలు, గోపి, గోవిందరూపిణి అయిన శ్రీమాత – ‘జగద్ధాత్రి’. ఈ ధాత్రి పదానికే తెలుగులో దాది అని పేరు” – భారతీవ్యాఖ్య,
జగన్మాత అయిన శ్రీమాత ‘జగద్ధాత్రి’. అంటే సమస్త జగత్తునూ ధరించే తల్లి. జగత్ ధాత్రీ – అంటే సమస్త జగత్తునూ పోషిస్తోంది అని కూడ అర్థం. జగత్తే తాను అయిన తల్లి, జగత్తును ధరిస్తూ పోషిస్తూ ఉన్నది. సకల చరాచర సృష్టికి తల్లి ఆమె. చిన్న చీము మొదలు అతి స్థూలమైన ఏనుగు వరకు గల సకలప్రాణికోటికీ ఆహారం అందిస్తూ పోషణ భారం వహిస్తున్న తల్లి. చిన్న గడ్డిపోచ మొదలు ఊడలమర్రి వరకు గల సకల వృక్షజాతినీ పెంచి, పోషిస్తున్న తల్లి కనుక ఆమె ‘జగద్ధాత్రి’.. సృష్టికర్తి, గోప్తి అయిన శ్రీమాత జగద్ధాత్రి.
“అమ్మ” – జగద్ధాత్రి
‘భూకంపం ఎలాగున్నదమ్మా?’ అని ప్రశ్నించిన ఒకరితో “భూమి అంతా కదిలి కదలి వచ్చి గుండెల్లో కూర్చున్నట్లుంది కదూ!” అని భూకంపాన్ని వివరించిన “అమ్మ” జగద్ధాత్రి. భూమిని ధరించిన తల్లి కనుకనే భూకంపాన్ని ఆ విధంగా నిర్వచించగలిగింది.
‘పొట్టిదానవు కదూ! భూమికి జానెడు ఎత్తున ఉంటా అని చిదంబరరావు తాతగారు అంటే – “ఇంతకూ భూమికి జానెడు ఎత్తున – లోపలనా, పైనా?*అని ప్రశ్నించింది చిన్నపిల్లగా ఉండగానే “అమ్మ”. లోపల ఎట్లా ఉంటావమ్మా? పైనే…. అని తాతగారంటే, “మరి ఇందాక భూమి మీద జానెడు ఎత్తు అనలేదుగా. భూమికి జానెత్తున అన్నారు. నా మీద భూమి ఉన్నట్లుగా ఉంది మీ మాట” అని ప్రత్యుత్తరం ఇచ్చింది “అమ్మ” అంత చిన్న వయస్సులోనే భూభారం అంతా మోసే తల్లిగా అవ్యక్తంగా తెలియచేసింది “అమ్మ”. ఆనాడు చిన్నపిల్ల మాటగా అప్పటి పెద్దలు తలపోసినా, ఆ వాక్యంలోని ప్రతి అక్షరమూ ఈనాడు “అమ్మ” జగద్ధాత్రి అనడానికి సాక్షిగా మనకు సత్యదర్శనం కలిగిస్తోంది.
‘ఏమిటో మహారాణిగారు తీర్మానం చేస్తున్నారే.. – అని వెంకట సుబ్బారావు తాతగారంటే, వెంటనే చిన్నపిల్ల అయిన “అమ్మ”ఏమాత్రం తడుము కోకుండా, నిశ్చయంగా, నిశ్చలంగా, నిర్ద్వంద్వంగా “నేను మహారాణిని గాడు తాతగారూ! “సర్వసృష్టికారిణిని” అని ప్రకటించింది. ముద్దులు మూటగట్టే పసిప్రాయంలోనే తాను “సర్వసృష్టికారిణిని” అని ప్రకటించిన ‘బాల’ “అమ్మ”. ఎప్పుడైతే “సర్వసృష్టికారిణి’గా “అమ్మ” ప్రకటించిందో, అప్పుడే పోషణ బాధ్యతను కూడా చేపట్టిన ‘గోపి’ అయింది. అంటే ‘జగద్ధాత్రి’ – అన్నమాటేగా.
జిల్లెళ్ళమూడిలో జరిగే నిరతాన్నదానం గురించి, ఎలా జరుగుతున్నది? అని ఎవరు ఆశ్చర్యం ప్రకటించినా, “అమ్మ”-“దీన్ని గురించి ఆలోచించే పనిలేదు. అంటే అంతటా పెట్టేది నేనైనపుడు ఇక్కడ గురించి ఆలోచనే “లేదు” అని జవాబిస్తుంది. అంటే మన ఇంట్లో మనం తినే అన్నమైనా, మన బంధువుల ఇంట్లో తింటున్నామని అనుకుంటున్నదైనా లేదా హోటల్లో డబ్బు లిచ్చి భోజనం చేసినా, ఎక్కడైనా, ఎప్పుడైనా ఆ ఆహారం “అమ్మ” మనకు అనుగ్రహించిన ప్రసాదమే తప్ప, వేరొకటి కాదు. “ఇక్కడి వాళ్ళే కాదు. దూరంగా ఉన్న వాళ్ళు కూడా నాకు బిడ్డలే. నేను అందర్నీ చూసుకోవలసిందే కదా! పొలం వెళ్ళిన వాడికి సమయానికి అన్నం అందించాలా? వాడికి పంపకపోతే ఎలా?” అనే ‘అమ్మ’ మాటల్లో ఈ విషయమే మరింత స్పష్టంగా వ్యక్తమవుతుంది. “విశ్వజనని” మాసపత్రికలో కొన్ని సంవత్సరాల క్రిందట ఒక అన్నయ్య వ్రాసిన వ్యాసంలో, విదేశాల్లో ఉంటున్న ఆయనకు, తన ‘రూంమేట్స్’ ఊళ్ళో లేని సమయంలో జ్వరం తీవ్రంగా వచ్చి బాధపడుతూ, నీరసం వల్ల బయటకు వెళ్ళి అన్నం పరిస్థితి లేక “అమ్మ”ను ప్రార్థిస్తూ ఉంటే కాలింగ్ బెల్ మ్రోగిందిట. కదలలేక, కదలలేక లేచి వెళ్ళి తలుపుతీస్తే, ప్రక్క ఇంటిలో ఉండే విదేశీవనిత ఆహారం పళ్ళెంతో నిలబడి ఉందిట. ఆమెతో అంతకు పూర్వం పరిచయం లేని ఆ అన్నయ్య “అమ్మ” అనుగ్రహించిన ఆ ఆహారాన్ని స్వీకరించి, నీరసం నుంచి తేరుకున్నారట. ఇది జగద్దాత్రి అయిన “అమ్మ”కు మాత్రమే సాధ్యం.
మానవులమైన మన మీదే కాదు; పశుపక్ష్యాదులపై, క్రిమికీటకాలపై “అమ్మ”కు మక్కువ ఎక్కువే. వాటిని కూడా రక్షించి, పోషించిన తల్లి. ప్రాణావసాన దశలో ఉన్న పెద్దకుక్కకు తానే స్వయంగా వెళ్ళి, సేవలందించి, దాన్ని సురక్షిత ప్రదేశానికి చేర్చమని ఆదేశించిన తల్లి. పెద్దదై పోయి, ఓపిక లేని ముసలి ఎద్దుచేత భూమిని దున్నించుకోవాలనుకున్న వ్యక్తిని మందలించిన తల్లి. “శుష్కించిపోయి, వేసిన మేత తినే స్థితిలో కూడా లేదు. పిచ్చిముండ….” అని ప్రేమతో జాలి కురిపించిన తల్లి. చిన్నతనంలోనే కాకి పిల్లలను, కోకిలమ్మను చేరదీసి, లాలించిన మాతృమూర్తి. చిన్నతనంలోనే తన వంతు ఆహారాన్ని ప్రతిదినం తల్లిపందికి పెట్టి, ఆ తల్లీ, పిల్లలకు పోషణ నందించిన “ఆబ్రహ్మకీటజనని”.
‘ధాత్రి’ అంటే తెలుగులో ‘దాడి’ అని అర్థం పూజల నందుకుంటూ మన ఆరాధ్యదేవత అయిన “అమ్మ” కొన్ని కొన్ని సమయాల్లో తన బిడ్డలకు సేవలందించిన తల్లి. అవసరమైతే పురుడు పోసి మంత్రసాని కాగలదు. ఎంతోమంది రోగగ్రస్తులను చేరదీసి, ఆదరించి, సేవలందించిన తల్లి. చిన్నతనం నుంచీ “అమ్మ”లో ఈ సేవాభావం వ్యక్తమయింది. “అమ్మ” సేవలందుకుని తరించిన అదృష్టశాలి ‘రహి’. కాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అత్తగారికి “అమ్మ”గా, కోడలుగా సేవలు చేసిన ధాత్రి. గుండేలురావు గారికీ, కోటేశ్వరరావుకీ, వెంకన్నకీ – ఇలా ఎంతమందికో తాను దగ్గరే ఉండి, సేవచేసిన ధాత్రీ శిరోమణి “అమ్మ”. స్వరూప లలిత, స్వభావ మధుర అయిన “అమ్మ” జీవిత మహోదధిలోని ప్రతి తరంగం “అమ్మ”ను జగద్ధాత్రిగా ప్రత్యక్షం చేస్తుంది.
ఈ శరన్నవరాత్రులలో ఒక్కొక్క రోజూ ఒక్కొక్క అవతారంతో “అమ్మ” మనకు కన్నుల పండుగ చేస్తుంది. కాళికాదేవిగా, దుర్గాదేవిగా రౌద్రాకారంతో కరోనా రక్కసిని కాలరాచి, బాలాత్రిపురసుందరీదేవిగా, శ్రీ లలితాత్రిపుర సుందరీదేవిగా ప్రేమతో తన బిడ్డలను రక్షించి, శ్రీ మహాలక్ష్మిగా తన పిల్లలకు సకల సంపదల నొసగి, శ్రీ సరస్వతీదేవిగా తన సంతానానికి జ్ఞానభిక్షను అనుగ్రహించి, అన్నపూర్ణాదేవిగా తన పిల్లల పోషణకై అన్నం ప్రసాదంగా పంచి, శ్రీ అనసూయాదేవిగా తన పాపలను లాలించి, శ్రీ రాజరాజేశ్వరీదేవిగా తన సంతానానికి సకల శుభాలను కలిగించాలని మనసారా “అమ్మ”ను వేడుకుంటూ, ఆతల్లి చరణారవిందాలకు నా శతకోటి నమస్సుమనస్సులను సమర్పించుకుంటున్నాను.
అర్కపురిలోని అందరింటిలో, అనసూయేశ్వరాలయ అధిష్ఠాత్రి అయిన మాతృశ్రీ అనసూయాదేవిని జగద్ధాత్రిగా దర్శించి, స్మరించి, భజించి, తరించుదాం.
. మన జయహోమాతా!