కదిలింది కదిలింది జగన్నాథ రథం
మెదిలింది మెదిలింది మానవాళి హృదయం
అల్లంత దూరాన మసులుతోంది మరో ప్రపంచం
చీకటి కోణాలు దూసుకొని ప్రసరిస్తోంది.
కాంతికిరణం
ఆరిపోతున్న ఆశాజ్యోతులు వెలిగిస్తున్నా రెవరో
రెండు చేతులు చాచి రమ్మంటున్నా రెవరో
ప్రజ్ఞానం బ్రహ్మయితే
అజ్ఞానమో అంటోంది విజ్ఞానం
వర్గం లేనిది స్వర్గం అంటోంది అద్వైతం
కాలం విధించిన శాపం కరిగిపోతోంది.
జన్మల శృంఖలాలు వీడిపోతున్నాయి.
ప్రారబ కర్మల మలినం క్షాళనం అవుతోంది
మూర్ఖపు నమ్మకాలు రథ చక్రాలక్రింద
నలిగిపోతున్నయ్
కదిలింది కదిలింది జగన్నాథ రథం
పాప పుణ్యాల బలిపీఠం బ్రద్దలైంది.
చిత్రగుప్తుడి ఖాతా చిరిగిపోయింది.
విలవిల లాడుతున్నారు దేవుడి ఏజంట్లు
వెలివేసిన మానవుడ్ని దేవుడ్ని కన్న
‘అమ్మ’ ఒడిలోకి తీసుకొంది.
కదిలింది కదిలింది జగన్నాధ రథం
విశ్వమానవుడు శంఖారవం చేస్తున్నాడు.
వాత్సల్య జలధిపై నృత్యం చేస్తున్నాడు.
ఉదయ భానుడు
నేడే మానవ చరిత్రకు మహోదయం
నేడే విశ్వమంతా వసంతోత్సవం
శతసహస్రకోటి గొంతుకలు ‘అమ్మా’ అని
పిలుస్తూన్నయ్
అవనినంతా నిండిన ‘అమ్మ’ అంటోంది.
– ఓయ్
పేరు పేరునా పంచుతోంది సుగతి ప్రసాదం
వడి వడిగా సాగిపోతోంది జగన్నాధ రథం.