- అన్నపూర్ణాలయం
జిల్లెళ్ళమూడిలో అమ్మ స్వయంగా నెలకొల్పిన వ్యవస్థలలో ప్రముఖమైనది అన్నపూర్ణాలయం. సాధారణంగా ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ప్రసిద్ధి ఉంటుంది. జిల్లెళ్ళమూడి అనగానే ఎవరికయినా స్ఫురించేది అన్నపూర్ణాలయం. కారణం ఇక్కడ జరిగే నిరతాన్నదానానికి అమ్మ ఇచ్చిన ప్రాముఖ్యం అటువంటిది. తన వద్దకు వచ్చే అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అమ్మ తన ఇంటికి పెట్టిన పేరు అందరిల్లు. ఈనాడు వర్గాలుగా వర్ణాలుగా విడిపోతున్న సమాజాన్ని వాత్సల్యబంధంతో ముడివేసి వర్గంలేని స్వర్గంగా రూపొందించాలని అమ్మకోరిక. దానికి ఆచరణ రూపమే అందరిల్లు. అక్కడ వర్ణ వర్గ వయోభేదం లేకుండా అందరూ సభ్యులే. ఆ అందరింటిలో ప్రధాన భాగమే అన్నపూర్ణాలయం. ఇది అమ్మ వాత్సల్యానికి ప్రతిరూపం. అమ్మ అనురాగ ప్రసారానికి ప్రధాన కేంద్రం.
బాల్యం నుంచే అమ్మలో ఎదుటివారి ఆకలిని తీర్చడానికి ఆరాటపడే గుణం కనిపించేది. ఇంట్లో తనకు పెట్టిన అన్నాన్ని బిచ్చగాళ్లకు, ఆకలిగొన్నవారికి, పశుపక్ష్యాదులకు పెట్టేది. అలా పెట్టడంలో అంతులేని సంతృప్తిని పొందేది. అమ్మకు నాలుగేళ్ళ వయస్సులో ఒకసారి ఒక సత్రంలో అనేకమంది కలిసి భోజనం చేయడం చూసింది. ఆ క్షణంలోనే అమ్మ మనస్సులో ఒక ఆలోచన కల్గింది. సర్వులకూ స్వతంత్రమయిన ఒక భోజనశాలను ఏర్పాటుచేయాలనీ, అందరూ ఒకే చోట ఉంటూ ఒకేచోట తింటూ ఉంటే ఎంత బాగుంటుందని. ఆ తరువాత అమ్మ ఏర్పరచిన అన్నపూర్ణాలయానికి సంకల్పం ఆనాడే జరిగింది.
వివాహమై అమ్మ జిల్లెళ్ళమూడి వచ్చిన తరువాత అమ్మను దైవంగా, ఆరాధ్యమూర్తిగా దర్శించే బిడ్డల సంఖ్య నానాటికీ పెరిగింది. వారందరికీ నాన్నగారింట్లోనే కాఫీ ఫలహారాలూ, భోజనాలూ అమ్మే అందరికీ చేసి పెట్టేది. ఇలా అందరికీ వండి వడ్డించటంలో అమ్మకు విసుగూ విరామమూ ఉండేది కాదు. కాలక్రమేణ వచ్చిపోయే వారి సంఖ్య పెరగసాగింది. 1957 చివరలో చీరాల నుండి చాలా కుటుంబాలు జిల్లెళ్ళమూడి రావడం మొదలైంది. వారికి ఉన్నన్ని రోజులు నాన్నగారింట్లోనే భోజన వసతి సౌకర్యాలు నాన్నగారు, శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావుగారు, జిల్లెళ్ళమూడి గ్రామకరణం గారు, తాము నాన్నగారికి భారం కాకూడదనే ఉద్దేశంతో వాళ్లు వస్తూ వస్తూ కూరగాయలు మొదలైన సంభారాలు తీసుకు వచ్చేవారు. వద్దని నాన్నగారు మందలించడం జరుగుతూ ఉండేది.
పరిస్థితులలో కొందరు సోదరులు వేరే వంట ఏర్పాటుకు అమ్మ నుండి అనుమతి పొందారు. అమ్మ కూడ నాన్నగారి అనుమతి కోరుతూ “రెక్కలు వచ్చిన కొడుకులు రెక్కలు రాని వాడి కోసం చేసే ఏర్పాటు. ఇందులో బాధపడవలసిన అవసరం ఏమీ లేదు. ఎదిగి వచ్చిన పిల్లలు వాళ్ల ఏర్పాటు వాళ్లు చేసుకుంటా మంటున్నారు. ఈ ఏర్పాటులో ప్రేమకు కొరత ఏమీ రాదు. అంతేకాదు. ఇది జగన్నాథరథం, కదిలితే ఆగదు. దేని వాడు దానికి వస్తాడు” అని నచ్చ చెప్పింది. ఆ విధంగా 1958 ఆగష్టు 15వ తేదీ విళంబి నామ సంవత్సర శ్రావణ శుద్ధపాడ్యమి నాడు ఈ ఏర్పాటుకు విశ్వజనని అమ్మ శ్రీకారం చుట్టింది. అలా ప్రారంభమయిన ఈ వ్యవస్థకు ‘అన్నపూర్ణాలయం’ అని నామకరణం చేసింది అమ్మ.
సాధారణంగా ఆలయం అనగానే ఒక అర్చామూర్తి (విగ్రహం), అర్చన, ధూపదీప నైవేద్యం మొదలయిన ఉపచారాలు జరుగుతూ ఉంటాయి. ఏ విగ్రహం, ఏ మూర్తి లేని ఆలయం అన్నపూర్ణాలయం. ఇక్కడ ప్రత్యేకించి ఏ అర్చనా కనిపించదు. అన్నపూర్ణా దేవి విగ్రహం కాని, అన్నపూర్ణేశ్వరి అమ్మ విగ్రహం కానీ ఏమీ ఉండవు. ‘విగ్రహరూపంలో ఉన్న పరమాత్మను సేవించటమే కాదు, సర్వప్రాణి రూపంగా ఉన్న దేవుణ్ణి ప్రేమించి సేవించగలిగితే మానవుడిలోనే మాధవుడిని దర్శించవచ్చు’ అని సాక్షాత్తూ విష్ణుస్వరూపుడైన కపిల మహర్షి పలికిన మాటలు.
దానికి ఆచరణ రూపమే అన్నపూర్ణాలయంలో జరిగే నిరతాన్న దాన కార్యక్రమం. అందరూ కలిసి భోజనం చేయడం, ఆకలి గొన్న వారి ఆకలిని తీర్చడం అనేవి అన్నపూర్ణాదేవికి అసలైన అర్చన అని అమ్మ అభిప్రాయం. అందరికీ అన్నం పెట్టే ఈ ప్రదేశం కేవలం భోజనశాల కాదు, అన్నసత్రం కాదు. ఇక్కడ మానవ సేవ రూపంలో దైవారాధన జరుగుతుంది అని మనకు తెలియచేయడానికి అన్నపూర్ణాలయం అని నామకరణం చేసింది అమ్మ.
అన్నపూర్ణాలయం ప్రారంభమైననాడు అమ్మ ఒక ప్రకటన చేసింది. “1947 ఆగష్టు 15 దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజయితే 1958 ఆగష్టు 15వ తేదీ ప్రపంచ పౌరులందరికీ స్వాతంత్య్రం ప్రసాదించిన పుణ్యదినం” అని. ఏ దేశం వారయినా, ఏ కులం వారయినా, ధనికులయినా పేదలయినా, వర్ణ వర్గ వయోభేదం లేకుండా పరిమితులకు పరిధులకు అతీతంగా సమయ నియమం లేకుండా అందరూ కలిసి స్వతంత్రంగా భోజనం చేయకల్గిన ఏకైక ప్రదేశం అన్నపూర్ణాలయం. కొందరు పాత్ర సామాగ్రిని సమకూర్చితే మరికొందరు వండి వడ్డించేందుకు స్వచ్ఛందంగా ముందుగా వచ్చారు.
‘అన్ని బాధల కంటే ఆకలి పెట్టే బాధ భరించటం కష్టం నాన్నా!’ అన్న అమ్మ 1940 లోనే గుప్పెడు బియ్యం పథకం ప్రవేశపెట్టింది. మహిళలు రోజూ వంట చేసే ముందు ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి ఒక చోట నిల్వచేయడం, అలా సమకూర్చిన బియ్యాన్ని అవసరానికి అన్నార్తుల ఆకలిబాధలను తీర్చడం. ఇలా ఎవరూ ఆకలితో ఉండకుండా అన్నం తినడానికి వీలుగా అమ్మ ఆలోచన చేయడమే కాక ఆచరణలో పెట్టింది.
ఒకసారి ఒక జ్యోతిష్కుడు అమ్మ వద్దకు వచ్చి ఏదైనా ప్రశ్న వేయమని అడిగితే “ఈ ప్రపంచంలో ఎవరూ ఆకలితో బాధపడకుండా ఉండే రోజు రావాలి. ఏనాటి కయినా ఆకలి రూపు మాసి పోతుందా?” అని అడిగింది. ఈ విధంగా అమ్మకు ఎప్పుడూ బిడ్డల ఆకలి గురించే ఆలోచన. పసిప్రాయంలో అన్నప్రాశన కూడ జరగని అమ్మకు ఎంతసేపటికీ అందరికీ అన్నం పెట్టుకోవడమే కార్యక్రమం. అన్నపూర్ణాలయంలో భోజనం ఎవరికి పెట్టాలి అని అమ్మను అడిగితే, డ్రస్, అడ్రస్ చూడకుండా ఆకలే అర్హతగా పెట్టమని ఆదేశించింది. భావాలు కలిసిన పదిమంది నిస్స్వార్థంగా సమష్టి ప్రయోజనం ఆశించి ఏ పని చేసినా అది యజ్ఞం. అందుకే నిరంతరంగా సాగే ఈ అన్నదాన కార్యక్రమానికి అమ్మ మాతృయాగం అని పేరు పెట్టింది.
ఒకసారి వరంగల్ నుంచి వచ్చిన కొందరు సోదరులు హెూమం చేసుకుంటూ అమ్మను హెూమంలో నెయ్యి వెయ్యమని అడగగా “నాన్నా! ఈ యజ్ఞాలూ యాగాలూ నాకు తెలియవు. నేను ఏమి వేయవలసి వచ్చినా గాడిపొయ్యిలోనే వేస్తాను” అన్న అమ్మ దృష్టిలో అన్నపూర్ణాలయ నిర్వహణే మహాయజ్ఞం. “మీకు కోరికలు లేవా?” అని ఒకరు అడిగతే “ఎందుకు లేవూ, మీకు పెట్టుకోవాలనుకోవడం కోరికే కదా!” అని అమ్మ సమాధానం. తన వద్దకు వచ్చిన వారిని మొదటగా అమ్మ అడిగే ప్రశ్న ‘అన్నం తిన్నావా’ అని. తిని వచ్చానమ్మా అంటే “కొద్దిగానైనా తిను, నాన్నా! ప్రసాదం కదా!” అని బుజ్జగించేది. పూజ చేసుకోవాలమ్మా అని ఎవరయినా అంటే ముందు అన్నం తిని రండి తరువాతనే పూజ అంటుంది అమ్మ. తాను మాట్లాడలేనంత అస్వస్థతలో ఉన్నా ‘అన్నం తిను, నాన్నా!’ అని సైగద్వారా తెలిపే దృశ్యం మన హృదయాన్ని కదిలించి వేస్తుంది.
1962 సంవత్సరంలో ఒక స్వామీజీ అమ్మ వద్దకు వచ్చారు. వారిని అమ్మ భోజనం చేసి వెళ్లమన్నది. వారు చీరాల వెళ్ళి అక్కడ చేస్తానన్నారు. ‘అక్కడ తయారు చేయాలిగా, నాన్నా!’ అంటే వారు ‘మేము వెళ్లగానే చేస్తారమ్మా’ అన్నారు. “అక్కడ తయారు చేయాలి. ఇక్కడ తయారయ్యే ఉంది” అంటూ ఏ విధంగా నయినా అన్నపూర్ణాలయంలో భోజనం చేయించడమే అమ్మ ఏకైక లక్ష్యంగా కనిపిస్తుంది. “ఎవరయినా జిల్లెళ్ళమూడికి ఆకలితో రావచ్చు గానీ జిల్లెళ్ళమూడి నుండి ఆకలితో పోకూడదు” అన్నది అమ్మ సిద్ధాంతం.
అమ్మకు 50 వసంతాలు పూర్తయి స్వర్ణోత్సవం సందర్భంగా బిడ్డలందరూ కలిసి ‘జన్మదిన కానుక ఏం కావాలమ్మా!” అని అమ్మను అడిగితే లక్షమంది ఒకే పంక్తిలో భోజనం చేయాలనీ, ఆ మనోహర దృశ్యం తాను చూడాలనీ అమ్మ తన కోరికను వ్యక్తం చేసింది. ఒకే పంక్తిలో లక్షమంది భోజనం చేయడమనే ఉత్సవం ‘న భూతో న భవిష్యతి’ అన్నంత వైభవంగా జరిగింది; అది అన్నపూర్ణాలయ చరిత్రలో సువర్ణాధ్యాయం. “లక్షమందిలో ఏ ఒక్కరు భోజనం చేయకపోయినా బాధగానే ఉంటుంది; నాన్నా! తృప్తిగా తిన్న లక్షమంది అందించే ఆనందం కన్న ఈ బాధ బరువైనది” అన్నది అమ్మ.
- (సశేషం)
2022 డిసెంబరు, 2023 జనవరి నెలలలో జిల్లెళ్ళమూడి కార్యక్రమాలు
డిసెంబరు, 2022: 12-12-2022: వాత్సల్యాలయములో రాత్రి 9 గం॥కు అమ్మనామ సంకీర్తన – మహాహారతి.
13-12-2022: ఆశ్లేషా నక్షత్రము “అమ్మ” వ్రతము “అమ్మ” నామ ఏకాహము;
14-12-2022: బహుళ షష్ఠి, శ్రీ హైమవతీ వ్రతము
16-12-2022: నుండి ధనుర్మాస పూజలు
19-12-2022: బహుళ ఏకాదశి అనసూయావ్రతము “అమ్మ” నామ ఏకాహము
జనవరి, 2023
01-01-2023: నూతన ఆంగ్ల సంవత్సరాది
02-01-2023: శుద్ధ ఏకాదశి శ్రీ అనసూయా ముక్కోటి ఏకాదశి
06-01-2023: పూర్ణిమ – శ్రీ హైమనామ ఏకాహము
11-01-2023: బహుళ చవితి – సంకష్ట హర గణేశ హెూమము నామ ఏకాహము
14, 15, 16 సంక్రాంతి పండుగలు
15-01-2023: సౌరహోమము.