2021 ఏప్రియల్ 28, 99వ జయంతి
సృష్టిలోని ప్రతి ప్రాణినీ తన బిడ్డగా లాలించడం కన్నా ఆధ్యాత్మికత ఏముంటుంది? కుల, మత, వర్ణ, లింగ, వయోభేదాలేవీ లేకుండా అందరి ఆకలిని తీర్చడం కంటే ఆత్మజ్ఞానం మరేముంటుంది? పాపపుణ్యాలు, సుగతి దుర్గతుల ప్రస్తావనే లేకుండా మానవసేవనే మాధవసేవగా భావించడం కన్నా మోక్షప్రాప్తి ఇంకేం ఉంటుంది?
ఎక్కిరాల భరద్వాజ మాస్టారు ఆమెను ఆదిపరాశక్తి అన్నారు. సిద్ధేశ్వరానందభారతిమహాస్వామి వారు ఆమెను చండీదేవిగా స్తుతించి దివ్యజనని అన్నారు. ఆచరణాత్మక ఆధ్యాత్మికతతో స్వయంప్రకాశమానమూర్తి జిల్లెళ్లమూడి అమ్మ. కొండముది రామకృష్ణ రచన ‘మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు’, శ్రీపాద గోపాల కృష్ణమూర్తి గ్రంథం ‘అమ్మను గురించి’, పొత్తూరి వేంకటేశ్వరరావు పుస్తకం ‘అంతా ఆమె దయే’, మార్వా హెంఫెల్ రచన ‘ఏ గ్లింప్స్ ఆఫ్ మదర్’, రిచర్డ్ షిఫ్మన్ కృతి ‘మదర్ ఆఫ్ ఆల్’… వంటి అనేక గ్రంథాలు అమ్మ వైభవాన్ని వేనోళ్ల చాటుతున్నాయి.
గుంటూరు జిల్లా పొన్నూరు తాలూకా మన్నవ గ్రామంలో మన్నవ సీతాపతిశర్మ, రంగమ్మ దంపతులకు 1923 మార్చి 28, చైత్రశుద్ధ ఏకాదశి, బుధవారం అనసూయమ్మ జన్మదినం. యోగమూ, పరమార్ధమూ ఆమెకు జన్మతః అబ్బాయి. ఏడాదిన్నర వయసులోనే ఆసనాలు వేస్తూ ముద్రలు పట్టేది. పసివయస్సులో వచ్చీ రాని మాటలతోనే తల్లి రంగమ్మతో పూజా విధానాలు, చావుపుట్టుకల వంటి అంశాలు తరచు ముచ్చటించేది. 1927లో కుర్తాళం పీఠాధిపతి మౌనస్వామి చీరాల వస్తే, తాతమ్మ మరిడమ్మతో పాటు వెళ్లి, ఏకాంతంగా తత్త్వగోష్ఠి చేసింది. ఐదేళ్ల అనసూయ మనుషులకే కాక, పశుపక్ష్యాదులకు కూడా ఆహారం పెడుతూ ఉండేది. ఎదుటి వారి అవసరాలకు తన ఒంటిపై ఉన్న నగలను తీసి ఇచ్చేస్తూ ఉండేది. అద్భుత జ్ఞాపకశక్తితో అన్ని విషయాలను గుర్తుంచుకునేది. పసిప్రాయం నుంచే ఆపన్నులకు ప్రసాదంగా అన్నం, ఇతర పదార్థాలు పెట్టేది. తాను పరబ్రహ్మంలో తరిస్తున్నా బ్రహ్మచారిణిగా మిగిలిపోలేదు. మానసికంగా వైరాగ్యంలో చరిస్తున్నా – సన్యాసం స్వీకరించలేదు.
గుంటూరు జిల్లా బాపట్ల తాలూకాలోనే ఓ చిన్న గ్రామం జిల్లెళ్లమూడి. ఆ గ్రామ కరణం బ్రహ్మాండం నాగేశ్వర రావుతో 1936 మే 5న అనసూయ వివాహం జరిగింది. ఆ దంపతులకు సుబ్బారావు, రవి అనే ఇద్దరు కుమారులు, హైమ అనే కుమార్తె కలిగారు. గృహస్థాశ్రమంలో భార్యగా, తల్లిగా తన ధర్మాలను నిర్వర్తిస్తూ, ఇంటినే ఒక సామాజిక కేంద్రంగా మలుచుకున్నారామె. మడి, మైల వంటి ఆంక్షలను పట్టించుకోకుండా తన దరికి వచ్చిన అందరికీ అమ్మ తానే స్వయంగా వండి, వడ్డించేది. అత్తారింటికి వచ్చేసరికి ఊళ్లో కరవు తాండవిస్తోంది. ఆమె ధాన్యం నిల్వ చేయాలని సూచించి, దాని నుంచి అన్నార్తులకు తనే ధాన్యం ఇచ్చేది. కరువు తీరి, ధాన్యం సమకూరాక వారు తిరిగి ధాన్యాన్ని నిల్వకు అప్పగించేవారు.
1958 ఆగస్టు 15న అన్నపూర్ణాలయాన్ని అమ్మ లాంఛనంగా ప్రారంభించింది. చిన్న గ్రామమే అయినా నేటికీ రోజూ దాదాపు 1200 మందికి అక్కడ అన్నవితరణ జరుగుతోంది. పగలు, రాత్రి అనే తేడా. లేకుండా ఇక్కడ అన్నం లభిస్తుంది. 1973 లో అమ్మ 50వ జన్మదినోత్సవ సందర్భంగా ఒక్కరోజే ఒకే పంక్తిన లక్షా ఇరవై వేలమందికి అన్నవితరణ జరిగింది. 2007- 2008లో అన్నపూర్ణాలయ స్వర్ణోత్సవాల సందర్భంగా జైళ్లు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, దివ్యాంగ పాఠశాలలు, ఆస్పత్రుల వంటి పలుచోట్ల కూడా అన్నప్రసాదాన్ని పంచారు. అన్నవితరణలో పాల్గొనడం అక్కడ కర్మయోగంలో ఒక భాగం.
1977లో తుపాను కారణంగా పశువుల మృత కళేబరాలతో జిల్లెళ్లమూడి భీతావహంగా మారితే, ఆ అనారోగ్య వాతావరణంలో కూడా సేవాకార్యక్రమాలను మానలేదు. మాతృశ్రీ విద్యాసంస్థలతో పేద విద్యార్థులకు నేటికీ విద్యాదానం జరుగుతోంది. సహనం అమ్మకు సహజభూషణం. మత్సరగ్రస్తుడైన ఒకడు వంటశాలలో -మలవిసర్జన చేశాడు. ఉడికే అన్నంలో ఉమ్మివేయడం వంటి అనాచారాలకు పాల్పడ్డాడు. ఇంకో వ్యక్తి పల్లేరు కాయలతో, ఉమ్మెత్త కాయలతో, దురదగుంటాకుతో అమ్మను పూజించాడు. వేడివేడి పాలు తెచ్చి అమ్మను అభిషేకించిన వారున్నారు. అమ్మ ఆశ్రమం మీద దాడికి పాల్పడిన నక్సలైట్లను సైతం ‘వాళ్లూ నా బిడ్డలే’ అంటూ ఆదరించిన అమ్మ ప్రేమ అనుపమానం. రచయిత చలం రమణాశ్రమంలో మంచం మీద ఉంటే వెళ్లి, ఆప్యాయంగా పలకరించిన అమ్మను చూసి, “ఏడిరా నీ ఈశ్వరుడు అని అంటే ఇదిగో ఈవిడే అని సులభంగా చెబుతాను” అని చెప్పుకున్నారాయన. 1968లో కుమార్తె, 1981లో భర్త శరీరం వదిలితే ఆలయ ప్రవేశం చేయించింది.
అంతా తన బిడ్డలేననీ, తనకు భక్తులెవరూ లేరనీ చెప్పిన ఆమెతో కొద్ది నిమిషాలు జరిగిన ఇష్టాగోష్టే చాలు, వారి అంతరంగంలో అద్భుతమైన మార్పులు వస్తుండేవి. ఈ రోజుకీ ఆమె గురించిన పుస్తకాలు చదివినా, ఆమె మాటలను చదివినా అనన్య సాధ్యమైన ఆధ్యాత్మిక వికాసం కలగడం ఎంతోమందికి అనుభవైకవేద్యం. అమ్మ తన
సమక్షంలో ఎన్నో వివాహాలు జరిపించారు. కొడుకులు లేని శాస్త్రవేత్త శ్రీపాద గోపాలకృష్ణమూర్తి మరణిస్తే ఆయన – కుమార్తె గాయత్రి చేతనే తలకొరివి పెట్టించి, కర్మకాండ జరిపించారామె.
అమ్మ జీవితంలో జరిగిన అలౌకిక ఘటనలు గ్రంధస్థం కావలసినవి ఇంకా కోకొల్లలు. అమ్మ నగలను అమ్మేసుకున్న ఓ బిచ్చగాడు పాము కరచి మరణించాడు. అమ్మ చేతి దివ్యస్పర్శతో అతడు తిరిగి బతకడం చూసిన వాళ్లు మాత్రమే నమ్మగలిగిన సంఘటన. గొంతు అల్సర్తో బాధపడుతున్న దినకరుకు గోధుమ హల్వా తినిపించాక ఆ రుగ్మత ఎటుపోయిందో తెలియదు.
జీవితకాలమంతా ఆమె మాటలు వేద ఘోషకు ప్రతిరూపాలుగానే వెలువడ్డాయి. ‘మాతృశ్రీ జీవిత మహోదధి’ గ్రంధాన్ని పారాయణ చేస్తూ, ఆధ్యాత్మిక సాధనలో ఉన్నత స్థాయికి చేరుతున్న వారు ఈ నాటికీ ఎందరెందరో. 1985 జూన్ 12 జ్యేష్ఠ బహుళ దశమి, బుధవారం అమ్మ దేహత్యాగం చేసిన రోజు. వాక్కు. అనుగ్రహ వీక్షణ, స్పర్శ, సంకల్పం, ప్రసాదం – వీటితో జగన్మాత ప్రేమను అందించిన అమ్మ, చివరి క్షణాలలో సైతం ఎలాంటి విచారమూ లేకుండా “నేను వచ్చిన పని అయిపోయింది. ఇక నన్ను నవ్వుతూ సాగనంపండి” అని కోరారు. భారతదేశం అందించిన ఆధ్యాత్మికమైన వెలుగును 24 క్యారట్ల స్వచ్ఛతతో చూడదలచుకున్న వారికి చిరస్థాయిగా లభించే చిరునామా జిల్లెళ్లమూడి రూపంలో అందుబాటులో ఉంది.
(శ్రీ పీఠం, మార్చి 2021 సౌజన్యంతో)I