“అమ్మ” – ‘దుఃఖహంత్రి’, ‘అది ఏదైనా సరే. లేని దాని కొరకు ఆశించి, పొందలేకపోతే దుఃఖం. ఉన్నది చాలనుకునేది సుఖం” అని సుఖదుఃఖాలను నిర్వచించింది. “”అమ్మ”. ఇంత సరళంగా, సుబోధకంగా సుఖదుఃఖాలను గురించి చెప్పడం ఇంకెవ్వరికీ సాధ్యం కాదేమో! “అమ్మ” వాక్యం ఏదైనా సరే చాలా స్పష్టంగా, సూటిగా హృదయానికి హత్తుకునేలా ఉంటుంది.
“సంసార సంబంధమైన సమస్త దుఃఖాలను నశింప చేసే లలితాదేవికి ‘దుఃఖహంత్రి’ అనిపేరు. ‘దుఃఖ విముక్తి కలిగితే కాని, ఆనందం లభించదు’ అని శ్రుతివాక్యం. అజ్ఞానం దుఃఖానికి కారణం. జ్ఞాన స్వరూపిణి అయిన లలితాదేవి భక్తుల అజ్ఞానాన్ని రూపు మాపి, దుఃఖాన్ని నివారిస్తుంది. శ్రీమాత అనుగ్రహం చేత సాధకులు జ్ఞానమార్గంలో ప్రవేశించి, అజ్ఞానాన్ని తొలగించుకుని, దుఃఖనివృత్తి చేసుకుంటారు. కాయిక, వాచిక, మానసిక దుఃఖాలన్నింటినీ తొలగించగల శ్రీమాత ‘దుఃఖహంత్రి’.
– భారతీవ్యాఖ్య,
దుఃఖమంటే బాధ, విచారం, మనకు మూడు రకాల దుఃఖాలు ఉంటాయి. శరీరానికి వచ్చే రోగాది బాధలు మనకు దుఃఖాన్ని కలిగిస్తాయి. ఇవి కాయకం. ఏదైనా చెడువార్త విన్నప్పుడు మనం దుఃఖాన్ని వాగ్రూపంలో వ్యక్తం చేస్తాం. ఇది వాచికం. ఆత్మీయుల గురించి చెడువార్తలు విన్నప్పుడు మన మనస్సు ఆవేదనతో ఆక్రోసిస్తుంది. ఇది మానసికం. దుఃఖానికి కారణం అజ్ఞానం. అజ్ఞానమంటే శాశ్వతం కాని దానిని శాశ్వత మనుకుని, అది దూరమయినందుకు దుఃఖ పడడం. అజ్ఞానం తొలగితే, దుఃఖం ఉండదు. జ్ఞాన స్వరూపిణి అయిన శ్రీమాత పాదాల నాశ్రయించి, ఆరాధించే సాధకునికి ఆ తల్లి అనుగ్రహ విశేషం చేత అజ్ఞానం. తొలగిపోతుంది. దుఃఖం నశిస్తుంది. ఆనందం అనుభవంలోకి వస్తుంది. అలాంటి స్థితిని అనుగ్రహించే శ్రీలలిత ‘దుఃఖహంత్రి’.
“అమ్మ” దృష్టిలో దుఃఖం ఒక్కటే. అది శరీరానికి సంబంధించినదైనా, వాక్కుకు చెందినదైనా, ఏదైనా సరే అది మానసికమే అంటుంది “అమ్మ”. “మానసిక బాధ అంటూ ఏముందీ? ఏ బాధయినా పడేది మనస్సే. శరీర బాధను అనుభవించేదీ మనస్సే” అని చెప్పింది. ఎందుకంటే – “శరీరమూ, మనస్సూ విడదీసి లేవు” అని వివరించింది. వచ్చిన బాధో, నొప్పో శరీరానికే అయినా అనుభవించేది మాత్రం మనస్సే. అదెలా? అంటే అందుకు ప్రత్యక్ష ఉదాహరణం “అమ్మే”. జ్వరంతో బాధపడుతూ ఉన్నా, తన దర్శనం కోసం బిడ్డలు వేచి ఉన్నారని తెలిసిన మరుక్షణం – చొక్కాను చిలక్కొయ్యకు తగిలించినంత హాయిగా తన శారీరక బాధను ప్రక్కన పెట్టేసి, వారికి తన దర్శనాన్ని అనుగ్రహిస్తుంది. ఆ సమయంలో “అమ్మ” ఒంట్లో నలతగా ఉన్న విషయం అక్కడ ఉన్న ఏ ఒక్కరికీ తెలియదు. “అమ్మ” బాధ తెలిసిన వారికి కూడా ఆశ్చర్యం కలిగేలా “అమ్మ” తన్ను చూడవచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి ఆదరంగా ప్రసాదమిచ్చి, వారిని సంతృప్తి పరుస్తుంది. “అమ్మ” ! శారీరక బాధ మనస్సుకు అంటకపోవడమే ఇందుకు కారణం. మనస్సుకు బాధ ఉందీ అనుకుంటే ఉంది. లేదనుకుంటే లేదు” అంటుంది “అమ్మ”. ఇది “అమ్మ” ఏదో సాధన చేసి సాధించుకున్నది కాదు. పసితనంలోనే ఎంత అనారోగ్యంగా ఉన్నా ఎన్నడూ ఇదీ తన బాధ అన్న మాట “అమ్మ” నోట రాలేదు. జ్వరం వచ్చినా, తడపర పోసినా, కడుపులో పిండం పోయినా ఏ బాధాలేనట్లుగా మామూలుగా తిరుగుతూ ఉండే “అమ్మ”ది ‘సహజసహనం’.
ఎందరో భక్తులు (బిడ్డలు) తమ దుఃఖాలను “అమ్మ”కు విన్నవించుకుని ఉపశాంతిని పొందిన వారున్నారు. “అమ్మ” ఎన్నడూ వాళ్ళ దుఃఖం పోగొట్టగలనని గానీ, పోతుందని గానీ చెప్పలేదు. కానీ, తమ శారీరక, మానసిక బాధలు “అమ్మ”తో చెప్పుకున్న వారెందరికో, ఆ బాధలు తొలగి, వారి దుఃఖం నశించి, సంతోషించిన సందర్భాలెన్నో ! “దుఃఖహంత్రి” కదా “అమ్మ”.
“అమ్మ” అవతార పరిసమాప్తి అందరినీ దుఃఖ సాగరంలో ముంచి వేసింది. అయితే, “అమ్మే” తన సర్వస్వంగా, సర్వసమర్పణ భావంతో ఆ తల్లిసేవకు తన జీవితాన్నే అంకితం చేసిన రామకృష్ణ అన్నయ్యకు “అమ్మ” కనుమరుగు కావడం అశనిపాతమయింది.
సాకారంగా ఉన్న “అమ్మ” అదృశ్యమయిది కనుక. ఇప్పుడు “అమ్మ” సంస్థే “అమ్మ” కు ప్రతినిధి. “అమ్మ”కు చేసే పూజా కార్యక్రమాలన్నీ “అమ్మ” సంస్థలకు సేవా కార్యక్రమాలుగా మార్చుకోవాలనుకున్నారు. సృష్టికీ “అమ్మ”కూ అభేదం అన్న దర్శనం ఆయన లక్ష్యంగా మారింది. “అమ్మ”ను దుఃఖనాశినిగా దర్శించారు. అలా అన్నయ్యను దుఃఖసాగరం నుంచి బయటకు తీసి, ఆనందరసాబ్దిలో ఓలలాడించిన “అమ్మ” – ‘దుఃఖహంత్రి’.
“మన బిడ్డలలో ఏమి చూస్తున్నామో, అందరిలో దానిని చూడడమే బ్రహ్మస్థితిని పొందడం” అన్న “అమ్మ” వాక్యం లోని పరమార్థాన్ని అనుభవంలోకి తెచ్చుకో గలిగితే ఇక దుఃఖానికి ఆస్కారమేదీ? బ్రహ్మస్థితిని పొందిన తర్వాత అంతా ఆనందమే కదా!
“దుఃఖహంత్రి” అయిన “అమ్మ” కృపా విశేషం. చేత తమ దుఃఖాన్ని పోగొట్టుకుని, ఆ చల్లని తల్లి దీవెనలతో ఉపశమనం పొంది, సంతోషమయమైన జీవితాన్ని గడిపిన ధన్యజీవులు ఎందరెందరో! ప్రాణాపాయ పరిస్థితి నుంచి సునాయాసంగా తప్పించిన “ప్రాణదాత్రి”గా మరణాసన్న సమయంలో సుగతిని అనుగ్రహించిన ‘సద్గతిప్రద’గా, ‘నిర్వాణసుఖదాయిని’గా, ‘అనర్ఘ్యకైవల్యపదదాయిని’గా ఎందరినో ఆదరించి, అక్కున చేర్చుకున్న “అమ్మ” – “దుఃఖహంత్రి”గా మన దుఃఖాలను పోగొట్టగల తల్లి.
అర్కపురిలోని అందరింటిలో అనసూయేశ్వరా లయంలో నిండుగా కొలువుదీరిన మాతృశ్రీ అనసూయా మహాదేవిని “దుఃఖహంత్రి”గా దర్శించి, స్మరించి, భజించి తరించుదాం. జయహోమాతా! శ్రీ అనసూయా! ***