అవనిని మించిన సహనం
బవిరళమగు వత్సలత్వ మమ్మగ వచ్చెన్
భువిలో వెలసిన దైవము
ప్రవిమల చైతన్య నిధికి ప్రణతు లొనర్తున్.
అమ్మ పాదములకు అభిషేక మొనరింప
అందరింటి బిడ్డ లహరహమ్ము
ధాన్యసేకరణకు తల మున్క లగుచుండ
దీవనమ్ము లొసగు దివ్యజనని.
అమ్మ ఒడి బిడ్డ లెల్లరు
ఉమ్మడి ధాన్యాభిషేక మొనరింపంగా
ముమ్మరముగ కృషి సల్పుట
అమ్మకు అసలైన యట్టి అర్చన కాదే!
నిరతము బిడ్డల కొరకై
పరితాపము నొందు అమ్మ పదసన్నిధిలో
విరులై ధాన్యపు రానులు
వరములు కొల్లగ నొసగవే? వాంఛితరీతిన్.
నేలను చల్లిన గింజలు
కాలంబున ధాన్యమగును, గాదెలు నింపున్;
హేలగ అమ్మపదంబుల
వ్రాలిన ధాన్యము కురియ వరముల్, శుభముల్.
ధాన్యాభిషేకమునకై
ధాన్యము నందించువారు ధన్యులుగారే ?
అన్యమెరుంగని ఆ ‘ధన
ధాన్య వివర్ధిని’యె మిమ్ము దయతో జూచున్.
అందరి ఆకలి తీర్చగ
తొందరపడు అమ్మ మనసు; తోచిన రీతిన్
ముందుగ సమర్పణము మన
మందింపగ వలయు నిపుడె ఆప్యాయముగా.
పెక్కురు తినినను గానీ
ఒక్కరు తినకున్న యెడల ఓర్వని ప్రేమే
చక్కని తల్లిగ వచ్చెను.
మక్కువతో నడతు మమ్మ మార్గము నందున్
‘లోకములో నెవ్వారును
ఆకలితో అలమటించు టన్నది లేనే
లేకున్ననాడు అవనియె
నాకం’బను అమ్మ కెపుడు నతు లొనరింతున్.
ఈ కలిలో తనకెన్నడు
ఆకలి లేకున్న గాని అన్నార్తులకై
వ్యాకులపడు అమ్మ ఋణము
నే కరణిని తీర్చగలము ? ‘యిచ్చుట’ కంటెన్.
పిడికెడు గింజలు చల్లిన
కడివెడు సంపద లొనగెడు కరుణాబ్ధికినై
ఉడతా భక్తిని కొలుచుటె;
మడిమాన్యము లీయగలమె మాతృశ్రీకై.
అందరి ఇంటికి ధాన్యము
నందించు తలంపుతోడ అవిరామముగా
పొందికగా కృషి సేయగ,
అందించును అమ్మ మీకు ఆశీస్సుమముల్.
పదిమందికి పంచుటె సం
వదలకు మరి సాటిలేని పరమార్థమ్మౌ.
ఇది ‘అందరింటి’ పండుగ
హృదయము లుప్పొంగి ధాన్యమీయగ వలదే?
ఎందరు ఎప్పుడు వచ్చిన
విందులు సేయంగ దలచు విశ్వజననికై
‘అందరి యింటికి’ ధాన్యము
వందనములతోడ మనము పంపగ వలదే?